ఇన్వెస్టర్ల ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ యూకే సిన్హా శనివారం పేర్కొన్నారు. తమ విధానాన్ని వ్యాపార వర్గాలకు వ్యతిరేకమైనదిగా భావించరాదని సూచించారు. దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థకు సంబంధించి ప్రతిపాదించిన నిబంధనలను తదుపరి బోర్డ్ సమావేశంలో పెడతామని తెలియజేశారు. ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఒక వ్యక్తి ఎన్ని కంపెనీల్లో పనిచేయవచ్చన్న అంశంపై కూడా ఇందులో చర్చ జరుగుతుందని తెలిపారాయన. బోర్డు ఆమోదించాక మార్గదర్శకాలను ప్రకటిస్తామన్నారు.
జాతీయ ఎక్స్ఛేంజీల సభ్యుల సంఘం (ఏఎన్‌ఎంఐ) వార్షిక అంతర్జాతీయ సదస్సులో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకంగా సెబీ పనిచేస్తోందని కొందరు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, ఇలాంటి విమర్శలు తమను ఆవేదనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే చర్యలనే తాము తీసుకుంటున్నామని చెప్పారు. కాగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఇతర స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్యాపిటల్ మార్కెట్ల పురోభివృద్ధిలో ఇన్వెస్టర్ల విశ్వాస పెంపు చర్యలే కీలకమని వ్యాఖ్యానించారు.