బాధ్యతల స్వీకరణ అనంతరం ముంబై సెబీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తాజా మాజీ చీఫ్ అజయ్ త్యాగితో మాధవీ పురి
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ– సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌గా మాధవీ పురీ బుచ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సెబీకి ఒక మహిళ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. అలాగే ఈ కీలక బాధ్యతలు చేపట్టిన నాన్–బ్యూరోక్రాట్. ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న అజయ్ త్యాగి స్థానంలో 57 సంవత్సరాల పురీ నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఫిబ్రవరి 28వ తేదీన సెబీ చీఫ్‌గా బాధ్యతలు విరమించారు. ఫైనాన్షియల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవం మాధవీ పురీ సొంతం.
ఐసీఐసీఐ బ్యాంక్‌సహా ప్రయివేట్ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్‌లో ముగిసింది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి త్యాగితో కలసి 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబర్ 4వరకూ పలు విధులు నిర్వర్తించారు. సర్వీలియెన్స్, కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ పథకాలు, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ తదితర కీలక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్ధుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది.
విశేష అనుభవం
సెబీ పూర్తికాలపు సభ్యురాలిగా 2021 అక్టోబర్‌లో బాధ్యతలు విరమించిన అనంతరం డిసెంబర్‌లో సెబీ సెకండరీ మార్కెట్ కమిటీ అధినేత్రిగా ఎంపికయ్యారు. అంతేకాకుండా ఈ పదవీకాలంలో వివిధ పోర్ట్‌ఫోలియోల నిర్వహణ, పలు కమిటీలలో భాగస్వామ్యం వంటి బాధ్యతలు చేపట్టారు. సెక్యూరిటీ మార్కెట్ డేటాను పొందడం, ప్రైవసీ తదితర అంశాలలో విధాన చర్యలపై సలహాలు, సూచనలు అందించే అడ్వయిజరీ కమిటీకి అధ్యక్షత వహించారు. పురీ విద్యార్హతల విషయానికి వస్తే సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కెరీర్‌ను ప్రారంభించారు.
లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 1989లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 12 ఏళ్ల సర్వీసులో మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు ఎండీ, సీఈవోగా పదోన్నతి పొందారు. 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2011లో పీఈ కంపెనీ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్‌ఎల్‌పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు. తదుపరి బ్రిక్స్ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో కన్సల్టెంట్‌గా సేవలందించారు. ఇవికాకుండా అగోరా అడ్వయిజరీ ప్రయివేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా విధులు నిర్వహించారు.
బలమైన పునాది వేసిన త్యాగికి కృతజ్ఞతలు: పురి
సెబీ పటిష్ట పనితీరుకు సంబంధించి తగిన బలమైన పునాదులు వేసిన సెబీ తాజా మాజీ చీఫ్ అజయ్ త్యాగికి కృతజ్ఞతలని బాధ్యతల స్వీకరణ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మాధవీ పురీ పేర్కొన్నారు. ‘మీరు మాకు అందించిన బలమైన పునాదిపై వ్యవస్థను పటిష్టంగా నిర్మించడానికి ఎదురుచూస్తున్నాను’’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో త్యాగికి ఘన సన్మానం జరిగింది.
ఎన్‌ఎస్‌ఈ కేసు సత్వర పరిష్కారానికే ప్రయత్నించాం: త్యాగి
చిత్రా రామకృష్ణకు సంబంధించి కో లొకేషన్ స్కామ్ (సర్వర్ల డేటాను ముందుగా వినియోగించుకునే అవకాశం కొందరు బ్రోకర్లకు కల్పించడం) , హిమాలయ యోగి సూచనల మేరకు నడుచుకున్నారన్న ఆరోపణల విషయంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో తీవ్ర అవకతవకల కేసును సత్వరం పరిష్కరించేందుకే ప్రయత్నించినట్లు సెబీ మాజీ చైర్మన్ త్యాగి బుధవారం మీడియాతో అన్నారు. ఎన్‌ఎస్‌ఈ కేసులో తన ఉత్తర్వులు ఇవ్వడానికి సెబీ తాత్సారం చేసిందన్న విమర్శల నేపథ్యంలో, అసలు ఈ కేసులో ‘అవసరమైన శిక్షార్హత‘ చర్య తీసుకుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఈ వార్తల నేపథ్యంలో త్యాగి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. క్వాజీ–జ్యుడీషియల్ (అడ్మినిస్టేటివ్ లేదా ఎగ్జిక్యూటివ్ అధికారి నిర్వహించే విచారణ పక్రియ) తీర్పుల విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ ఎప్పుడూ ఎటువంటి తాత్సారం చేయలేదని స్పష్టం చేశారు. కో–లొకేషన్ ఆరోపణల విషయంలో సెబీ తన అవగాహన ప్రకారమే వ్యవహరించిందని అన్నారు. 2018లో వచ్చిన ఈ ఆరోపణలపై రూలింగ్‌ను 2022 ఫిబ్రవరిలో ఇవ్వడానికి కోవిడ్ సంబంధ సవాళ్లు కారణం తప్ప, దీనిలో ఉద్దేశపూర్వక ఆలస్యం ఏదీ లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ మధ్య కాలంలో ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment