గురుగ్రామ్: ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం అందిస్తున్న భారీ మూలధన సాయంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) మరిన్ని రుణాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వృద్ధిని పెంచే దిశగా మూడో చోదక శక్తి అయిన ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడంతోపాటు ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందన్నారు.
భారీ మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారాన్ని మోస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ)కు బడ్జెట్, రీక్యాపిటలైజేషన్ బాండ్లు, వాటాల విక్రయ రూపంలో వచ్చే రెండేళ్ల కాలంలో రూ.2.11 లక్షల కోట్ల మేర మూలధనం అందించాలని కేంద్ర సర్కారు గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో ‘íపీఎస్‌బీ మంతన్’ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న అరుణ్ జైట్లీ ప్రభుత్వరంగ బ్యాంకుల సార«థులను ఉద్దేశించి మాట్లాడారు.
‘‘ఆర్థిక వృద్ధికి చోదక శక్తులైన ప్రజా పెట్టుబడులు, విదేశీ నిధుల రాక గణనీయంగా పెరిగినప్పటికీ, ప్రైవేటు పెట్టుబడులు మాత్రం వెనుకబడ్డాయి. ఇవి కూడా పెరగాల్సి ఉంది. ప్రైవేటు పెట్టుబడులు, ఎంఎస్‌ఎంఈ రంగాల బలోపేతంతో ఆశావహ వృద్ధి రేటును సాధించగలం’’ అని జైట్లీ వివరించారు. బ్యాంకుల ప్రాధాన్యతా రంగాల్లో ఎంఎస్‌ఎంఈ ఒకటని చెప్పారు. ఈ రంగం ఉపాధిని కల్పించడమే కాకుం డా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయగలదని వివరించారు. బ్యాంకుల వాణిజ్య లావాదేవీల్లో ప్రభుత్వం జోక్యం ఉండదని జైట్లీ హామీ ఇచ్చారు.
సంస్కరణలతోనే నిధులు...
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల నిధుల సాయాన్ని పొందడం అంత సులభమేమీ కాదని కేంద్ర ఆర్థిక శాఖా సెక్రటరీ రాజీవ్‌కుమార్ అన్నారు. పీఎస్‌బీ మంతన్ సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రీక్యాపిటలైజేషన్ సాయం సంస్కరణలతోనే ముడిపడి ఉంటుంది. స్వల్ప వ్యవధిలోపే ఎలా ముందుకు వెళ్లేదీ ప్రతీ బ్యాంకు బోర్డు ఆలోచించుకోవాలి. స్థిరీకరణకు సంబంధించి ప్రభుత్వరంగ బ్యాంకుల బోర్డులు నిర్ణయాలు తీసుకుని, ప్రణాళికలతో ముందుకు రావాల్సి ఉంటుంది’’ అని కుమార్ స్పష్టం చేశారు.
ఏబీఏ సదస్సుకు తొలిసారిగా ముంబై వేదిక
ఏషియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ఏబీఏ) 34వ వార్షిక సదస్సుకు తొలిసారి దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదిక కానుంది. ఈ నెల 16 నుంచి రెండు రోజుల పాటు ఇది జరుగుతుంది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్యతోపాటు దేశ, విదేశాలకు చెందిన 160 బ్యాంకర్లు ఇందులో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment