ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాం | P. Chidambaram slams Budget 2014 critics, says saved Indian economy | Sakshi
Sakshi News home page

ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాం

Published Wed, Feb 19 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాం

ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాం

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందంటూ ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి పి. చిదంబరం తిప్పికొట్టారు. క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోపెట్టడంలో తాము సమర్థంగా వ్యవహరించామని పేర్కొన్నారు. మళ్లీ అధిక వృద్ధిబాటలోకి వచ్చేలా అనేక చర్యలు చేపట్టినట్లు విత్తమంత్రి చెప్పారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనంతరం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రజాకర్షక బడ్జెట్‌గా దీన్ని అభివర్ణించడాన్ని ఆయన తోసిపుచ్చారు.

 ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వాల మాదిరిగానే గత రెండుమూడేళ్లుగా తాము కూడా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి చికిత్స కోసం ప్రయత్నించాల్సి వచ్చిందని విత్తమంత్రి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో జీడీపీ వృద్ధిరేటు 4.4 శాతానికి పడిపోగా... క్యూ2లో 4.8 శాతానికి పెరగిందన్నారు. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్‌ఓ) అంచనాల మేరకు క్యూ3, క్యూ4లలో కనీసం 5.2 శాతం వృద్ధి చెందనుందని చిదంబరం పేర్కొన్నారు. చాలా కొద్ది దేశాల్లో మాత్రమే ఈ స్థాయి వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. పూర్తి ఏడాదికి వృద్ధి రేటు 4.9 శాతంగా ఉండొచ్చని సీఎస్‌ఓ ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

 పూర్తి సంతృప్తి లేదు...
 ‘మా ప్రభుత్వ పనితీరుపై పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. అయితే, కొన్ని లక్ష్యాలను సాకారం చేయడం విషయంలో మేం విజయం సాధించాం. భవిష్యత్తులో భారత్ ప్రబల ఆర్థికశక్తిగా ఎదిగేందుకు అవసరమైన పది సూత్రాల ప్రణాళికను కూడా నా బడ్జెట్ ప్రసంగం చివర్లో వివరించాను. వీటిని అమలు చేస్తే కచ్చితంగా అధిక వృద్ధి బాటలో పయనించగలుగుతాం’ అని చిదంబరం పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ), ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ), బీమాలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పెంపు ఇతరత్రా కొన్ని బిల్లులు ఆమోదం పొందకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటి ఆమోదానికి ఏకాభిప్రాయాన్ని తీసుకురాలేకపోయామని చెప్పారు.

 పలు అంశాలపై ఇంక ఆయన ఏమన్నారంటే...
 ఓటాన్ అకౌంట్‌కు స్పందనపై...
 వాస్తవానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో సాదాసీదాగా ఎలాంటి కీలక చర్యలూ ఉండవని(నాన్-ఈవెంట్) అందరూ భావిస్తారు. కానీ, దీనిపై కూడా వెల్లువెత్తుతున్న స్పందనలను చూస్తుంటే... మా మద్దతుదారులతో పాటు విమర్శకుల దృష్టినీ ఆకర్షించాం. మేం కొన్ని చర్యలు చేపట్టామని అందరూ గుర్తించారు. గతేడాది మేం ఇన్వెస్టర్ల విశ్వాసం పెంపు, రేటింగ్ ఏజెన్సీలకు తగిన హామీ ఇచ్చేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిసారించాం. అందుకే ఎలాంటి పన్ను తగ్గింపులకు ఆస్కారం లేకుండా పోయింది. అయితే, గత 5 నెలలుగా తయారీ, యంత్ర పరికరాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాలు  దిగజారడంతో మధ్యంతర బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాల్లో కోత చర్యలు ప్రకటించాం.

 సబ్సిడీలపై...
 సబ్సిడీలకు ఎడాపెడా డబ్బు ఖర్చుపెట్టారన్న విమర్శలు రాజకీయంగా సర్వసాధారణం. దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలకు చౌకగా ఆహారధాన్యాలు, కిరోసిన్ అవసరం ఉంది. వీళ్ల  డిమాండ్‌లక ఏ ప్రభుత్వమైనా  తలొగ్గాల్సిందే. పార్లమెంట్‌లో, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అత్యధిక శాతం మంది డిమాండ్ చేశారు కాబట్టే మేం సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 12కు పెం చాం(రాహుల్ గాంధీ డిమాండ్ చేశారనే ఈ చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నకు).

 పసిడి నియంత్రణలపై...
 బంగారం దిగుమతులపై నియంత్రణలను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని చిదంబరం పేర్కొన్నారు. ఈ ఏడాది(2013-14) కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) జీడీపీలో 2.5% దిగువకు(45 బిలియన్ డాలర్లు) కట్టడికానున్న నేపథ్యంలో దీనిపై దృష్టిసారిస్తామన్నారు. బంగారం దిగుమతులు భారీగా ఎగబాకడంతో క్యాడ్ గతేడాది చరిత్రాత్మక గరిష్టాన్ని(4.8%) తాకడం తెలిసిందే. దీంతో వీటికి అడ్డుకట్టవేయడం కోసం పసిడిపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం దశలవారీగా 10%కి పెంచడం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement