కర్నూలు (రాజ్‌విహార్) : ఈ సారి కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినా.. రైల్వే మంత్రిత్వ శాఖను దక్కించుకోలేకపోయింది. రైల్వే బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి రాయితీలు సాధించలేకపోయింది. కర్నూలు జిల్లా ప్రజలకు ఎప్పటిలాగే నిరాశే మిగిలింది. ఎన్నో ఆశల నడుమ ఊరించిన ఎన్‌డీఏ తొలి రైల్వే బడ్జెట్ ఊహలకు అందనిరీతిలో ఉసూరుమనిపించింది. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం ప్రకటించిన ఈ బడ్జెట్‌లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది.
కొత్త ప్రాజెక్టుల ఊసు అసలు లేకపోగా.. పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావనే ఎత్తలేదు. గత రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వర్క్‌షాపు నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. దశాబ్దాల కాలంగా డిమాండ్‌లో ఉన్న కర్నూలు- మంత్రాలయం రైలు మార్గానికి పట్టిన గ్రహణం వీడలేదు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతికి రూ.2 వేల కోట్లు కావాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న 29 ప్రధాన ప్రాజెక్టుల స్థితి గతులను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయడం తప్ప బడ్జెట్‌తో ఏమీ ఒరగలేదని చెప్పవచ్చు.
ప్రతిపాదనలకు రెడ్ సిగ్నల్..
కర్నూలులో రైల్వే మిడ్‌లైఫ్ రీహామిటిటేషన్ వర్క్‌షాపును ఏర్పాటు చేసేందుకు 2013 బడ్జెట్‌లో గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు మూడు సార్లు నగర శివారులోని పంచలింగాల వద్ద స్థల పరిశీలన చేసినా సేకరణ జరగలేదు. దీనికి రూ. 250 కోట్లు కావాలని అధికారులు అంటున్నా ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు.
దూపాడు వద్ద ట్రైన్ మెయింటెనెన్స్ (నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని నాటి మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2 కోట్లు కావాల్సి ఉన్నా ఎలాంటి కేటాయింపుల్లేవు.
మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త లైను కోసం గతంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు సర్వే పనులకు గ్రీన్ లభించింది. రెండు సార్లు సర్వే చేసి నిధులు దుర్వినియోగపర్చారు తప్ప ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈసారి కూడా ఆ లైను ఊసేలేదు.
ఎర్రగుంట్ల-నంద్యాల లైను పెండింగ్ పనుల ప్రస్తావన లేదు. గుంటూరు - గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా పురోగతి మాటేలేదు.
సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణకు నిధుల్లేవు.
హొస్పేట - మంత్రాలయం - కర్నూలు - శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడపాలనే డిమాండ్‌కు మోక్షం లభించలేదు.
కాచిగూడ - బెంగళూరు వరకు గరీబ్థ్‌క్రు, విజయవాడ నుంచి నంద్యాల, డోన్, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లేదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే జిల్లా కేంద్రం కర్నూలు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. అయితే గుంటూరు వరకు రెండు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. విజయవాడ వరకు కనీసం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉన్నా ప్రస్తావన లేదు.
చెన్నై - హైదరాబాద్ మధ్య హై స్పీడు ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతామని ప్రకటించినా.. ఏ మార్గాన నడుపుతారో స్పష్టం చేయలేదు.
బెంగళూరు నుంచి కాచిగూడకు ప్యాసింజరు రైలు ప్రకటించినా కర్నూలు మీదుగా వస్తుందో లేదో తెలియదు.
జిల్లాలో ఆగని ‘గౌడ’ రైలు
Published Wed, Jul 9 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement