train coaches
-
రైలులో టాయిలెట్లను పర్యవేక్షించిన మంత్రి: వీడియో వైరల్
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు బోగీలలోని కొత్తగా రూపొందించిన టాయిలెట్ల డిజైన్లను తనఖీ చేశారు. కొత్త హంగులతో ఆధునికరించిన మరుగుదొడ్లను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. అక్కడ ఒక వ్యక్తి చేసిన వర్క్ గురించి మంత్రికి వివరిస్తున్నాడు. ఆ వీడియోలో చాలా వరకు మరుగుదొడ్లను బాగా ఆధునీకరించారు. మంత్రి అశ్విన్ స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ చక్కగా ఉండేలా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ట్రైయిన్లు కూడా చెత్తతో పేరుకుపోయి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవడమే కాకుండా ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. పైగా ప్రజలను కూడా రైళ్లు శుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా దీనికి సహకరించాలని విజ్క్షప్తి చేశారు కూడా. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని రైల్వే మంత్రి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు చాలా బాగా చేస్తున్నారు మంత్రి గారు, భవిష్యత్తులో కూడా ఇలానే మెయింటెన్ చేస్తే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తూ..ట్వీట్ చేశారు. Inspected the new upgraded toilet designs for existing coaches. pic.twitter.com/2v426YZiEy — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 31, 2023 (చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకత ఏమి లేదు: కాంగ్రెస్ చీఫ్ ఎం ఖర్గే) -
3 లక్షల ఐసోలేషన్ పడకలు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో భారతీయ రైల్వే శాఖ కూడా తన వంతు సాయం అందించేందుకు సిద్ధమైంది. 20 వేల రైల్వే కోచ్‌లను కరోనా బాధితుల కోసం సిద్దం చేశామని మంగళవారం ప్రకటించింది. తద్వారా 3.2 లక్షల ఐసోలేషన్ పడకలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించింది. బోగిలోని ప్రతీ క్యాబిన్ ను ఒక రోగికి వసతి కల్పించేలా ఐసోలేషన్ వార్డుగా మార్చింది. కరోనా వైరస్ బాధితునికి అవసరమైన అన్ని సదుపాయాలకు వీలుగా వీటిని రూపొందించామని తెలిపింది. అలాగే పడకల మధ్య రెండు అడుగుల దూరాన్ని ఉంచడం కోసం మిడిల్ బెర్తులను తొలగించామని సంస్థ విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఐదు జోనల్ రైల్వేలు క్వారంటైన్ ఐసోలేషన్ కోచ్ లతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. కోవిడ్ -19 రోగులకు మరిన్ని సోలేషన్ వార్డులను రూపొందించే ప్రయత్నాలను రైల్వే మంత్రిత్వ శాఖ ముమ్మరం చేసింది. 5 వేల బోగీలను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చే పని ఇప్పటికే ప్రారంభమైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా మరో 80వేల పడకలు సిద్ధం కానున్నాయని తెలిపింది. రైల్వే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, ఆయుష్మాన్ భారత్‌తో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. కరోనాను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ ఏడవ రోజుకు చేరుకుంది. దేశంలోకరోనా పాజిటివ్ సంఖ్య పెరుగతున్న నేపథ్యంలో కరోనా రోగులకు అవసరమైన అధునాతన పడకల అవసరాలను తీర్నునున్నామని రైల్వే శాఖ ప్రకటించిన సంగతి విదితమే. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాల తయారీకిగాను లోకోమోటివ్ ప్రొడక్షన్ యూనిట్లను ఉపయోగించుకునే పనిని భారతీయ రైల్వే ఇప్పటికే ప్రారంభించింది. దీనికితో 266 రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులకు మార్చాలని నార్త్-వెస్ట్రన్ రైల్వే (ఎన్‌డబ్ల్యుఆర్) యోచిస్తోంది. -
అయ్యయ్యో.. ఏసీ బోగీలు కనబడడం లేదు..!
రైళ్లలో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, నల్లాలు, కొన్ని సందర్భాల్లో వాష్ బేసిన్లు సైతం చోరీకి గురికావడం, ఏసీ రైళ్లలోనైతే చేతి తువాళ్లు, బ్లాంకెట్లు వంటివి మాయమవుతున్న ఘటనలు ఇతర దేశాల్లోనైతే ఆశ్చర్యంగా చూస్తారు కాని... ఇక్కడైతే ఇదంతా మామూలే అన్నట్టుగా మనవాళ్లు పెద్దగా పట్టించుకోరు. రైళ్లలో ప్రవేశపెట్టిన ‘బయో టాయ్లెట్ల’లోని స్టెయిన్లెస్స్టీల్ డస్ట్బిన్లు కూడా దొంగతనానికి గురవుతున్న జాబితాలో చేరిపోయాయి. అయితే తాజాగా ఏకంగా రైలు బోగీలే అవీ కూడా ఏసీ కోచ్‌లు కొన్ని కనిపించకుండా పోయాయనే వార్తలు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాయి. వీటి ప్రకారం రాంచీ–న్యూఢిల్లీల మధ్య నడిచే రాజధాని, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించిన కొన్ని కొత్త బోగీలు రాంచీ రైల్వే డివిజన్ యార్డు నుంచి మాయమై పోయాయి. ఈవిధంగా కొన్ని బోగీలకు బోగీలే కనబడకుండా పోవడం పెద్ద కలకలాన్నే సృష్టించింది. రాజధాని, సంపర్క్ క్రాంతి రైళ్లలో జతచేయాల్సిన ఈ బోగీలు మిస్ కావడంతో వాటి స్థానంలో పాత రైలు డబ్బాలతోనే రైల్వేశాఖ పని కానీచ్చేస్తోంది. ఇటీవల రాంఛీ నుంచి బయలుదేరాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మూడోబోగీలు కదలకుండా మొరాయించడంతో ప్రయాణీకులు పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు. అధునాతన సౌకర్యాలున్న రైళ్లుగా పరిగణిస్తున్న రాజధాని వంటి రైళ్ల కోసం తెప్పించిన కొత్త కోచ్‌లు ఏమయ్యయో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రైలు డబ్బాలు కనిపించకుండా పోవడం వెనక పెద్ద ముఠాయే పనిచేస్తున్నట్టు ఉందని సందేహాలు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. అంతకు ముందు కూడా ఒకటో రెండో ఇలాంటి ఘటనలు జరిగినా ఇప్పుడు ఏకంగా కొన్ని ఏసీ బోగీలే కనిపించకుండా పోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఏసీ బోగీలు కనబడకుండా పోయాయన్న వార్తలపై రాంచీ డివిజన్ అధికారి స్పందించినట్టు ఓ పత్రిక వెల్లడించింది. ‘తమ డివిజన్‌లోనే వీటిని ఉపయోగిస్తున్నట్టు మేము మార్క్ చేశాం. ఈ కోచ్‌లు ఉత్తరాది డివిజన్లో వినియోగంలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఈ ఏసీ బోగీలను తిరిగి తమకు అప్పగించాలంటూ ఉత్తరాది రైల్వేకి ఆగ్నేయ రైల్వే లేఖ రాసింది. త్వరలోనే అవి వెనక్కు వస్తాయని ఆశిస్తున్నాం’ ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. చిన్న చిన్న చోరీలు ఎక్కువే... 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం...2015లో రైళ్లలో చోటుచేసుకున్న చోరీ కేసులు 9.42 లక్షలుండగా, 2016లో ఈ సంఖ్య11 లక్షలకు చేరుకుంది. వీటిలో 2 లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 1.24 లక్షల కేసులతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో నిలిచాయి. 2016–17లో చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కోచింగ్ డిపో పరిధిలో 817 బయో టాయ్‌లెట్లున్నాయి. దీని పరిధిలో 3,601 స్టీల్ డస్ట్బిన్లు కనబడకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్లోని సీయల్దా కోచింగ్ డిపో పరిధిలో 1,304 బయో టాయ్లెట్లుండగా 3,536 చోరీకి గురైనట్టు అధికారులు తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విస్మయం.. కొత్త రైలు బోగీలు కొట్టేశారు!
రాంచీ, జార్ఖండ్ : భారతీయ రైల్వేకు చెందిన రైలు బోగీలు కనిపించకుండా పోవడం జార్ఖండ్‌లో కలకలం రేపుతోంది. ప్రీమియం రైళ్ల కోసం రాంచీ రైల్వేస్టేషన్‌కు అధికారులు ఆధునిక బోగీలను తెప్పించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం ఈ బోగీలను తెప్పించినట్లు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఢిల్లీ-రాంచీల మధ్య నడిచే రైళ్లకు వీటిని అమర్చాలని రాంచీ అధికారులు భావించి వాటిని స్టేషన్ యార్డులో ఉంచారు. అయితే, అవి అక్కడి నుంచి కనిపించకుండా పోవడంతో వారు అవాక్కయ్యారు. బోగీల మాయం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
దివ్యాంగులకు ప్రత్యేక బోగీలు
నాగ్‌పూర్: దివ్యాంగుల ప్రయాణ సౌకర్యార్థం రైల్వే శాఖ 2018 నాటికి 3 వేల ప్రత్యేక బోగీలను తయారుచేయనుంది. వీటిలో దివ్యాంగుల ప్రయాణం సజావుగా సాగేలా పలు వసతులను కల్పించనున్నట్లు దివ్యాంగుల విభాగం ముఖ్య కమిషనర్ కమలేశ్ పాండే చెప్పారు. నాగ్‌పూర్ జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన పథకాల సమీక్ష సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక బోగీలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారని, వీటిలో ఎక్కువ సీట్లు, అధిక స్థలంతో పాటు వీటిని గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక చిహ్నాలను అమరుస్తామని తెలిపారు. ముంబై, నాసిక్, నాగ్‌పూర్‌లోని సుమారు180 ప్రభుత్వ భవనాలను దివ్యాంగులకు అనుకూలంగా మార్చేందుకు వాటిలో ర్యాంపులు, లిఫ్టులు లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. -
కదిలే కళాఖండం
చేయి తిరిగిన కళాకారుడు తీర్చిదిద్దిన అద్భుత కళాఖండంలా కనిపిస్తున్న ఈ చిత్రం ఫ్రాన్స్‌లోని ఓ రైలు బోగీ అంతర్భాగం. దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో ఆసక్తి కల్పించేందుకు ఆ దేశ రైల్వే అమెరికాలోని ఓ సంస్థ సహకారంతో రైలు బోగీల్ని ఇలా తీర్చిదిద్దింది. దేశంలోని ప్రసిద్ధ రాజప్రాసాదాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ప్రపంచంలో అత్యంత ప్రాచీన సినిమా కంపెనీ ‘సినిమా గౌమెంట్’కి సంబంధించిన చిత్రాల గ్రాఫిక్స్‌తో బోగీలను ఇలా తీర్చిదిద్దింది. -
రైలు బోగీలపై రమణీయ దృశ్యాలు
న్యూఢిల్లీ: సాదాసీదాగా కనిపిస్తున్న రైల్వే బోగీలు.. ఇకపై ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఆకర్షణీయంగా మారనున్నాయి. వాటిపై రకరకాల వన్యప్రాణులు, ప్రకృతి దృశ్యాలను బోగీలపై ముద్రించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. పర్యాటకాభివృద్ధి కోసం రైల్వే బోగీలు, స్టేషన్లలో వివిధ రకాల ఆకర్షణీయ దృశ్యాలను ముద్రించాల్సిందిగా ప్రపంచ వన్యప్రాణి నిధి(డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి ఆవాసాలు, పక్షులు, జంతువులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడంతో పాటు పర్యాటకానికి ఊతమిచ్చినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాజస్తాన్‌లోని సవాయి మాధోపుర్, భరత్‌పుర్‌లోని స్టేషన్లలో, నిజాముద్దీన్-కోటా జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బోగీలపై మొదటిసారిగా ఈ ప్రాజెక్టు అమలుపరచనున్నారు. -
కాలువలో పడిన పాక్ ఆర్మీ రైలు; 12మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని మోజా చాందన్వాన్ ప్రాంతం గుజరాన్‌వాలా సమీపంలో గురువారం మధ్యాహ్నం ఆర్మీ స్పెషల్ రైలుకు ప్రమాదం సంభవించింది. గుజరాన్‌వాలా వద్ద బ్రిడ్జిని దాటుతున్న సమయంలో ఆకస్మాత్తుగా నాలుగు బోగీలు పట్టాలు తప్పి కాలవలో పడటంతో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, 100మందికి పైగా గాయాలు అయినట్టు తెలుస్తోంది. కనీసం నలుగురు గల్లంతైనట్టు తెలిసింది. 21 సరుకు రవాణా బోగీలు, 6 ప్రయాణికుల బోగీలతో వెళుతున్న ఈ అర్మీ రైలులో నాలుగు బోగీలు కాలువలోకి ఒరిగాయి. సమాచారం అందుకున్న పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఈతగాళ్లు ఘటనా స్థలికి చేరుకుని కాలువలోకి పడిపోయిన మూడు బోగీలనుంచి ప్రయాణికులను రక్షించారు. అయితే నాలుగో బోగీ పూర్తిగా కాలవలోకి ఒరిగిపోవడంతో అక్కడికి తొందరగా చేరుకోలేకపోయామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇంజిన్ డ్రైవర్‌తో పాటు ఫైర్మెన్ను రక్షించినట్టు పాక్ రైల్వే సీనియర్ జనరల్ మేనేజర్ జవేద్ అన్వర్ తెలిపారు. ఈ ఘటనతో ఆర్మీ అధికారులు.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. నాలుగు హెలికాఫ్టర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు బోగీ పైకప్పును తొలగించేందుకు ఆర్మీ సిబ్బంది ప్రయత్నించారు. ఇంతలో ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కాలువలోకి నీరు రాకుండా నిలిపివేశారు. దాదాపు మూడుగంటలపాటు ఈ రిస్కూ ఆపరేషన్ కొనసాగింది. అయితే పడిపోయిన జంట బోగీలలో చిక్కుకున్న 20 నుంచి 30 మంది సైనికులు సహా వారి కుటుంబాలను రక్షించినట్టు ఒక నివేదికలో వెల్లడైంది. రైల్వే శాఖ మంత్రి ఖాజా సయిద్ రఫ్కీ ఈ ఘటనపై స్పందించారు. ఆర్మీ రైలు ప్రమాదానికి వెనుక ఉగ్రవాదులు దాడికి కూడా అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
రైల్వే బడ్జెట్లో సౌకర్యాలకే పెద్దపీట!
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాను ప్రవేశపెట్టనున్న తొలి రైల్వే బడ్జెట్లో ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తోంది. మెరుగైన సదుపాయాలు, ప్రతి బోగీలోనూ పారిశుధ్య సిబ్బందితో కూడిన కొత్త డిజైన్ బోగీలను 2014-15 బడ్జెట్లో ప్రతిపాదించనుంది. ఈ నెల 8వ తేదీన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రైలు బోగీలను నిరంతరం శుభ్రంచేయటానికి, రైల్వే స్టేషన్లను శుభ్రంగా ఉంచటానికి, చర్యలు ప్రకటించనుంది. బోగీల్లో అంతర్గత సదుపాయాలను మరింతగా మెరుగుపరుస్తూ పైలట్ ప్రాజెక్టుగా 12 బోగీలను తయారు చేయనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన సదుపాయాలతో కూడిన 25 ఏసీ, నాన్-ఏసీ బోగీలతో ఒక రైలును ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. అలాగే రైలు బోగీల్లో రంగులను సమీక్షించటం కోసం ప్రొఫెషనల్ సంస్థలను రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు తెలిసిం ది. ఈ ఏడాది కొత్తగా 4,000 బోగీలను తయారు చేయాలని రైల్వేశాఖ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత, రక్షణ కోసం రైల్వేమంత్రి సదానందగౌడ చర్యలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. -
రైలు బండికి భద్రతేదీ?
=బోగీల శుభ్రత, నిర్వహణ అంతా ప్రైవేటు వారి చేతుల్లో =300 మందికి గాను 56 మందే ట్రైన్ లైటింగ్ సిబ్బంది =ఒక్క ఏసీ బోగీకీ అటెండెంట్ లేరు తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ‘కలియుగ ప్రత్యక్ష దైవ కృపాకటాక్షాల వల్లో..ఏమో మరి తిరుపతి రైల్వే డిపో పరిధిలో ఎలాంటి భారీ ప్రమాదాలు సంభవించడం లేదు. కానీ మన రైలు బండ్లు ఎంత వరకు భద్రం అన్న అంశంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి’ అని కార్మిక సంఘాలు, రైల్వే ప్రయాణికుల సలహా కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయినా వీరి గోడు పట్టించుకునే లేకుండా పోయారు. తిరుపతి రైల్వే డిపో పరిధిలో రోజుకు 60 రైళ్ల నిర్వహణ చేపడుతున్నారు. అందులో రైలు బోగీల శుభ్రత, లైటింగ్ రిపేర్లు, పర్యవేక్షణ, ఇంజినీరింగ్ విభాగం ద్వారా గ్రీసింగ్, బోగీల బోల్టుల ఫిటింగ్ తదితర పనులన్నీ చూడ్డానికి సీఅండ్‌డబ్ల్యూ, మెకానిక్ విభాగాలున్నాయి. వీటిలో బోగీల శుభ్రత నుంచి ఏసీ బోగీల్లో బెడ్‌రోల్ ఏర్పాటు వరకు అన్ని కార్యక్రమాలనూ ప్రైవేటు ఏజెన్సీకి మూడేళ్ల క్రితమే అప్పగించేశారు. ఇప్పుడు రైలు బోగీల శుభ్రత, లైటింగ్, వైరింగ్ పనుల పరిశీలన కోసం ఆ ప్రైవేటు ఏజెన్సీ వారు నియమించుకున్న సిబ్బందిలో 80 శాతం మంది బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం గమనార్హం. ప్రైవేటు ఏజెన్సీపై, వారి పరిధిలోని కార్మికులపై అజమాయిషీ చేసేందుకు స్థానిక అధికారులెవరైనా సాహసిస్తే వారికి బదిలీ వేటు తప్పదు. అంతేగాక ఏజెన్సీ కార్మికులకు నెలకు రూ.3 వేల జీతం ఇస్తున్నారు. రోజుకో వ్యక్తిని విధుల్లోకి తీసుకోవడం వల్ల కూడా రైలు బోగీల శుభ్రత, భద్రత అంశాలు డొల్లగా మారా యి. బోగీల్లో ఫ్యాన్లు, లైటింగ్ వైర్లు, ఇతరత్రా ఎలక్ట్రికల్ పనులను యార్డు లైన్లలో తని ఖీచేసి సరిచేసేందుకు ట్రైన్ లైటింగ్ సిబ్బంది ఉం టారు. తిరుపతి పరిధిలో 300 మందికి గాను కేవలం 56 మంది మా త్రమే పనిచేస్తున్నారు. ఏసీ బోగీల్లో కనపడని అటెండెంట్లు ఒక్కో ఏసీ బోగీకి ఏసీ అటెండెంట్ ఉండాలన్నది రైల్వే నిబంధన. తిరుపతి పరిధిలో నుంచి నిర్వహణ ముగిం చుకుని వెళ్లే రైళ్లలో ఒక్క అటెండెంట్ లేరు. ఈ అటెం డెంట్ ఏసీ బోగీలోని ప్రయాణికులు దిగాల్సిన చోట, ఎక్కే చోట వేకప్కాల్ ఇవ్వడం, హాల్ట్ స్టేషన్ రాగానే డోర్లు తెరవడం చేయాలి. ఏసీ బోగీల్లోని ప్రయాణికులకు అవసరమైన బెడ్షీట్లు, బెర్త్‌ల కవర్లు బెడ్‌రోల్ సిబ్బంది ఏర్పాటు చేయాలి. గతంలో ఈ పనులన్నీ రైల్వేశాఖకు చెందిన ఉద్యోగులే చేసేవారు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారు. వారు నిత్యం ప్రయాణికుల పట్ల గొడవలు పడడానికే సమయం సరిపోతోంది. అందులో భాగంగానే ఇటీవల నాందేడ్, కొల్హాపూర్ ప్రాంతాల్లో ఇద్దరు రైల్వే పోలీస్ సిబ్బందిని రైలు లో నుంచి తోసేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ మానుకోవాలి రైళ్లలోని ప్రయాణికుల భద్రతతో ముడిపడి ఉన్న అంశాల్లో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణను పూర్తిగా మానుకోవాలి. ముఖ్యంగా బోగీల శుభ్రత, లైటింగ్ పనుల్లో రైల్వే సిబ్బందినే నియమిస్తే ప్రమాదాలు జరగవు. - కే.కళాధర్, డివిజనల్ కార్యదర్శి, రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రమాద కారణాలకు చెక్ పెట్టాలి రైళ్లలో ప్రమాదాలకు కారణమైన అంశాలకు చెక్ పెట్టేలా అధికారుల చర్యలు చేపట్టాలి. బయటి రాష్ట్రాల వ్యక్తులకు రైళ్ల నిర్వహణా బాధ్యతలు అప్పగించరాదు. రైల్వే నిబంధనలు పాటించాలి. ఖాళీలను భర్తీ చేయాలి. -సుదర్శనరాజు, బ్రాంచి సెక్రటరీ, తిరుపతి