ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని మోజా చాందన్వాన్ ప్రాంతం గుజరాన్వాలా సమీపంలో గురువారం మధ్యాహ్నం ఆర్మీ స్పెషల్ రైలుకు ప్రమాదం సంభవించింది. గుజరాన్వాలా వద్ద బ్రిడ్జిని దాటుతున్న సమయంలో ఆకస్మాత్తుగా నాలుగు బోగీలు పట్టాలు తప్పి కాలవలో పడటంతో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, 100మందికి పైగా గాయాలు అయినట్టు తెలుస్తోంది. కనీసం నలుగురు గల్లంతైనట్టు తెలిసింది. 21 సరుకు రవాణా బోగీలు, 6 ప్రయాణికుల బోగీలతో వెళుతున్న ఈ అర్మీ రైలులో నాలుగు బోగీలు కాలువలోకి ఒరిగాయి. సమాచారం అందుకున్న పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఈతగాళ్లు ఘటనా స్థలికి చేరుకుని కాలువలోకి పడిపోయిన మూడు బోగీలనుంచి ప్రయాణికులను రక్షించారు. అయితే నాలుగో బోగీ పూర్తిగా కాలవలోకి ఒరిగిపోవడంతో అక్కడికి తొందరగా చేరుకోలేకపోయామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇంజిన్ డ్రైవర్తో పాటు ఫైర్మెన్ను రక్షించినట్టు పాక్ రైల్వే సీనియర్ జనరల్ మేనేజర్ జవేద్ అన్వర్ తెలిపారు.
ఈ ఘటనతో ఆర్మీ అధికారులు.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. నాలుగు హెలికాఫ్టర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు బోగీ పైకప్పును తొలగించేందుకు ఆర్మీ సిబ్బంది ప్రయత్నించారు. ఇంతలో ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా కాలువలోకి నీరు రాకుండా నిలిపివేశారు. దాదాపు మూడుగంటలపాటు ఈ రిస్కూ ఆపరేషన్ కొనసాగింది. అయితే పడిపోయిన జంట బోగీలలో చిక్కుకున్న 20 నుంచి 30 మంది సైనికులు సహా వారి కుటుంబాలను రక్షించినట్టు ఒక నివేదికలో వెల్లడైంది.
రైల్వే శాఖ మంత్రి ఖాజా సయిద్ రఫ్కీ ఈ ఘటనపై స్పందించారు. ఆర్మీ రైలు ప్రమాదానికి వెనుక ఉగ్రవాదులు దాడికి కూడా అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కాలువలో పడిన పాక్ ఆర్మీ రైలు; 12మంది మృతి
Published Thu, Jul 2 2015 6:18 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement