కరుణ చూపని ప్రభు..!
ప్రతి రైల్వేబడ్జెట్‌లో జరుగుతున్న అన్యాయమే ఈసారీ పునరావృతమైంది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు జిల్లాకు హ్యాండిచ్చారు. జిల్లా ప్రజల రైల్వే ఆవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంపీలు, ప్రజాప్రతినిధులు చేసిన ప్రతిపాదనలను బీజేపీ సర్కారు తుంగలో తొక్కింది. అరకొర కేటాయింపులతో దశాబ్ధాలుగా రైల్వేలైన్ల నిర్మాణం పూర్తికావడంలేదు. ఈ బడ్జెట్ జిల్లా వాసులను పూర్తిగా నిరాశపరిచింది.
రాజంపేట: రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదు. కొత్తరైళ్లు ఊసేలేదు.. గత హామీల అమలులేదు.. అధిక ప్రాధాన్యం ఉన్న ముంబాయి-చెన్నై కారిడార్ పరిధిలో జిల్లా ఉన్నా మంత్రి ఏమాత్రం పట్టించుకోలేదు. ఎర్రగుంట్ల-నొస్సం మధ్య ప్యాసింజర్ రైలును రెండేళ్ల కిందట బడ్జెట్‌లో ప్రకటించగా అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. కొత్తరాజధానికి మార్గం లేకపోయినా, కడప నుంచి రేణిగుంట మీదుగా నడిపే విధంగా కొత్తరైలు తీసుకురావాలన్న డిమాండ్‌ను కూడా పక్కనపెట్టేశారు. డీఎంయు (కడప-తిరుపతి-రేణిగుంట) రైళ్లు, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, తిరుపతి-షిర్డి రైళ్ల ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.
కనెక్టివిటీ లైన్ల ఊసేలేదు
రాష్ట్ర విభజన తర్వాత జిల్లా కేంద్రం నుంచి రాజధానిగా మారుతున్న ప్రాంతానికి కనెక్టివిటీ లైన్ల గురించి రైల్వేబడ్జెట్‌లో మంత్రి ప్రస్తావన చేయలేదు. ప్రొద్దుటూరు-కంభం, భాకారపేట-గిద్ద
లూరు రైల్వేలైన్లను గత బడ్జెట్‌లో ఇచ్చిన సర్వేలకే పరిమితం చేశారు. ఆ లైన్ల కోసం కేటాయింపులు కూడా చేయలేదు. జిల్లా నుంచి రాజధాని కోసం రేణిగుంట మీదుగా ఒక పొడిగింపు రైలును కూడా మంజూరు చేయలేదు.
రైల్వేపరిశ్రమకూ మొండిచెయ్యే...
జిల్లాలో బ్రిటిష్ కాలం నుంచి రైల్వేపరంగా ప్రాముఖ్యత కలిగిన నందలూరు రైల్వేకేంద్రంలో ఎప్పటిలాగే రైల్వే పరిశ్రమ ఏర్పాటులో మొండిచెయ్యి మిగిల్చారు. యుపీఏ హయాంలో అప్పటి రైల్వేమంత్రి లాలూప్రసాద్‌యాదవ్ రాజ్యసభలో రైల్వేపరిశ్రమ ఏర్పాటును ప్రకటించారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో నందలూరు ప్రాముఖ్యత గురించి సభలో వివరించారు. రెడీమేడ్‌గా ఉన్న వనరులను వినియోగించుకుని జిల్లాకు భారీ రైల్వేపరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరిన సంగతి విధితమే. బీజెపీ అధికారంలోకి వస్తే రైల్వేపరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని ఆ పార్టీపెద్దలు లోకోషెడ్‌ను సందర్శించిన సందర్భంగా మాటలు నీటిమూటలుగా మారిపోయాయని స్ధానికులు విమర్శిస్తున్నారు.
కేటాయింపులు ఇలా..
రైల్వేబడ్జెట్‌లో జిల్లాలోని 31 కిలోమీటర్లు నిర్మితం కావాల్సిన నంద్యాల-ఎర్రగుంట్లకు రూ.130 కోట్లు కేటాయించారు. కడప-బెంగళూరు రైల్వేలైన్ పెండ్లిమర్రి వరకు ఎర్త్ వర్క్ పనులు జరిగిన నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌లో రూ.265కోట్లు కేటాయించారు. ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైలుమార్గంలో బడ్జెట్‌లో కేవలం రూ.కోటి నిధులు మాత్రం కేటాయించారు. గత బడ్జెట్‌లో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు విషయంలో 24 శాతం పెరిగినట్లు రైల్వేనిపుణులు అభిప్రాయపడుతున్నారు.