నిరాశే మిగిలింది నేస్తం
సురేష్ ప్రభు రైల్వేబడ్జెట్ నగరానికి నిరాశే మిగిల్చింది. హైదరాబాదు నగరానికి ఈ సారి ప్రాధాన్యత లభిస్తుందనుకున్న నగరవాసికి నిరాశే మిగిలింది. ప్రధాన రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తామన్నారే కానీ.. ఆ వివరాలేవీ ప్రకటించలేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు కాస్త ఊరటనిచ్చింది. రాజేంద్రనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఎంఎంటీఎస్ పొడిగింపు అంశం ఈ బడ్జెట్‌లో కూడా లేదు. గురువారం రైల్వేమంత్రి ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌పై పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.. ఆ వివరాలు వారి మాటాల్లోనే..
- సికింద్రాబాద్/రాజేంద్రనగర్/పహాడీషరీష్/కాచిగూడ
రైల్వే బడ్జెట్ భేష్
ఆడంబరాలు,అబద్దాలు లేకుండా కేంద్ర రైల్వే బడ్జెట్ వాస్తవానికి అద్దం పట్టింది. తెలంగాణాకు మొత్తం 569 కోట్ల ప్రాజెక్ట్‌లను కేటాయించారు. ఇందులో ముఖ్యంగా మల్కాజిగిరి నియోకజవర్గంలోని చర్లపల్లి టర్మినల్ విస్తరణ, అధునాతన సదుపాయాల కోసం రూ.80 కోట్లను కేటాయించటం సంతోషకరమైన అంశం. చర్లపల్లి టర్మినల్‌ను విస్తరిస్తే ప్రయాణీకులు రైళ్లలోనే గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా పోతుంది. అదే విధంగా సికింద్రాబాద్ స్టేషన్ నుండి వెళ్లే ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా రెండు అన్ రిజర్వుడు బోగీలను వేయాలని నిర్ణయించటం హర్షణీయం. - సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ మల్కాజిగిరి
జంట నగరాలకు మొండిచేయి
రైల్వే బడ్జెట్ జంట నగరాల ప్రయాణీకులను నిరాశ పరిచింది. గతంలో సికింద్రాబాద్ స్టేషన్ ఎన్‌డీఏ ప్రకటించిన ప్యాకేజీని పక్కన బెట్టి, కేవలం యాదాద్రికి ఎంఎంటీఎస్ లైన్, చర్లపల్లి టర్మినల్‌కు నిధులు తప్పితే మరేవీ లేవు.
- నగేష్ ముదిరాజ్, రైల్వే సలహా సంఘం మాజీ సభ్యులు
ఆమోదయోగ్యం
బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉంది. టికెట్ చార్జీలను పెంచకపోగా, ప్రయాణికులకు వసతుల కల్పనలో పెద్దపీట వేశారు. రైలు ప్రయాణాల్లో భద్రత ప్రమాణాలు పెంచేందుకు, బీమా వంటి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేయడం అభినందనీయం. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాలను త్వరగా అమలులోకి తెస్తే మంచిది. -రమేశ్, ప్రయాణికుడు
వసతులు కరువు
బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ నిరాశ పరిచేలా ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశకు అధిక ప్రాధాన్యత ఇస్తారనుకున్నాం. సికింద్రాబాద్ వంటి పెద్ద రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కూడా ప్రాధాన్యం లభించలేదు. ప్రయాణికులకు వసతులు కరువై ఇబ్బందుల పాలవుతున్నా స్టేషన్ల ఆధునీకరణ కోసం బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం విచారకరం.
-ఖాజా మోహినుద్దీన్, ప్రయాణికుడు