కొత్త పట్టాలెక్కిన రైలు బండి | suresh prabhu announces highspeed trains | Sakshi
Sakshi News home page

కొత్త పట్టాలెక్కిన రైలు బండి

Published Tue, Mar 1 2016 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

కొత్త పట్టాలెక్కిన రైలు బండి

కొత్త పట్టాలెక్కిన రైలు బండి

అభిప్రాయం
రాజకీయవేత్తలు.. భారత రైల్వేలనే అద్భుత సంస్థను ఓటర్లకు, నియోజకవర్గాలకు చిల్లర మల్లర ప్రయోజనాలను కలుగచేసేదిగా మార్చినప్పుడే అది కుప్పకూలడం మొదలైంది. ఏదేమైనా ఎట్టకేలకు మన రైల్వేలు సరైన దిశలో వేగంగా ముందుకు కదులుతున్నాయి. మన ప్రభుత్వాలు దుర్వార్తల విషయంలో సంస్థాగతమైన వైఖరిని చేబడుతుంటాయి. తగి నంత దీర్ఘకాలం పాటూ విస్మరిస్తే సమస్య దానికదే పరిష్కారమై పోతుందనేది మొదటి ఆశ. అది, తన తర్వాత వచ్చే మరో మంత్రి సమస్యగా మారేంత వరకు దాని పరిష్కారాన్ని వాయిదా వేస్తూ పోవడం రెండవది.

బ్రిటిష్ పాలకుల నుంచి మనకు మహత్తర వారసత్వంగా సంక్రమించిన భారత రైల్వేలను వరుసగా మన ప్రభుత్వాలన్నీ క్షీణ దశకు చేర్చడానికి చెప్పదగిన వివరణ నిస్సందేహంగా ఇదొక్కటే. బ్రిటిష్ పాలకులు తమ వ్యూహాత్మక, వాణిజ్య అవసరాల కోసమే రైల్వేలను నిర్మించారనడం పూర్తిగా నిజం. అయితే ఆ క్రమంలో వారు దేశవ్యాప్తమైన మౌలిక సదుపాయాలను, నిర్వహణా వ్యవస్థను నెలకొల్పారు. అదే స్వతంత్ర భారత దేశపు జీవ వాహినిగా, ప్రజలకు సేవచేసే అద్భుత రవాణా వ్యవస్థగా మారింది. ఆర్థిక వ్యవస్థను పెంపొందింపజేస్తూ, ఐక్యతకు నిజమైన ఆర్థాన్నిచ్చే అనుసంధానాలను ఏర్పరుస్తోంది.

ప్రజాస్వామ్యం అంటేనే ప్రజాభీష్టానుసారం సాగేది. మన స్వతంత్ర దేశంలో పౌరులు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి భారత రైల్వేలు వెళ్తాయి. వైమానిక సేవలు ఒక పౌర విమాన సంస్థ కట్టడిలోంచి విముక్తి చెందడానికి ముందటి ఐదు దశాబ్దాలలో రైల్వేలు... భిన్న భాషలు, సంస్కృతులతో కూడిన దేశంలోని నలుమూలల ప్రజలు ఒకరినొకరు తెలుసుకోడానికి, పరిచయాలు చేసుకోవడానికి సాధనమయ్యాయి. అవి ఆర్థిక వ్యవస్థ నాడీ స్పందన కూడా అయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్రమానుగతంగా ఆకలితో అల్లాడే పరిస్థితులు తలెత్తున్నప్పుడు రైల్వేలే ఆ ప్రదేశాలకు ఆహారాన్ని రవాణా చేశాయి. దేశ ఐక్యతకు ఏ ప్రభుత్వం కన్నా మిన్నగా కృషి చేసినది బాలీవుడ్ సినిమాయేనని అప్పుడప్పుడూ అంటుండటం కేవలం పరిహాసోక్తే కాదు. ప్రజా ప్రచార సాధనాల శక్తిని తక్కువగా అంచనా వేయలేం. అయినాగానీ, 1950లు, 1960లలో పొగలు చిమ్ముకుంటూ, ఆవిర్లు వదులుకుంటూ పరుగులు దీసిన రైళ్లూ, ఆ తర్వాతి దశాబ్దాలలో డీజిల్, విద్యుత్ రైళ్లూ దేశ ఐక్యతకు అంతకంటే ఎక్కువే చేశాయి.

ప్రజాదరణ, జనాకర్షణకు తల వంచడం ప్రారంభమైనప్పటి నుంచి రైల్వేల క్షీణత ప్రారంభమైంది. పేర్లను ప్రస్తావిస్తే దివంగతులైన కొందరు గౌరవనీయుల పట్ల అగౌరవాన్ని చూపినట్టవుతుంది. కాబట్టి పేర్లు వద్దు గానీ. మహత్తరమైన, దాదాపు విభ్రాంతికరమైన మన రైలు వ్యవస్థను రాజకీయవేత్తలు... ఓటర్లకు, నియోజక వర్గాలకు చిల్లర మల్లర ప్రయోజనాలను చేకూర్చే సాధనంగా మార్చినప్పటి నుంచి అది కుప్పకూలిపోవడం ప్రారంభమైంది. నియామకాలు, దయ, అనుగ్రహాల కటాక్షంగా మారాయి. ప్రజలకు సేవ చేయడానికి బదులు రైల్వేలు రాజకీయవేత్తలకు ఊడిగం చేయడం ప్రారంభించాయి.

ఒకప్పుడు పార్లమెంటు వార్షిక కార్యక్రమంలో ముఖ్యమైనదిగా ఉండిన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజు స్వీయ వంచనగా దిగజారింది. ఒక బూటకపు ఫార్ములాను మంత్రులు పూర్తి స్థాయిలో వాడుకున్నారు. రైల్వేలు అవసానదశకు చేరే రోగగ్రస్తతలోకి  దిగజారిపోతుంటే,.. ఒక ఆస్పిరిన్ దుకాణాన్ని ఏర్పాటు చేసి, నొప్పిని దాచి పెట్టేస్తే ఎవరూ ఆ రోగాన్ని గుర్తించలేరని వారు ఆశించారు. ఆస్పిరిన్ పరిష్కారానికి తోడు దీపావళి బాణసంచా లాంటి  వాగ్దానాల గుప్పింపూ ఉంటుంది. వాటిలో అత్యధికం భ్రమాత్మకమైనవే. ఆహూతులంతా పెదవులు కదిలిస్తూ, త్రేన్పులు తీస్తూ ఉండే బెర్మిసైడ్ విందు భోజనానికి పౌరులను ఆహ్వానించడం లాంటిదే ఇది (అరేబియన్ నైట్స్ కథల్లో ఒకదానిలో బెర్మిసైడ్ అనే ధనికుడు, బిచ్చగాడికి ఇలాగే ఉత్తుత్తి భోజనం పెడతాడు). గత రైల్వే మంత్రులంతా బెర్మిసైడ్లే అనడం సమంజససం కాదు గానీ, చాలా మంది ఆ బాపతే. ఆవర్జా పుస్తకంలో సానుకూల చిట్టాలో కనిపించే వాటిలో రెండు పేర్లు గుర్తుకొస్తున్నాయి. మాధవ్‌రావ్ సింథియా, తాను ప్రవేశపెట్టిన ఏకైక రైల్వే బడ్జెట్లో ఈ సమస్యకు సంబంధించి సమంజస స్థాయి అవగాహనను కనబరి చారు. ఇక దినేష్ త్రివేదీ, ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు గానీ, ఆయన చేతులు కట్టేసి ఉండటంతో చేసింది దాదాపు ఏమీ లేదు.

సురేశ్ ప్రభు ముందున్న సవాళ్లు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఆయన ఈ క్షీణతను ఆపడమే కాదు, దాన్ని వ్యతిరేక దిశకు మరల్చాల్సి ఉంది. క్షీణత విచ్ఛిన్నత దిశగా దిగజారిపోతుండగా ఆయన పగ్గాలు చేపట్టారు. ఆయన తన ఉత్పత్తిని మెరుగుపరచాల్సి ఉంది. ప్రయాణికుల కోచ్‌లు, సరుకు రవాణా బోగీలు, రైళ్లు,  పట్టాలు, సేవల నాణ్యత, వ్యవస్థలు, స్టేషన్లు అన్నిటినీ ఆయన మెరుగుపరచాలి. అది కూడా అనూహ్యమైన వేగంతో చేయాలి. ఎటు చూసినా మీకు సమస్యలే కనిపిస్తాయి. యూపీఏ ప్రభుత్వ హయాం నాటి భయానక కథనాలను గుర్తు చేసుకోవడంలో అర్థం లేదు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది సమస్యలను పరిష్కరించడానికే తప్ప, గతాన్ని తలుచుకుని నిట్టూర్పులు విడవడానికి కాదు. గత ప్రభుత్వం ఘోరంగా లేకపోతే వారు దాన్ని ఎందుకు మారుస్తారు? ప్రభును తీవ్రంగా విమర్శించేవారు సైతం రైల్వేలందించే సేవలలో, పర్యావరణంలో నాణ్యత పెరుగుతున్న క్రమంలో ఉన్నదని ఒప్పుకుంటారు. దేశంలోని వందలాది పట్టణాలలోని 400 రైల్వే స్టేషన్లను చిన్నపాటి ఆర్థిక కేంద్రాలుగా పరివర్తన చెందించడం ప్రభు సాఫల్యతకు కీలకమైన కొలబద్ద అవుతుంది.

తాజాగా పెట్టుబడులను పెట్టడం ద్వారా రద్దీ అత్యధికంగా ఉన్న మార్గాల్లో ప్రపంచ స్థాయి రైళ్లను ప్రవేశపెట్టి సాధించాల్సిన పరివర్తన అంతకంటే కష్టమైన సవాలు. ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టడం అసమంజసమని లేదా ఉన్నత వర్గాలకు అనుకూలమైనదనీ భావించేవారు... రైలు మార్గాల విద్యుదీకరణను చేపట్టినప్పుడు అది అన్ని చోట్లా ఒకేసారి మొదలు కాలేదని గుర్తుకు తెచ్చుకోవాలి. మన రైల్వేలు భారీ సంస్థ కాబట్టి దానికి పెట్టాల్సిన పెట్టుబడులు కూడా భారీగానే ఉంటాయి.

పెద్ద ఎత్తున వాటిని విదేశాల నుంచి సమకూర్చుకోవడం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వంటి దేశాలతో అందుకు కావాల్సిన కష్టభరితమైన  సన్నాహక కృషిని చేశారు. అయితే ఆ రైలు బండి కదిలేలోగా పరిపూర్తి చేయాల్సిన గురుతర కర్తవ్యాలు చాలానే ఉంటాయి. ఏదేమైనా ఎట్టకేలకు మన రైల్వేలు సరైన దిశలో కదలుతున్నాయి. వేగంగా వెనుకకు గాక, వేగంగా ముందుకు పోతున్నాయి.

 

ఎం.జె. అక్బర్,  సీనియర్ సంపాదకులు, వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement