కొత్త రైళ్లు నిల్ | Nil new trains | Sakshi
Sakshi News home page

కొత్త రైళ్లు నిల్

Published Fri, Feb 26 2016 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

కొత్త రైళ్లు నిల్

కొత్త రైళ్లు నిల్

కొత్త రైళ్లకు రెడ్‌సిగ్నల్  మూడు ప్రాజెక్టులతో సరి
ఉమ్మడి ప్రాజెక్టులకే గ్రీన్‌సిగ్నల్
స్పష్టతలేని రైల్వేస్టేషన్‌ల అభివృద్ధి
రూ.330 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్
చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వేటర్మినళ్లు

 
సిటీబ్యూరో: రైల్వే బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. మరోసారి నిరాశే మిగిలింది. ముచ్చటగా మూడు అరకొర ప్రాజెక్టులు తప్ప నగరానికి పెద్దగా ఒరిగింది శూన్యం. సికింద్రాబాద్ నుంచి జహీరాబాద్ తప్ప కొత్త లైన్‌ల ఊసే లేదు. సురేష్ ప్రభు బడ్జెట్ రైలు నగరంలో ఆగీ ఆగకుండానే పరుగులు పెట్టింది. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ  ప్రధాన రైల్వేస్టేషన్‌లను  అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపు లేదు. ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే అంశంలోనూ  స్పష్టత లేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు గతంలో చేసిన ప్రతిపాదన అటకెక్కింది. వరల్‌క్లాస్ స్టేషన్ స్థాయిని కాస్తా ప్రస్తుతం ఏ-1 కు హోదాకు పరిమితం చేశారు. మొత్తంగా రూ.330 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు, రూ.80 కోట్లతో  చర్లపల్లిలో 4వ రైల్వే టర్మినల్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో వట్టి నాగులపల్లిలో  5వ రైల్వే టర్మినల్ ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో  నగరానికి  లభించాయి. ఈ  మూడు ప్రాజెక్టుల్లోనూ దక్షిణమధ్య రైల్వే, రాష్ర్టప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో  పనులు చేపడుతారు. అయ్యే ఖర్చులో  రాష్ర్టం వాటాగా 51 శాతం, రైల్వే వాటాగా  49 శాతం చొప్పున భరిస్తాయి. మొత్తంగా రైల్వే బడ్జెట్ ఈసారి ఒకింత ఆశ..మరింత నిరాశనే మిగిల్చింది.

యాదాద్రికి ఎంఎంటీఎస్...
లక్షలాది మంది సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్ పరుగులు తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత  ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ ప్రాజెక్టుకు రైల్వేశాఖ కూడా ప్రాధాన్యతనిచ్చింది. సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్ వరకు చేపట్టిన  రెండో దశ ఎంఎంటీఎస్ పనులు సాగుతుండగా... ఇప్పుడు మూడో దశ కింద ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్‌ల వరకు రైల్వేలైన్‌లను పొడిగించి విద్యుదీకరిస్తారు. రూ.330 కోట్లతో చేపట్టనున్న ఈ పనుల్లో రాష్ర్టప్రభుత్వం తన వంతు వాటాగా  51 శాతం నిధులను సమకూర్చనుంది. ఈ ఆర్థిక సంవత్సరం పనులు ప్రారంభించి వచ్చే రెండు, మూడేళ్లలో దీనిని పూర్తి చే స్తారు. నగరంలోని ఆరు మార్గాల్లో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశ పూర్తయిన అనంతరం మూడోదశ కింద యాదాద్రికి ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తారు. దీంతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులు సికింద్రాబాద్ నుంచి నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి  4 కిలోమీటర్‌ల వరకు రోడ్డు మార్గంలో యాదాద్రికి వెళ్లవ లసి ఉంటుంది. నగరం నుంచి నేరుగా యాదగిరిగుట్టకు వెళ్లే  రైల్వే సదుపాయం అందుబాటులోకి  రావడంతో ఈ మార్గంలో వ్యాపార కార్యకలాపాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా  రియల్ ఎస్టేట్ రంగానికి మహర్దశ పట్టనుంది. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కోరడంతో  రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చింది. ఎంఎంటీఎస్ పొడిగింపునకు అయ్యే ఖర్చులో రాష్ర్టం తన వంతు వాటాను భరిస్తుందని సీఎం స్పష్టం చేయడంతో  రైల్వేశాఖ  తన వంతు వాటాను కూడా అందజేసి ఎంఎంటీఎస్‌ను పొడిగించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.

 ఎంఎంటీఎస్ ప్రస్తానం ఇదీ...
2003లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-ఫలక్‌నుమా, తదితర మార్గాల్లో  లోకల్ రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. {పస్తుతం ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. లక్షా 40 వేల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.హైదరాబాద్ నగర శివార్లను కలుపుతూ 2013లో ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించారు. సికింద్రాబాద్-ఘట్‌కేసర్, మౌలాలి-సనత్‌నగర్, పటాన్‌చెరు-తెల్లాపూర్, ఫలక్‌నుమా-ఉందానగర్ తదితర మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు జరుగుతున్నాయి.ఉందానగర్-శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రెండో దశలో పొడిగించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ విమానాశ్రయంలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి జీఎమ్మార్ నిరాకరించడంతో ప్రస్తుతానికి ఆ లైన్ నిర్మాణం వాయిదా పడింది.

తగ్గనున్న భారం...
ప్రతి రోజు సుమారు 250కి పైగా రైళ్లు నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 4 లక్షల మంది  నిత్యం ఈ స్టేషన్‌లను సందర్శిస్తున్నారు. దీంతో ఈ మూడింటిపైన ఒత్తిడి బాగా పెరిగింది. ఔటర్ రింగురోడ్డుకు అందుబాటులో ఉన్న చర్లపల్లిలో రైల్వే టర్మినల్ ఏర్పాటు చేయడం వల్ల  విజయవాడ , కాజీపేట్ మీదుగా వచ్చేరైళ్లను చర్లపల్లిలో నిలుపుతారు. ఎఫ్‌సీఐ, ఎన్‌ఎఫ్‌సీ, హెచ్‌పీసీఎల్, ఐఓసీ వంటి  భారీ పరిశ్రమలు కూడా  ఈ  ప్రాంతంలో ఉండడం రవాణా రంగం అభివృద్ధికి  విస్తృత అవకాశంగా  రైల్వే భావించింది. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో  కనీసం 150 రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీ, ముంబయి, విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది.
 
స్టేషన్‌ల అభివృద్ధికి నిధులే లేవు...
దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్‌ల రీ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా నగరంలో  సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లను అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా ప్రకటించారు. కానీ ఇందుకోసం ఎలాంటి నిధు లు కేటాయించలేదు. 2010లో ప్రతిపాదించిన సికిం ద్రాబాద్ వరల్డ్‌క్లాస్ అంశాన్ని పక్కన పెట్టి రీ డెవలప్‌మెంట్ పేరుతో ఏ తరహా అభివృద్ధి చేస్తారనే అం శంలో స్పష్టత లేదు. నాంపల్లి రైల్వేస్టేషన్‌లో లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేశారు.
 
 
కొత్త రైళ్ల ఊసే లేదు...
{పయాణికుల రద్దీ దృష్ట్యా  హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి  పలు మార్గాల్లో కొత్త రైళ్లను నడపాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. మరోవైపు గతంలో ప్రకటించిన రైళ్ల ప్రస్తావన కూడా లేకుండానే ఈ బడ్జెట్ నగర ప్రయాణికులను నిరాశకు గురి చేసింది.సికింద్రాబాద్ నుంచి షిరిడీకి వెళ్లేందుకు ప్రస్తుతం మన్మాడ్ వరకు అజంతా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. సికింద్రాబాద్ నుంచి సాయినగర్ వరకు నేరుగా వెళ్లేందుకు మరో రైలు నడపాలనే ప్రతిపాదకు  మోక్షం లభించలేదు.కాచిగూడ నుంచి బెంగళూర్‌కు ప్రస్తుతం రెండు రైళ్లే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 2 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన సైతం పట్టించుకోలేదు.హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రస్తావన లేదు. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ట్రైన్ ఊసు లేదు.
 
చర్లపల్లిలో భారీ రైల్వే టర్మినల్..
చర్లపల్లి వద్ద భారీ రైల్వే టర్మినల్ మరో అతిపెద్ద ప్రాజెక్టు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.80 కోట్లు కేటాయించారు. మొదట 5 ప్లాట్‌ఫామ్‌లతో ప్రారంభించి దశలవారీగా 10 నుంచి 15 ప్లాట్‌ఫామ్‌ల వరకు అభివృద్ధి చేస్తారు. వీటిలో రైళ్లను శుభ్రం చేసేందుకు పిట్‌లైన్‌లు కూడా ఉంటాయి. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో  రాష్ర్టం తన వంతు వాటాను  భరిస్తుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లపై పెరుగుతున్న ఒత్తిడి, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, వట్టినాగులపల్లిలో రైల్వే టర్మినళ్లు నిర్మించాలని చాలాకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి.  నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల తరువాత నగరంలో ఇది 4వ అతిపెద్ద రైల్వే టర్మినల్ కానుంది. 5వ టర్మినల్‌గా వట్టినాగులపల్లిలో 250 ఎకరాల్లో పీపీపీ మోడల్‌లో నిర్మిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement