రైల్వే బడ్జెట్ కు చరమగీతం?
న్యూఢిల్లీ : 92 ఏళ్ల క్రితం నాటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ కు ఎన్డీయే ప్రభుత్వం చరమగీతం పాడనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. 92 ఏళ్ల నాటి నుంచి వస్తున్న ప్రత్యేక బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలపడాన్ని సురేష్ ప్రభు ప్రతిపాదించారని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు.
జూన్ లోనే ఆర్థిక మంత్రికి ఈ లేఖను పంపించారని, ఇంకా అరుణ్ జైట్లీ నుంచి ఎలాంటి సమాధాన రాలేదని అధికారులు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డేబ్రోయ్ ఈ విలీనాన్ని మొదట ప్రతిపాదించిన అనంతరం, రైల్వేశాఖ సమాధానం కోరుతూ గత నెల ప్రధానమంత్రి కార్యాలయం ఈ లేఖను పంపింది. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తూ.. ఆర్థికమంత్రికి ఈ లేఖను రైల్వే శాఖ పంపించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో 2017-18 రైల్వే బడ్జెట్ లేదా 2016-17 బడ్జెట్, రైల్వేకు తుది బడ్జెట్ కానుందని అధికారులు చెప్పారు. ఈ విలీన ప్రతిపాదనతో, మొత్తం ఆర్థిక భారం ఇక నుంచి ఆర్థిక మంత్రి చేతులోకి వెళ్లనుంది. అయితే ఈ విలీనానికి సంబంధించి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్యాసెంజర్ సెగ్మెంట్ లో రైల్వే రూ. 34,000కోట్ల నష్టాలను భరిస్తుంది. రాబడులు సైతం పతనమవుతున్నాయి.