రైల్వే బడ్జెట్ మరి కాసేపట్లో పట్టాలెక్కనుంది. తమ ఆశలు నెరవేరుస్తుందా ? లేక ఆనవాయితీగా కొద్దిపాటి కూతలకే పరిమితమవుతుందా ..? అని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వేస్టేషన్‌కూడా అభివృద్ధికి నోచుకోని పరిస్థితి.... కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా ముందుకు సాగని దుస్థితి... సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న 16 ఏళ్ల డిమాండ్‌కు మోక్షమే లేదు. సుమారు రూ.కోటీ 55లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ అలాగే ఉండిపోయింది. ప్రతిసారీ నేతలు హామీలిస్తున్నారే తప్పా అవి నెరవేరడం లేదు. ఈ సారైనా బీజేీపీ సర్కార్ జిల్లాపై దృష్టి సారించాలని, చిరకాలంగా ఉన్న డిమాండ్లు నెరవేర్చాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
విజయనగరం టౌన్ : జిల్లా ప్రయాణికుల ఆశలు ఏటా ఆవిరవుతున్నాయి. ప్రతీ రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి ఎదురవుతోంది. ఏటా గంపెడు ఆశలు పెట్టుకోవడమే తప్ప సాకారం కావడం లేదు. రైల్వే మంత్రులు ఎంతమంది మారినా జిల్లాకొచ్చే ప్రయోజనం కనిపించడం లేదు. గత యూపీఏ ప్రభుత్వం కూడా జిల్లా వాసులకు నిరాశే మిగిల్చింది. కంటితుడుపు చర్యగా కొన్నింటిని కేటాయించి చేతులుదులిపేసుకుంది. ఇక కేటాయింపులైనా అమలయ్యాయంటే అదీ లేదు. ప్రకటించిన ఏ ఒక్కటీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
విజయనగరం నుంచి రాజాం మీదగా పలాసకు ప్రత్యేక రైల్వే లైను, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ, విజయనగరం రైల్వే స్టేషన్‌లో అవుట్ పేషెంట్ విభాగం, డయోగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇక ఏళ్ల నాటి సమస్యలు అనేకం ఉన్నాయి. సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న 16 ఏళ్ల డిమాండ్‌కు మోక్షమే లేదు.
సుమారు రూ.కోటీ 55లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ అలాగే ఉండిపోయింది. దీనికి ప్రత్యేక లైన్ లేకపోవడం వల్ల యార్డ్ నిరుపయోగంగా మిగిలిపోయింది. ఏటా రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని తీసుకొస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధిపైనా దృష్టిసారించడం లేదు. విజయనగరం రైల్వేస్టేషన్‌లో ఐదో నంబర్ ఫ్లాట్‌ఫామ్ నుంచి తొమ్మిదో నంబర్ ఫ్లాట్‌ఫామ్ వరకూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది.
‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా ఒక డిమాండ్‌గానే మిగిలిపోయింది. ఈ విధంగా ఏళ్ల నాటికి సమస్యలకు మోక్షం కలగకపోగా గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు (కేటాయింపులూ)అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది.అదేవిధంగా ప్రత్యేక రైల్వేజోన్ కేటాయిస్తామంటూ ఊరించిన యూపీఏ ప్రభుత్వం జిల్లావాసుల ఆశలు నీరుగార్చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు మరోసారి ఆశలు పెట్టుకున్నారు. కేంద్రమంత్రి సురేష్ ప్రభు మంత్రిగా తొలిసారిగా ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఏ మే రకు ప్రాధాన్యం కల్పిస్తారో వేచిచూడాలి. గత కేటాయింపులకు కొనసాగింపుగా నిధులిస్తారా? ఏళ్ల నాటి డిమాండ్లకు పరిష్కారం చూపుతారా? కొత్తగా వేటినైనా ప్రకటిస్తారా? అనేది చూడాల్సి ఉంది.
ఆశలు పట్టాలెక్కేనా?
Published Thu, Feb 26 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement