Howrah Express
-
మృతులు 300కు చేరువలో...
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం దేశమంతటినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. శుక్రవారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి ఏడింటి ప్రాంతంలో బహనగా రైల్వేస్టేషన్ సమీపంలో మెయిన్ ట్రాక్ నుంచి లూప్ లైన్లోకి వెళ్లడం, దానిపై ఆగి ఉన్న గూడ్స్‌ను గంటకు 128 కి.మీ. వేగంతో ఢీకొనడం తెలిసిందే. దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడటం, అదే సమయంలో దానిపై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 70 మందికి పైగా మరణించినట్టు తొలుత భావించినా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. చిక్కుకుపోయిన బోగీలను విడదీస్తూ గాలింపు కొనసాగిన కొద్దీ శవాలు భారీగా బయట పడుతూ వచ్చాయి. 288 మంది మరణించినట్టు ఇప్పటిదాకా తేలింది. 1,175 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని పలు ఆస్పత్రుల్లో చేర్చారు. వీరిలో 700 మందికి పైగా డిశ్చార్జి కాగా మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరికాస్త పెరిగేలా కన్పిస్తోంది. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి రిజర్వుడ్ ప్రయాణికులే 2,400 మంది దాకా ఉన్నారు. వీరు గాక జనరల్ బోగీల్లో భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. అంతా కలిపి 3,000 మందికి పైగా ఉంటారని చెబుతున్నారు. ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యమే ప్రధాన కారణమని రైల్వే శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మరో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అదనపు పరిహారాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయన వెంట ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అంతకుముందు ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వేతో సహా పలు శాఖ ఉన్నతాధికారులతో మోదీ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ఆయనకు వివరించారు. ప్రమాద స్థలి నుంచి బాధితుల తరలింపు దాదాపుగా పూర్తయింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు వేలాది మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోదీ, రైల్వే మంత్రి బదులివ్వాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయని విపక్ష కాంగ్రెస్ మండిపడింది. పెను విషాద సమయం గనుక సహాయక చర్యలు పూర్తవడానికే ప్రస్తుతానికి ప్రాధాన్యమిస్తున్నామని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. కోరమండల్‌కు కలిసిరాని శుక్రవారం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం కలిసిరావడం లేదు. గత 20 ఏళ్లలో ఈ రైలు మూడుసార్లు ప్రమాదానికి గురైంది. అవన్నీ శుక్రవారమే జరిగాయి. పైగా వాటిలో రెండు ప్రమాదాలు ఒడిశాలోనే చోటుచేసుకున్నాయి. హౌరా–చెన్నై మధ్య నడిచే కోరమండల్ మూడుసార్లూ చెన్నై వెళ్తూనే ప్రమాదానికి గురైంది! 2009లో ఒడిశాలోని జైపూర్ వద్ద తొలిసారి ప్రమాదం జరిగింది. అప్పుడు 16 మంది చనిపోయారు. తర్వాత 2022 మార్చిలో నెల్లూరు వద్ద జరిగిన రెండో ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. తాజా ప్రమాదం మూడోది. లోకో పైలట్లకు గాయాలు భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో లోకోపైలట్ జీఎన్ మహంతి, సహాయ లోకో పైలట్ హజారీ బెహరా తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఇరువురూ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి, ఉన్నత స్థాయి చికిత్స అందిస్తున్నారు. జీఎన్ మహంతికి పక్కటెముక విరిగింది. దుర్ఘటనలో ఊపిరితిత్తులు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో అంతర్గత రక్తస్రావమైనట్లు వైద్యులు తెలిపారు. హజారీ బెహరా ఎడమకాలి ఎముక విరగడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన హౌరా ఎక్స్‌ప్రెస్
సాంకేతిక లోపం తలెత్తటంతో వాస్కోడగామా- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు గంటపాటు నిలిచిపోయింది. హౌరా నుంచి వాస్కోడగామా వైపు వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో లోపం తలెత్తటంతో 11.15 గంటల సమయంలో అధికారులు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం వద్ద నిలిపివేశారు. ఇంజిన్‌ను శ్రీకాకుళం తీసుకెళ్లి మరమ్మతులు చేయించి తిరిగి ఉర్లాం చేర్చారు. తిరిగి రైలు 12.15 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
యాదగిరిగుట్ట (నల్లగొండ) : హౌరా ఎక్స్‌ప్రెస్ ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి గురువారం నల్లగొండ జిల్లా వంగపల్లి వద్ద నిలిచిపోవడంతో.. ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. దీని వల్ల వరంగల్ జిల్లా జనగామలో గోల్కొండ రైలును గంటన్నరసేపు నిలిపివేశారు. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే పుష్పుల్ రైలును వరంగల్ వరకు కాకుండా.. ఖాజీపేట వరకే కుదించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
హౌరా ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం
టంగుటూరు:హౌరా ఎక్స్ ప్రెస్ లో బుధవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడీ దొంగలు భారీ చోరీకి విఫలయత్నం చేశారు. తొలుత రైలును చైన్ లాగి ఆపిన దొంగలు దోపిడీకి యత్నించారు. ప్రయాణికులను బెదిరించి వారి వద్దనున్న నగదును, ఆభరణాలను దోచుకునేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. కాగా, పోలీసులపై ఎదురు తిరిగిన దొంగలు రాళ్లు రువ్వి పరారయ్యారు. అనంతరం మరో రెండు రైళ్లలో కూడా దొంగలు దోపిడీకి యత్నించినట్లు తెలుస్తోంది. చెన్నై ఎక్స్ ప్రెస్, తిరుమల ఎక్స్ ప్రెస్ లలో కూడా అదే తరహాలో దోపిడీకి ప్రయత్నించినట్లు సమాచారం. -
ఆశలు పట్టాలెక్కేనా?
రైల్వే బడ్జెట్ మరి కాసేపట్లో పట్టాలెక్కనుంది. తమ ఆశలు నెరవేరుస్తుందా ? లేక ఆనవాయితీగా కొద్దిపాటి కూతలకే పరిమితమవుతుందా ..? అని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వేస్టేషన్కూడా అభివృద్ధికి నోచుకోని పరిస్థితి.... కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా ముందుకు సాగని దుస్థితి... సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న 16 ఏళ్ల డిమాండ్‌కు మోక్షమే లేదు. సుమారు రూ.కోటీ 55లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ అలాగే ఉండిపోయింది. ప్రతిసారీ నేతలు హామీలిస్తున్నారే తప్పా అవి నెరవేరడం లేదు. ఈ సారైనా బీజేీపీ సర్కార్ జిల్లాపై దృష్టి సారించాలని, చిరకాలంగా ఉన్న డిమాండ్లు నెరవేర్చాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం టౌన్ : జిల్లా ప్రయాణికుల ఆశలు ఏటా ఆవిరవుతున్నాయి. ప్రతీ రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి ఎదురవుతోంది. ఏటా గంపెడు ఆశలు పెట్టుకోవడమే తప్ప సాకారం కావడం లేదు. రైల్వే మంత్రులు ఎంతమంది మారినా జిల్లాకొచ్చే ప్రయోజనం కనిపించడం లేదు. గత యూపీఏ ప్రభుత్వం కూడా జిల్లా వాసులకు నిరాశే మిగిల్చింది. కంటితుడుపు చర్యగా కొన్నింటిని కేటాయించి చేతులుదులిపేసుకుంది. ఇక కేటాయింపులైనా అమలయ్యాయంటే అదీ లేదు. ప్రకటించిన ఏ ఒక్కటీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. విజయనగరం నుంచి రాజాం మీదగా పలాసకు ప్రత్యేక రైల్వే లైను, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ, విజయనగరం రైల్వే స్టేషన్లో అవుట్ పేషెంట్ విభాగం, డయోగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇక ఏళ్ల నాటి సమస్యలు అనేకం ఉన్నాయి. సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్న 16 ఏళ్ల డిమాండ్‌కు మోక్షమే లేదు. సుమారు రూ.కోటీ 55లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ అలాగే ఉండిపోయింది. దీనికి ప్రత్యేక లైన్ లేకపోవడం వల్ల యార్డ్ నిరుపయోగంగా మిగిలిపోయింది. ఏటా రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని తీసుకొస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధిపైనా దృష్టిసారించడం లేదు. విజయనగరం రైల్వేస్టేషన్లో ఐదో నంబర్ ఫ్లాట్‌ఫామ్ నుంచి తొమ్మిదో నంబర్ ఫ్లాట్‌ఫామ్ వరకూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది. ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా ఒక డిమాండ్‌గానే మిగిలిపోయింది. ఈ విధంగా ఏళ్ల నాటికి సమస్యలకు మోక్షం కలగకపోగా గత బడ్జెట్లో చేసిన కేటాయింపులు (కేటాయింపులూ)అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది.అదేవిధంగా ప్రత్యేక రైల్వేజోన్ కేటాయిస్తామంటూ ఊరించిన యూపీఏ ప్రభుత్వం జిల్లావాసుల ఆశలు నీరుగార్చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు మరోసారి ఆశలు పెట్టుకున్నారు. కేంద్రమంత్రి సురేష్ ప్రభు మంత్రిగా తొలిసారిగా ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఏ మే రకు ప్రాధాన్యం కల్పిస్తారో వేచిచూడాలి. గత కేటాయింపులకు కొనసాగింపుగా నిధులిస్తారా? ఏళ్ల నాటి డిమాండ్లకు పరిష్కారం చూపుతారా? కొత్తగా వేటినైనా ప్రకటిస్తారా? అనేది చూడాల్సి ఉంది. -
పట్టాలు తప్పిన హౌరా-న్యూఢిల్లీ ఎక్స్ ప్రెస్
న్యూఢిల్లీ: హౌరా-న్యూఢిల్లీ పూర్వా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. కాగా ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. హౌరా నుంచి బయల్దేరిన రైలు లిల్వా స్టేషన్ (పశ్చిమబెంగాల్) సమీపంలో పట్టాలు తప్పింది. 12 బోగీలు అదుపు తప్పాయి. ఆ సయమంలో రైలు నెమ్మదిగా వెళ్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు ఈశాన్య రైల్వే అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. -
ఒకరి వెంట ఒకరు..
రైలు నుంచి దూకి యువతి, యువకుడి బలవన్మరణం మృతులు ఏలూరు వాసులు యశ్వంతాపూర్-రఘునాథపల్లి మధ్య ఘటన కాజీపేటరూరల్/జనగామ టౌన్, న్యూస్‌లైన్ : వేగంగా వెళుతున్న రైలు నుంచి ఓ యువతి దూ కగా.. ఆ వెంటనే ఆమెను పిలుస్తూ మరో యువకుడు కిందికి దూకాడు. యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, యువతి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన యశ్వంతాపూర్ - రఘునాథపల్లి స్టేషన్ల మధ్య శనివారం జరిగింది. జీఆర్పీ ఎస్సై శ్రీనివాస్, రైల్వే అధికారుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుడిపుడి సాగర్(23), కోడి మౌనిక(22) సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టిక్కెట్ తీసుకుని హౌరా ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్-9 బోగీలో ప్రయాణిస్తున్నారు. రైలు యశ్వంతాపూర్-రఘునాథప ల్లి మధ్యకు రాగానే వేగంగా మౌనిక దూకగా, ఆమెను పిలుచుకుంటూ సాగర్ దూకాడు. అత డు అక్కడికక్కడే మృతిచెందగా, మౌనిక గాయ పడింది. సమాచారం అందుకున్న కాజీపేట జీ ఆర్పీ ఎస్సై శ్రీనివాస్, ఏరియా ఆఫీసర్ కుమార్, చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ టి.ధర్మరాజు, స్టేషన్ మేనేజర్ ఎం.ఓదెలు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మౌనికను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి రైలు టిక్కెట్లతోపాటు ఇద్దరి ఓటరు గుర్తింపు కార్డులు మృతుడి వద్ద లభించగా, ఇద్దరు ఏలూరుకు చెందిన వా రిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచార మిచ్చారు. అలాగే, యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ మౌనిక గంట తర్వాత మృతిచెందింది. కాగా మృతురాలు హ్యాండ్‌బాల్ జాతీయ క్రీడాకారిణి అని, ఆమెకు నేషనల్ పోలీస్ అకాడమీ లో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చిందని ఆమె మేనమామ చెప్పినట్లు ఎస్సై తెలిపారు. సాగర్ ఇటీవల డిగ్రీ పరీక్షలు రాసినట్లు అతడి వద్ద హాల్‌టిక్కెట్ ఉందని ఎస్సై వెల్లడించారు. -
హౌరా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
కన్యాకుమారి నుంచి హౌరా వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున హౌరా ఎక్స్‌ప్రెస్ ఆవులను ఢీ కొట్టింది. అనంతరం ఆ రైలు పట్టాలు తప్పింది. రైలులో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనతో నెల్లూరు వైపు వచ్చే పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. హౌరా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైళ్ల రాకపోకలను పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే హౌర ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొన్న ఘటనలో 12 ఆవులు విగత జీవులు అయ్యాయి.