ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక సంస్థ
రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు వెల్లడి
నెల్లూరు(సెంట్రల్)/ముత్తుకూరు/తిరుపతి అర్బన్: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పరంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. నెల్లూరు దక్షిణ రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, గూడూరు స్టేషన్‌లో కొత్త ప్లాట్ ఫామ్ నిర్మాణాలకు శంకుస్థాపన, తిరుపతి స్టేషన్‌లో వైఫై సదుపాయాన్ని మరో కేంద్రమంత్రి వెంకయ్యతో కలిసి రిమోట్ ద్వారా ఆదివారం సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో డిజిటల్ విప్లవం వస్తోందని, అందుకనుగుణంగానే రైల్వేలను కూడా సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విజన్ 2030తో దేశంలోని తీర ప్రాంతాలను కలుపుతూ రైలు మార్గాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.భవిష్యత్తులో వేగంగా, చౌకగా సరుకులను రవాణా చేసేందుకు లెవల్ టు గూడ్స్ రైళ్లను ప్రవేశపెడుతున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. కృష్ణపట్నం పోర్టులో ఆదివారం పోర్టు ‘సైడ్ కంటైనర్ ఫెసిలిటీ’ విభాగాన్ని, గోల్ఫ్ కోర్సును ఆయన ప్రారంభించారు.
పాత ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యం..
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రైల్వే బడ్జెట్‌లో కొత్త హామీలివ్వకుండా పాత ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని ప్రభును మోదీ కోరారన్నారు.
తమిళనాడులో గ్రీన్ రైల్ కారిడార్!
చెన్నై: దేశంలోనే తొలిసారిగా తమిళనాడులో రామేశ్వరం-మనామదురై మధ్య 114 కిలోమీటర్ల గ్రీన్ రైల్ కారిడార్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆదివారం ప్రారంభించారు. ఇందులోభాగంగా మార్గంలోని రైల్వే ట్రాక్‌లపై మల, మూత్ర వ్యర్థాలు పడకుండా రైళ్లలో బయో టాయ్‌లెట్స్ ఏర్పాటుచేశారు.