రైల్వే బడ్జెట్... మారేనా ట్రాక్?
- ఏటా కొత్త రైళ్ల ప్రతిపాదనలు
- అరకొరగా కేటాయింపులు
- కొత్త రాష్ర్టం నేపథ్యంలో వరాలపై ఆశలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఏర్పడాక ప్రకటించే తొలి రైల్వే బడ్జెట్‌పై అందరిలో ఆసక్తి ఉంది. ఎన్‌డీఏ ప్రభుత్వం విశాఖపై ఎలాంటి వరాలు కురిపిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు కూడా కావడం, ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు విశాఖతో మంచి అనుబంధం ఉండడం కారణంగా ఈ దఫా ఈ ప్రాంతానికి రైల్వే పరంగా అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయన్న ఆశలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ ఇద్దరు నాయకులు విద్యార్థి కాలం నుంచి కూడా సన్నిహితులు కావడంతో ఈ జోడీ విశాఖకు ఎలాంటి వరాలు మూటగట్టుకొస్తారోనని రైల్వే వర్గాలు సైతం ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కొత్త రైల్వే జోన్ అంశం కూడా ఈ బడ్జెట్‌లోనే తేలిపోతుండడంతో కొత్త రైళ్లన్నీ ఆ ప్రాంతం నుంచే బయల్దేరాలి. రాజధానిని కలుపుతూ రాష్ట్ర నలువైపులా రైళ్ల కూత పెట్టాలి. ఆ రైళ్లన్నీ విశాఖ-విజయవాడ మీదుగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ పరుగులు తీయాలి....మరి విశాఖ వాసుల ఈ ఆకాంక్షలు నెరవేరేనా? ఈ నెల 8వ తేదీన ప్రకటించే బడ్జెట్ కోసం వేచి చూడాల్సిందే.
తాత్కాలిక బడ్జెట్‌లో ఏముంది..!
యుపీఏ ప్రభుత్వం ఇంటి దారి పట్టేముందు ఆదరాబాదరాగా ప్రవేశపెట్టిన తాత్కాలిక రైల్వే బడ్జెట్‌లో విశాఖకు మొండి చేయి చూపింది. విశాఖ-గుణుపూర్ ప్యాసింజర్ మినహా వాల్తేరు డివిజన్ కు సంబంధించిన మరే రైలునూ ప్రకటించలేదు. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించినా ఆ కోటా దక్షిణ మధ్య రైల్వేకి చెందినది. అందుకే త్వరలో వెలువడే రైల్వే బడ్జెట్‌పై అంతా ఆశలు పెట్టుకున్నారు.
ఇవీ ప్రతిపాదిత రైళ్లు
రోజూ నడపాలని రైళ్ల డిమాండ్లు
విశాఖ-చెన్నై, విశాఖ-షిర్డీ మధ్య వారానికోసారి నడుస్తున్న రైళ్లను ప్రతి రోజు పెంచాలని డిమాండ్ ఉంది.
వారానికి ఓ రోజు నడుస్తున్న విశాఖ-గాంధీధాం, విశాఖ-జోధ్‌పూర్, విశాఖ-కొల్లాం, విశాఖ-షిర్డీ రైళ్లను వారానికి మూడుసార్లు ఫ్రీక్వెన్సీ పెంచాలన్న ప్రయాణికుల డిమాండ్‌కు రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాల్సిందే.
ఈ రైళ్లు వచ్చే చాన్‌స:
ఢిల్లీ, తిరుపతిలకు దురంతో రైలు రావొచ్చని భావిస్తున్నారు.
అంతర రాష్ట్ర రైళ్లు
తిరుపతి-వారణాసి వయా విశాఖ, బెజవాడ
విశాఖ-మైసూర్ వయా విజయవాడ
విశాఖపట్నం-అహ్మదాబాద్ వయా విజయవాడ
గుంటూరు-గౌహతి వయా విశాఖ
పొడిగించాల్సిన రైళ్లు
హౌరా-విశాఖ రైలును గుంటూరు వరకూ
విశాఖ-టాటా రైలును గుంటూరు వరకూ
ఛెన్నై-విజయవాడ రైలును విశాఖ వరకూ