Railway Minister suresprabhu
-
నేడే నంద్యాల-కడప రైలు ప్రారంభం
నగరంపాలెం: నంద్యాల-కడప డీఈఎంయు రైలును రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు మంగళవారం విజయవాడ నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారని గుంటూరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలును ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నంద్యాల నుంచి రెండు, కడప నుంచి రెండు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. రైలు నంబరు 77401 నంద్యాల నుంచి ఉదయం 06.00 గంటలకు బయలుదేరి కడపకు 09.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 77402 కడప నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి నంద్యాలకు మధ్యాహ్నం 13.50 గంటలకు చేరుకుంటుంది. అలాగే రైలు నంబరు 77403 నంద్యాల నుంచి 14.20కి బయలుదేరి కడపకు 18.05 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 77404 కడప 18.30కి బయలుదేరి 22.15 గంటలకు నంద్యాల చేరుకుంటుంది. -
ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక సంస్థ
రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు వెల్లడి నెల్లూరు(సెంట్రల్)/ముత్తుకూరు/తిరుపతి అర్బన్: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే పరంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. నెల్లూరు దక్షిణ రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, గూడూరు స్టేషన్లో కొత్త ప్లాట్ ఫామ్ నిర్మాణాలకు శంకుస్థాపన, తిరుపతి స్టేషన్లో వైఫై సదుపాయాన్ని మరో కేంద్రమంత్రి వెంకయ్యతో కలిసి రిమోట్ ద్వారా ఆదివారం సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో డిజిటల్ విప్లవం వస్తోందని, అందుకనుగుణంగానే రైల్వేలను కూడా సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విజన్ 2030తో దేశంలోని తీర ప్రాంతాలను కలుపుతూ రైలు మార్గాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.భవిష్యత్తులో వేగంగా, చౌకగా సరుకులను రవాణా చేసేందుకు లెవల్ టు గూడ్స్ రైళ్లను ప్రవేశపెడుతున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. కృష్ణపట్నం పోర్టులో ఆదివారం పోర్టు ‘సైడ్ కంటైనర్ ఫెసిలిటీ’ విభాగాన్ని, గోల్ఫ్ కోర్సును ఆయన ప్రారంభించారు. పాత ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యం.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రైల్వే బడ్జెట్లో కొత్త హామీలివ్వకుండా పాత ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని ప్రభును మోదీ కోరారన్నారు. తమిళనాడులో గ్రీన్ రైల్ కారిడార్! చెన్నై: దేశంలోనే తొలిసారిగా తమిళనాడులో రామేశ్వరం-మనామదురై మధ్య 114 కిలోమీటర్ల గ్రీన్ రైల్ కారిడార్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆదివారం ప్రారంభించారు. ఇందులోభాగంగా మార్గంలోని రైల్వే ట్రాక్‌లపై మల, మూత్ర వ్యర్థాలు పడకుండా రైళ్లలో బయో టాయ్‌లెట్స్ ఏర్పాటుచేశారు. -
సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు పేర్కొన్నారు. శనివారం ఇక్కడి రైల్వే భవన్లో దక్షిణాది రాష్ట్రాల మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జోన్ ఏర్పాటుకు సంబంధిత రాష్ట్రాలతో, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అలాగే విశాఖ-ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు గమ్యాన్ని చేరుకునేందుకు దాదాపు 36 గంటలు పడుతోందని, దీని సమయాన్ని కుదించాలని వస్తున్న వినతులను పరిశీలిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష లేదని, యూపీఏ హయాంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు మూడు రెట్లు ఎక్కువ కేటాయింపులు చేశామన్నారు. రైల్వే బోర్డులోని ఉన్నతాధికారులతో రాష్ట్రాలకు సమన్వయ కర్తలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేశాఖ సమన్వయ కర్తగా రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుబ్రతానాథ్‌ను నియమించినట్టు వివరించారు. -
కాచిగూడ స్టేషన్లో ఉచిత వైఫై
♦ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్న రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ♦ త్వరలో సికింద్రాబాద్, నాంపల్లిలలో... సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉచిత అన్లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా రోజుకు నలభై నుంచి యాభై వేల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు ఢిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు వీడియో లింక్ ద్వారా ఈ సేవలను ప్రారంభిస్తారు. అదే సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎంపీలు కె.కేశవరావు, వి.హనుమంతరావు, మహ్మద్ అలీఖాన్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని 18 ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖ ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ సేవలను మరింత విస్తృతం చేసే యోచనలో ఉన్న శాఖ... కాచిగూడతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా అన్లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని కల్పించనుంది. త్వరలో నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో కూడా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో అరగంట పరిమిత ఉచిత ఇంటర్నెట్ సదుపాయం ఉంది.