కాచిగూడ స్టేషన్‌లో ఉచిత వైఫై
♦ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్న రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు
♦ త్వరలో సికింద్రాబాద్, నాంపల్లిలలో...
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఉచిత అన్‌లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా రోజుకు నలభై నుంచి యాభై వేల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు ఢిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు వీడియో లింక్ ద్వారా ఈ సేవలను ప్రారంభిస్తారు. అదే సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎంపీలు కె.కేశవరావు, వి.హనుమంతరావు, మహ్మద్ అలీఖాన్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని 18 ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖ ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ సేవలను మరింత విస్తృతం చేసే యోచనలో ఉన్న శాఖ... కాచిగూడతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్‌లో కూడా అన్‌లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని కల్పించనుంది. త్వరలో నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో కూడా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్‌లో అరగంట పరిమిత ఉచిత ఇంటర్నెట్ సదుపాయం ఉంది.