
ఎంఎంటీఎస్ కేబిన్‌లో ఇరుక్కుపోయిన లోకోపైలట్‌ను రక్షించాక ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ స్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి.
క్యాబిన్‌లో ఇరుక్కున్న లోకో పైలట్ చంద్రశేఖర్
8 గంటల ఉత్కంఠ...
- ప్రమాదంలో ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్.. ఎంఎంటీఎస్ ముందు భాగాన్ని చీల్చు కుంటూ డ్యాష్‌బోర్డును స్వల్పంగా ధ్వంసం చేసి ఆగిపోయింది. దీంతో లోకోపైలట్ చంద్రశేఖర్ అందులో ఇరుక్కుపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి.
- ఉదయం 11 గంటలకు ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌ను కదలకుండా చేసి, ఎంఎంటీఎస్ రైలు ఎడమవైపు ఐరన్ షీటును కట్టర్లతో తొలగించారు. దాని వెనకాలే చంద్రశేఖర్ ఇరుక్కుని ఉండటంతో అక్కడ నుంచి
- మిగతా జాగ్రత్తగా చేతులతోనే కట్ చేయడం ప్రారంభించారు.
- 11.15 గంటలకు లోకోపైలట్‌కు ఆక్సిజన్ పెట్టారు. నిరంతరం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ.. బీపీ చెక్ చేస్తూ.. అతడు మత్తులోకి జారిపోకుండా మాట్లాడిస్తూ ఆపరేషన్ కొనసాగించారు.
- సాయంత్రం 5.25 గంటలకు రైలుకు ఎడమ పక్కన ఉన్న ఐరన్‌షీటు పూర్తిగా తొలగించారు. రక్త ప్రసరణ లేకపోవడంతో అతడి కాలు వాచిపోయి ఉన్న సంగతి అప్పుడు గుర్తించారు.
- సాయంత్రం 5.30 గంటలకు చంద్రశేఖర్ తల కనిపించడంతో వైద్యులు వెళ్లి ధైర్యం చెప్పారు. భయపడవద్దని మరికొద్ది నిమిషాల్లో బయటికి వస్తావని చెప్పారు.
- సాయంత్రం 6.05 గంటలకు డ్యాష్ బోర్డులో ఇరుక్కున్న చంద్రశేఖర్ వెనక ఉన్న మరో ఐరన్‌షీట్‌ను తొలగించారు. అయినా తల, ఛాతి, వెన్ను అలాగే ఉండిపోయాయి.
- సాయంత్రం 6.40 గంటలకు మిగిలిన భాగాలను కూడా కత్తిరించి, అతడిని బయటకి తీసుకొచ్చారు. వెంటనే చంద్రశేఖర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించారు.
రియల్ హీరో ‘నిశాంత్’
ప్రమాదం జరిగాక అక్కడి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ నిశాంత్ చివరి వరకు అక్కడే ఉన్నాడు. చంద్రశేఖర్‌ని నిత్యం మాట్లాడిస్తూ.. అతనికి నీళ్లు ఇస్తూ.. ధైర్యం చెబుతూ వచ్చాడు. రైలును కట్టర్లతో కోస్తున్నపుడు చంద్రశేఖర్‌పై నిప్పురవ్వలు ఎగిసిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిశాంత్‌కు తోడుగా రైల్వే సిబ్బంది శ్రీను, ఆక్సిజన్ సిలిండర్‌ను చివరి వరకు పట్టుకున్న స్టేషన్ ఉద్యోగి రాజు.. లోకోపైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment