trains collide
-
రెండు రైళ్లు ఢీ.. 12 మంది దుర్మరణం
సాక్షి ప్రతినిధి విజయనగరం/జామి/లక్కవరపుకోట/శృంగవరపు కోట/పెందుర్తి/సాక్షి, అమరావతి/కొవ్వూరు: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు రైళ్లు బయల్దేరిన కొద్ది నిమిషాల వ్యవధిలో ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ పెను ప్రమాదంలో 12 మంది మరణించగా.. 32 మంది గాయపడ్డారు. వీరిని విశాఖపట్నం, విజయనగరం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఏం జరిగిందో అర్ధమయ్యేలోపే కొన్ని బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు, హాహాకారాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం సాయంత్రం జామి మండల పరిధిలో జరిగింది. ఈ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివరాలివీ.. విశాఖ నుంచి–పలాస వెళ్లే పాసింజర్ రైలు ఆదివారం సా.6.42 గంటలకు కొత్తవలస రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరింది. భీమాళి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత అలమండ రైల్వేస్టేషన్ నుంచి సిగ్నల్ రాకపోవడంతో డ్రైవర్ రైలును నిలిపివేశారు. అదే సమయంలో సా.6.52 గంటల ప్రాంతంలో రాయఘడ పాసింజర్ కొత్తవలస నుంచి బయల్దేరింది. వేగంగా వస్తున్న రాయగడ పాసింజర్ అదే ట్రాక్‌పై ముందు వెళ్తున్న పలాస పాసింజర్ రైలును రాత్రి 7 గంటల సమయంలో వెనుక నుంచి భీమాళి–అలమండ రైల్వేస్టేషన్ల మధ్య ఢీకొట్టింది. దీంతో పలాస పాసింజర్ వెనుకనున్న రెండు బోగీలు, వాటిని ఢీకొన్న రాయఘడ పాసింజర్ రైలు ఇంజన్‌తో పాటూ మరో మూడు బోగీలు పలాస రైలు మీద పడి నుజ్జునుజ్జయ్యాయి. అదే సమయంలో కొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్స్ మీద పడ్డాయి. దీంతో పెను విషాదం అలముకుంది. మృతులు 12 మంది.. ఘటనలో 12 మంది మృతిచెందినట్లు గుర్తించారు. వారి మృతదేహాలను బయటికి తీశారు. నుజ్జునుజ్జయిన బోగీల్లో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. ఇక బోగీల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతుల్లో ఒక లోకో పైలట్ ఉన్నట్లు సమాచారం. 32 మందికి పైగా క్షతగాత్రులను 20 అంబులెన్స్‌ల్లో విజయనగరం, విశాఖల్లో వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. చీకట్లోనే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు.. ప్రమాదం గురించి తెలియగానే క్షణం ఆలస్యం చేయకుండా పోలీసు, వైద్య, రెవెన్యూ, ఇతర శాఖలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆ బృందాలు హుటాహుటిన సహాయక చర్యలను ప్రారంభించాయి. విశాఖ నుంచి ఒక ఎన్డీఆర్ఎఫ్, రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు చేపట్టాయి. అదనంగా విశాఖపట్నం నుంచి మరో ఎన్డీఆర్ఎఫ్, కాకినాడ నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. స్థానికులు కూడా సహకరించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న ఏపీ విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన ప్రజాప్రతినిధులు, అధికారుల రాక ప్రమాద ఘటన వార్త తెలుసుకున్న వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఎం.దీపికతో పాటూ పలువురు జిల్లా అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. జిల్లా యంత్రాంగానికి మంత్రి బొత్స పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైద్యశాఖ అప్రమత్తం.. ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖను అప్రమత్తం చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రమాదం గురించి తెలిసిన కొద్ది నిమిషాల్లోనే అప్రమత్తమైన ప్రభుత్వం 108 అంబులెన్సులను ఘటనా స్థలికి తరలించింది. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి 30 వరకూ 108 అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్‌కు.. స్వల్పంగా గాయపడ్డ వారిని విజయనగరంతో పాటు, సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. బాధితులకు వైద్య సహాయార్థం కేజీహెచ్‌లో హెల్ప్లైన్లు ఏర్పాటుచేశారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్లుగా.. పలు బోగీలు పట్టాలు తప్పినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్సులను పంపించాలని, మంచి వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. మరోవైపు.. దుర్ఘటనపై రాష్ట్ర హోం, విపత్తుల నివారణ శాఖ మంత్రి తానేటి వనిత కూడా దిగ్భ్రాంత్రి వ్యక్తంచేసి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ‘సాక్షి’కి చెప్పారు. ముఖ్యమంత్రికి రైల్వే మంత్రి ఫోన్ ఈ ప్రమాదంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం జగన్‌తో ఫోన్లో ఆదివారం రాత్రి మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను సీఎం జగన్ ఆయనకు వివరించారు. సహాయ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యన్నారాయణ, స్థానిక కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యసేవలు అందించడంపై అధికారులు దృష్టిపెట్టారని, వీరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్యసేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి చెప్పారు. ఏపీ మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలతో పాటు, క్షతగాత్రులకు సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు చొప్పున సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరణించిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున సహాయం అందించాలన్నారు. రైలు ప్రమాదంపై ప్రధాని విచారం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి రూ.రెండు లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించనున్నట్లు ప్రకటించారు. క్షత్రగాత్రులకు రూ.50,000 చొప్పున సహాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. తక్షణమే పరిస్థితిని సమీక్షించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ప్రధాని ఆదేశించారు. ఏం జరిగిందో అర్థంకాలేదు.. పార్వతీపురంలోని మా ఇంటికి వెళ్లేందుకు పెందుర్తిలో రైలెక్కాను. సుమారు గంట తరువాత ఆకస్మాత్తుగా రైలు భారీ కుదుపునకు గురైంది. మా బోగిలో అందరూ చెల్లాచెదురైపోయారు. కాసేపు ఏం జరిగిందో అర్థంకాలేదు. తేరుకునేటప్పటికి నా కాలికి తీవ్ర గాయమైంది. మా అల్లుడు వచ్చి పెందుర్తి ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. – వరలక్ష్మి, ప్రమాదంలో గాయపడిన మహిళ వెనుక నుంచి ఢీకొట్టడంవల్లే.. సాక్షి, విశాఖపట్నం/విజయనగరం అర్బన్/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ) : వాల్తేరు డివిజన్ పరిధిలోని విజయనగరం జిల్లా అలమండ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం భీతావహంగా మారింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ప్రాథమిక ఎఫ్ఐఆర్ సిద్ధంచేసి రైల్వే మంత్రిత్వ శాఖకు పంపించారు. ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఏఏ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి? అనే ప్రాథమిక అంశాల్ని అందులో పొందుపరిచారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ► ప్రమాదం జరిగిన తీరు: వెనుక నుంచి ఢీకొట్టడంవల్ల.. ► ప్రమాదం జరిగిన సమయం: 29 అక్టోబరు రాత్రి 7 గంటలకు.. ► డివిజన్ : వాల్తేరు రైల్వే డివిజన్ ► ఏ సెక్షన్లో జరిగింది: కంటకాపల్లి–అలమండ డీఎన్ మిడిల్ లైన్లో ► ప్రమాదం జరిగిన ప్రాంతం: 840/27 కి.మీ వద్ద ► ఏఏ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి: 08532 ఎక్స్‌ప్రెస్, 08504 ఎక్స్‌ప్రెస్ ► సమీప స్టేషన్ నుంచి ఎప్పుడు బయలుదేరాయి: 08532 ఎక్స్‌ప్రెస్ సా. 6.42 గంటలకు బయల్దేరింది.. 08504 ఎక్స్‌ప్రెస్ 6.52 గంటలకు బయలుదేరింది ► ఇతర సమాచారం: యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ కోసం 7.05కి సమాచారం ఇచ్చారు ► 7.07 గంటలకు యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ను (ఏఆర్టీ) ఆర్డర్ చేయగా 7.31 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. ► 7.10 గంటలకు 120 టన్నుల క్రేన్ బయల్దేరింది ► సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు : వాల్తేరు డివిజన్ డీఆర్ఎం, ఏడీఆర్ఎం(ఆపరేషనల్), ఇతర అధికారులు రైలు ప్రమాదంపై గవర్నర్ విచారం సాక్షి, అమరావతి : విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్‌భవన్ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. బీజేపీ, జనసేన నేతల దిగ్భ్రాంతి విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవాలని ఆమె ఓ ప్రకటనలో కోరారు. బాధితులకు అండగా నిలవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొద్ది నెలలక్రితం ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద సంఘటనను మరువకముందే మన రాష్ట్రంలో మరో ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ (35) శనివారం రాత్రి మృతి చెందాడు. ఎంఎంటీఎస్, ఇంటర్సిటీ రైలు సోమవారం ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్ రైలు క్యాబిన్లో ఇరుక్కుపోయిన లోకోపైలట్ చంద్రశేఖర్‌ను అతికష్టంమీద బయటకు తీసి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితికి చేరడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్సలు అందించారు. రెండ్రోజుల క్రితమే ఆయన కుడికాలును కూడా తొలగించారు. కిడ్నీలు కూడా పనిచేయడం మానేశాయి. శనివారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫిరంగుల దిబ్బకు చెందిన లోకోపైలట్ ఎల్.చంద్రశేఖర్ డెక్కపాటి 2011లో ఉద్యోగంలో చేరాడు. కాచిగూడ నెహ్రూనగర్‌లో ఉంటున్నాడు. హైదరాబాద్ రైల్వే డివిజన్ మెకానిక్ విభాగంలో చేరి లోకోపైలట్‌గా పని చేస్తున్నాడు.ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15రోజుల క్రితమే మగబిడ్డ పుట్టాడు. చంద్రశేఖర్ మృతితో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
లోకోపైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకోపైలట్ చంద్రశేఖర్ (35) కుడికాలు ను గురువారం తొలగించారు. ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిధ్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో కుడిమోకాలి పైభాగం వరకు కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బౌద్ధ నగర్‌కు చెందిన లెక్చరర్ శేఖర్(36)తో పాటు మరో నలుగురికి వివిధ రకాల చికిత్సలందిస్తున్నారు. -
మృత్యుంజయుడిగా నిలిచిన లోకోపైలట్
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ స్టేషన్లో రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి ఆయన్ను బయటకు తీశాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. సాయంత్రం 6.40 గంటలకు చంద్రశేఖర్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగాయి. క్యాబిన్లో ఇరుక్కున్న లోకో పైలట్ చంద్రశేఖర్ 8 గంటల ఉత్కంఠ... ప్రమాదంలో ఇంటర్సిటీ రైలు ఇంజిన్.. ఎంఎంటీఎస్ ముందు భాగాన్ని చీల్చు కుంటూ డ్యాష్‌బోర్డును స్వల్పంగా ధ్వంసం చేసి ఆగిపోయింది. దీంతో లోకోపైలట్ చంద్రశేఖర్ అందులో ఇరుక్కుపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్సిటీ రైలు ఇంజిన్‌ను కదలకుండా చేసి, ఎంఎంటీఎస్ రైలు ఎడమవైపు ఐరన్ షీటును కట్టర్లతో తొలగించారు. దాని వెనకాలే చంద్రశేఖర్ ఇరుక్కుని ఉండటంతో అక్కడ నుంచి మిగతా జాగ్రత్తగా చేతులతోనే కట్ చేయడం ప్రారంభించారు. 11.15 గంటలకు లోకోపైలట్‌కు ఆక్సిజన్ పెట్టారు. నిరంతరం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ.. బీపీ చెక్ చేస్తూ.. అతడు మత్తులోకి జారిపోకుండా మాట్లాడిస్తూ ఆపరేషన్ కొనసాగించారు. సాయంత్రం 5.25 గంటలకు రైలుకు ఎడమ పక్కన ఉన్న ఐరన్షీటు పూర్తిగా తొలగించారు. రక్త ప్రసరణ లేకపోవడంతో అతడి కాలు వాచిపోయి ఉన్న సంగతి అప్పుడు గుర్తించారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రశేఖర్ తల కనిపించడంతో వైద్యులు వెళ్లి ధైర్యం చెప్పారు. భయపడవద్దని మరికొద్ది నిమిషాల్లో బయటికి వస్తావని చెప్పారు. సాయంత్రం 6.05 గంటలకు డ్యాష్ బోర్డులో ఇరుక్కున్న చంద్రశేఖర్ వెనక ఉన్న మరో ఐరన్షీట్ను తొలగించారు. అయినా తల, ఛాతి, వెన్ను అలాగే ఉండిపోయాయి. సాయంత్రం 6.40 గంటలకు మిగిలిన భాగాలను కూడా కత్తిరించి, అతడిని బయటకి తీసుకొచ్చారు. వెంటనే చంద్రశేఖర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించారు. రియల్ హీరో ‘నిశాంత్’ ప్రమాదం జరిగాక అక్కడి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ నిశాంత్ చివరి వరకు అక్కడే ఉన్నాడు. చంద్రశేఖర్‌ని నిత్యం మాట్లాడిస్తూ.. అతనికి నీళ్లు ఇస్తూ.. ధైర్యం చెబుతూ వచ్చాడు. రైలును కట్టర్లతో కోస్తున్నపుడు చంద్రశేఖర్‌పై నిప్పురవ్వలు ఎగిసిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిశాంత్‌కు తోడుగా రైల్వే సిబ్బంది శ్రీను, ఆక్సిజన్ సిలిండర్‌ను చివరి వరకు పట్టుకున్న స్టేషన్ ఉద్యోగి రాజు.. లోకోపైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. -
కాచిగూడ వద్ద ప్రమాదం.. పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు, హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ప్రమాద ఘటన నేపథ్యంలో సోమవారం కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. 12 ఎంఎంటీఎస్ రైళ్లు, 16 ప్యాసింజర్ రైళ్లు, మరో 3 ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. అలాగే 38 రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరో 7 రైళ్లను వివిధ మార్గాల్లో మళ్లించారు. 6 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకూ రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ సర్వీసులు సికింద్రాబాద్ వరకే పరిమితమయ్యాయి. నాంపల్లి నుంచి ఫలక్‌నుమా మధ్య సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దయిన రైళ్లు.. కాచిగూడ–చెంగల్పట్టు (17652), కాచిగూడ–టాటానగర్ (07438/07439), కాచిగూడ–చిత్తూరు (12797/12798) ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. కాచిగూడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా–ఉందానగర్, ఉందానగర్–సికింద్రాబాద్, కాచిగూడ–కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్–మీర్జాపల్లి, మహబూబ్‌నగర్–కాచిగూడ రైళ్లు రద్దయ్యాయి. షోలాపూర్–ఫలక్‌నుమా (57659) రైలును సనత్‌నగర్ వరకే పరిమితం చేశారు. బోధన్–మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు మల్కాజిగిరి వరకే పరిమితమైంది. మల్కాజిగిరి–మహబూబ్‌నగర్ మధ్య నడిచే రైలును రద్దు చేశారు. మిర్యాలగూడ–కాచిగూడ ప్యాసింజర్ రైలు ను సీతాఫల్మండి వద్ద నిలిపివేశారు. కాచిగూడ నుంచి మిర్యాలగూడ వెళ్లవలసిన రైలును సీతాఫల్మండి నుంచి నడిపారు. బోధన్–మహబూబ్‌నగర్, నిజామాబాద్–కాచిగూడ రైళ్లను మల్కాజిగిరి వరకు పరిమితం చేశారు. వికారాబాద్–కాచిగూడ రైలు సికింద్రాబాద్ వరకు పరిమితమైంది. మేడ్చల్–కాచిగూడ రైలును బొల్లారం వరకే నడిపారు. నడికుడి–కాచిగూడ రైలు మల్కాజిగిరి వరకు నడిపారు. పలు రైళ్ల దారి మళ్లింపు.. అమరావతి–తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (12766)ను బొల్లారం–సికింద్రాబాద్–గుంతకల్–గుత్తి మీదుగా మళ్లించారు. కాచిగూ డ–చెంగల్పట్టు (17652) ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్–రాయ్‌చూర్–గుంతకల్–గుత్తి మీదుగా మళ్లించారు. కోయంబత్తూర్–హజ్రత్ నిజాముద్దీన్ (12647) ఎక్స్‌ప్రెస్‌ను డోన్–గుంతకల్–సికింద్రాబాద్ మార్గంలో మళ్లించారు. నాగర్సోల్–చెన్నై (16004) ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్, రాయచూర్, గుంతకల్ మీదుగా మళ్లించారు. కాచిగూడ–రేపల్లె (17625) రైలు సోమవారం రాత్రి 10.10కి బయలుదేరవలసి ఉండగా దీనిని అర్ధరాత్రి 12.30కి మార్చారు. -
ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమా?
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదానికి మానవ తప్పి దమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎంఎంటీఎస్ లోకోపైలట్ సిగ్నల్‌ను గమనించకపోవటంవల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గుర్తించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జీఎం ఆదేశం మేరకు అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. ఏ రైలుకు సిగ్నల్ ఇచ్చింది, ఏది ముందు వెళ్లాల్సి ఉంది తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించి ఆ సమాచారాన్ని నిర్ధారించుకున్నారు. ఎంఎంటీఎస్ రైలు లోకో పైలట్ చంద్రశేఖర్ సిగ్నల్‌ను గమనించకుండా రైలును ముందుకు తీసుకెళ్లటం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని గుర్తించినట్టు వారు పేర్కొన్నారు. కర్నూలు నుంచి వచ్చిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారని, అది పూర్తిగా వెళ్లిన తర్వాతే ఎంఎంటీఎస్‌కు సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని వివరించారు. కానీ ఇంటర్సిటీ రైలు రెండో ట్రాక్‌పై ఉండగానే ఎంఎంటీఎస్ ముందుకు వెళ్లిందని, ఆ సమయంలో సిగ్నలింగ్ ప్యానెల్ బోర్డుపై దానికి రెడ్ సిగ్నలే ఉన్నట్టుగా గుర్తించామని పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్ చంద్రశేఖర్ పొరబడి.. సిగ్నల్ లేకున్నా రైలును ముందుకు తీసుకెళ్లినట్టుగా భావిస్తున్నారు. రైలు కేబిన్‌లో ఇరుక్కుపోయి, 8 గంటల తర్వాత బయటపడిన ఆయన కాస్త కోలుకున్నాక కారణాలు తెలుసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఆటోమేటిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నల్ వ్యవస్థ... ప్రస్తుతం మన రైల్వే ప్రధాన స్టేషన్లో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థనే వినిగియోగిస్తున్నారు. ఆటోమేటిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాచిగూడలో కూడా అదే వ్యవస్థ ఉన్నందున సిగ్నలింగ్‌కు సంబంధించి సాం కేతిక లోపం తలెత్తే అవకాశం లేదని స్పష్టంచేస్తున్నారు. ‘ఇది సిగ్నల్ వ్యవస్థలో లోపంతో జరిగిన ప్రమాదం కాదు. మానవ తప్పిదంగానే భావిస్తున్నాం. ఆటోమేటిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టంలో ఒకే మార్గంలో రెండు రైళ్లకు సిగ్నల్ ఇవ్వటం కుదరదు. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కే సిగ్నల్ ఉన్నందున ఎంఎంటీఎస్‌కు లేనట్టే. కానీ దాన్ని గమనించకుండా లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లినట్టు భావిస్తున్నాం’అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ పేర్కొన్నారు. ఆ లోకోపైలట్‌కు ఎనిమిదేళ్ల అనుభవం.... ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్ చంద్రశేఖర్‌కు రైళ్లు నడపటంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉంది. ఆయన 2011లో ఆ ఉద్యోగంలో చేరారని అధికారులు పేర్కొన్నారు. తొలుత గూడ్సు రైళ్లకు లోకోపైలట్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లకు, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు లోకోపైలట్‌గా వ్యవహరించారు. ఆరు నెలల క్రితం ఆయనకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపే బాధ్యత అప్పగించారు. ఈ ఆరు నెలల్లో ఆయన ఎలాంటి పొరపాట్లూ చేయలేదని చెబుతున్నారు. అప్రమత్తం చేసేందుకు యత్నించా నాకు గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే గార్డుకు సమాచారం అందించా. ఆ తర్వాత రైలును ముందుకు కదిలించా. రెండో ట్రాక్ నుంచి మూడో ప్లాట్‌ఫామ్‌కు మళ్లే క్రమంలో ఎదురుగా ఎంఎంటీఎస్ రైలు రావటాన్ని గమనించా. వెంటనే ఆ లోకోపైలట్‌ను అప్రమత్తం చేసే సిగ్నల్ కూడా ఇచ్చాను. కానీ ఆయన దాన్ని గమనించలేదేమో. అప్పటికే దగ్గరకు వచ్చినందున బ్రేక్ వేసే వీలు కూడా లేనట్టుంది. – బాలకృష్ణ, ఇంటర్సిటీ లోకోపైలట్ ఆ మలుపే కాపాడింది.. ప్రమాద సమయంలో రెండు రైళ్లు తక్కువ వేగంతోనే ఉన్నాయి. వేగం తక్కువగానే ఉన్నా.. రెండు రైళ్లు కదులుతున్న పరిస్థితిలో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అందుకే ఇంటర్సిటీ ఇంజిన్ ఎంఎంటీఎస్ లోకోపైలట్ కేబిన్‌లోకి చొచ్చుకుపోయింది. అయినా కూడా తీవ్ర గాయాలు కాకుండా లోకోపైలట్ చంద్రశేఖర్ తప్పించుకోగలిగారు. దీనికి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ట్రాక్ మారే క్రమంలో దాని ఇంజిన్ సరిగ్గా ఎదురుగా కాకుండా కొంత పక్కగా ఉండటమే కారణంగా భావిస్తున్నారు. రెం డు ఇంజిన్లు కుడివైపు ఢీకొన్నాయి. ఇంటర్సిటీ ఇంజిన్ ఎంఎంటీఎస్ కేబిన్‌లో దూసుకుపోయినా.. నేరుగా దాని లోకోపైలట్ ఉన్న భాగాన్ని ధ్వం సం చేయలేదు. ఆయన కూర్చున్న ప్రాంతానికి కాస్త పక్కగా ఇంజిన్ దూ సుకొచ్చింది. దీంతో ఆయన కుర్చీ పైకి లేచి ఇరుక్కుపోయింది. ఫలితంగా లోకోపైలట్‌కు తీవ్ర గాయాలు కాలేదు. అదే సరిగ్గా ఎదురెదురుగా ఢీకొని ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉండేదని అధికారులు పేర్కొంటున్నారు. -
కాచిగూడ స్టేషన్లో రెండు రైళ్లు ఢీ
సాక్షి, హైదరాబాద్ : నిత్యం పలు రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి రెండు రైళ్లు ఢీకొన్నాయి. కర్నూలు–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి–ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. స్టేషన్ కావడంతో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఒకవేళ రెండు రైళ్ల వేగం ఎక్కువగా ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగి భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేది. ప్రాణనష్టం లేకపోవటంతో దీనిని చిన్న ప్రమాదంగానే పరిగణిస్తున్నా, ప్రమాదానికి దారితీసిన కారణాన్ని మాత్రం భారీ తప్పిదంగానే రైల్వే భావిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే సేఫ్టీ కమిషనర్ రాంక్రిపాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టనుంది. నుజ్జునుజ్జయిన ఎంఎంటీఎస్ లోకోపైలట్ కేబిన్ (ఇన్సెట్లో) ప్రమాదంలో గాయపడిన పి.శేఖర్ ఏం జరిగింది? కాచిగూడ స్టేషన్లోకి సోమవారం ఉదయం 10:20 గంటల సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చి ఆగింది. ప్రయాణికులు దిగిపోయిన తర్వాత సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. అంతకు ముందే కర్నూలు టౌన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ స్టేషన్ వద్దకు చేరుకుంది. అది మూడో నంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్లాల్సి ఉంది. అది వచ్చిన సమయంలో మరో రైలు ఆ ప్రాంతాన్ని దాటాల్సి ఉండటంతో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను హోం సిగ్నల్ ప్రాంతంలో ఆపి ఉంచారు. అది ఆగిన ప్రాంతం ప్లాట్‌ఫామ్‌కు 500 మీటర్ల దూరంలో ఉంటుంది. 10.30 గంటల సమయంలో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాన లైన్ మీదుగా వచ్చినందున అది తొలుత ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాక్, ఆ తర్వాత రెండో నంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాక్‌లను దాటుకుని మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ ట్రాక్‌పైకి వెళ్లాలి. సిగ్నల్ పడగానే ఆ రైలు బయలుదేరి మొదటి ట్రాక్‌ను దాటి రెండో ట్రాక్‌పైకి వచ్చి దాన్ని క్రాస్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. అప్పటికే రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న ఎంఎంటీఎస్ రైలు ఫలక్‌నుమా వైపు ముందుకు కదిలింది. దాని లోకోపైలట్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆ ట్రాక్ మీదుగా మరో ట్రాక్‌లోకి క్రాస్ అవుతున్న సంగతిని గుర్తించలేదు. దీంతో ఎంఎంటీఎస్ నేరుగా దూసుకెళ్లి ఇంటర్సిటీ ఇంజిన్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగింది ఇలా.. (సీసీ టీవీ దృశ్యాలు) ఈ ఘటనలో ఇంటర్సిటీ రైలు ఇంజిన్ ఎంఎంటీఎస్ లోకోపైలట్ కేబిన్‌లోకి చొచ్చుకుపోయింది. ఎంఎంటీఎస్ తొలి నాలుగు బోగీలు ఎగిరి పట్టాల పక్కన పడిపోగా.. మరో రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. ఇంటర్సిటీకి చెందిన మూడు బోగీలు సైతం పట్టాల నుంచి పక్కకు దిగిపోయాయి. ప్రమాద ఘటనలో ఎంఎంటీఎస్ ఒక్కసారిగా పెద్ద కుదుపుతో గాలిలోకి ఎగిరి కింద పడటంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. బోగీ డోరు వద్ద ఉన్నవారు కొందరు కిందకు పడిపోయారు. ఘటన జరిగిన వెంటనే భయాందోళనలకు గురైన ప్రయాణికులు బోగీల నుంచి దూకి చెల్లాచెదురుగా పారిపోయారు. ఇంటర్సిటీ ఇంజిన్ చొచ్చుకెళ్లడంతో లోకోపైలట్ చంద్రశేఖర్ కేబిన్‌లోనే చిక్కుకుపోయారు. దాదాపు 8 గంటల తర్వాత ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఆయన్ను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. వేగం తక్కువగా ఉండటంతో.... ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ట్రాక్ మారే ప్రయత్నంలో ఉన్నందున ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ వేగం 10 కిలోమీటర్ల లోపే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ వేగం 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉందని రైల్వే చెప్పారు. సాధారణంగా ప్లాట్‌ఫామ్ నుంచి బయలు దేరి 500 మీటర్ల దూరం వచ్చేసరికి ఎంఎంటీఎస్ రైళ్ల వేగం దాదాపు 40 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతం ట్రాక్ ఛేంజింగ్ పాయింట్ కావటంతో అక్కడ వేగం అందులో సగానికి తక్కువే ఉంటుంది. ఇదే ఇక్కడ పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఉస్మానియా, కేర్లలో చికిత్స.. ప్రమాద ఘటనలో గాయపడినవారిలో కొందరు సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కాస్త ఎక్కువ గాయాలైన 17 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారిలో 11 మందికి ఓపీలో చికిత్స చేసి పంపించగా.. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. పరకాలకు చెందిన పి.శేఖర్(36)కి తల, చేతులపై తీవ్ర గాయాలు కాగా, యాకుత్‌పురాకు చెందిన రహీమోద్దీన్(55)కి కూడా బలమైన గాయాలయ్యాయి. వీరికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. గద్వాలకు చెందిన బాలేశ్వరమ్మ(52)కు ఎడమ కాలు, హఫీజ్‌పేట్‌కు చెందిన రాజ్‌కుమార్(35)కు కుడికాలు విరిగిపోయాయి. వీరికి ఉస్మానియాలో కట్టు కట్టిన తర్వాత మెరుగైన వైద్యం కోసం నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. లోకోపైలట్ చంద్రశేఖర్‌తోపాటు మరో క్షతగాత్రుడు సాజిద్‌ను కూడా కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వల్ప గాయాలతో బయటపడిన సులోచన(32), ఆంజనేయులు(35), మహ్మద్ అలీ(45), ప్రభాకర్(65), రాజ్‌కుమార్(24), మౌనిక(18), అనురాధమ్మ(40), మీర్జాబేగం(46), బలరాం(45), మల్లమ్మ(50), ఆనంద్(25)లకు ఉస్మానియా ఓపీలో చికిత్స చేసి పంపించారు. ప్రమాదం జరిగిన వెంటనే బోగీ నుంచి బయటకు దూకి పరుగులు తీస్తున్న ప్రయాణికులు గవర్నర్ ఆరా... రైలు ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరోవైపు రైల్వే అధికారులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి చికిత్స నిమిత్తం రూ.25 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. పెద్దశబ్దం వచ్చింది రైళ్లు ఢీకొనగానే భారీగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. నేను మహిళా బోగీలో ఉన్నాను. అంతా హాహాకారాలు చేశారు. బోగీలో కొద్దిగా తొక్కిసలాట కూడా జరిగింది. వెంటనే తేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాం.– ఆంజనేయరాజు, ఆర్పీఎఫ్ కొందరు బయటపడ్డారు నేను మహిళా బోగీలో విధుల్లో ఉన్నాను. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. డోర్ల వద్ద నిలుచున్న చాలామంది ఎగిరి అవతల పడ్డారు. రైలు పట్టాలు తప్పిందని అర్థమైంది. నేను వెంటనే బోగీ నుంచి కిందకు దిగి, రైలు ఇంజిన్ వైపు పరిగెత్తాను. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి, అధికారులను అప్రమత్తం చేసాను. – ఎమ్మార్సీ రాజు, ఆర్పీఎఫ్ -
పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం
-
రెండు రైళ్లు ఢీ: 35 మందికి గాయాలు
బెర్లీన్: దక్షిణ జర్మనీలోని మెన్హెయమ్ స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ ట్రైన్‌ను గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ప్యాసింజర్‌కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయిని ... 35 మంది ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు. పట్టాలు తప్పిన రైలును ట్రాక్‌పైకి తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గత రాత్రి ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్ ట్రైన్లో 250 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఫ్రెంచ్ సరిహద్దు సమీపంలోని సర్ర్బ్రూకెన్ నుంచి ఆస్ట్రియాలోని గ్రాజ్ పట్టణాల మధ్య ఆ ప్యాసింజర్ ట్రైన్ తిరుగుతుందని ఉన్నతాధికారి తెలిపారు. -
రెండు రైళ్లు ఢీ: ఇద్దరు మృతి
రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు మరణించగా, మరో 12 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు రైళ్లు ఢీ కొన్న సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 410 కిలోమీటర్ల దూరంలో సోనిభద్ర సమీపంలో గత అర్థరాత్రి చోటూ చేసుకుంది. వారణాసి- శక్తినగర్ ఇంటర్ సిటీ రైలు సోనిభద్ర సమీపంలోని ఒబ్రా డామ్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచి ఉంది. అయితే అప్పటికే స్టేషన్లో ఆగి ఉన్న కాత్ని ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే సిబ్బంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో కాత్ని ఎక్స్‌ప్రెస్ వేగంగా వెళ్లి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. ఆ ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.