రెండు రైళ్లు ఢీ.. 12 మంది దుర్మరణం | Train accident in Vizianagaram district Kantakapalle Andhra pradesh | Sakshi
Sakshi News home page

రెండు రైళ్లు ఢీ.. 12 మంది దుర్మరణం

Published Mon, Oct 30 2023 4:07 AM | Last Updated on Mon, Oct 30 2023 7:19 AM

Train accident in Vizianagaram district Kantakapalle Andhra pradesh - Sakshi

ఘటనా స్థలిలో నుజ్జునుజ్జయిన బోగీలు

సాక్షి ప్రతినిధి విజయనగరం/జామి/లక్కవరపు­కోట/శృంగవరపు కోట/పెందుర్తి/సాక్షి, అమరావతి/కొవ్వూరు:  విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు రైళ్లు బయల్దేరిన కొద్ది నిమిషాల వ్యవధిలో ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ పెను ప్రమాదంలో 12 మంది మరణించగా.. 32 మంది గాయపడ్డారు. వీరిని విశాఖపట్నం, విజయనగరం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

ఏం జరిగిందో అర్ధమయ్యేలోపే కొన్ని బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఒక్క­సారిగా అరుపులు, కేకలు, హాహాకారాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం సాయంత్రం జామి మండల పరిధిలో జరిగింది. ఈ దుర్ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివరాలివీ..  

విశాఖ నుంచి–పలాస వెళ్లే పాసింజర్‌ రైలు ఆదివారం సా.6.42 గంటలకు కొత్తవలస రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరింది. భీమాళి రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత అలమండ రైల్వేస్టేషన్‌ నుంచి సిగ్నల్‌ రాకపోవడంతో డ్రైవర్‌ రైలును నిలిపివేశారు. అదే సమయంలో సా.6.52 గంటల ప్రాంతంలో రాయఘడ పాసింజర్‌ కొత్తవలస నుంచి బయల్దేరింది.

వేగంగా వస్తున్న రాయగడ పాసింజర్‌ అదే ట్రాక్‌పై ముందు వెళ్తున్న పలాస పాసింజర్‌ రైలును రాత్రి 7 గంటల సమయంలో వెనుక నుంచి భీమాళి–అలమండ రైల్వేస్టేషన్ల మధ్య ఢీకొట్టింది. దీంతో పలాస పాసింజర్‌ వెనుకనున్న రెండు బోగీలు, వాటిని ఢీకొన్న రాయఘడ పాసింజర్‌ రైలు ఇంజన్‌తో పాటూ మరో మూడు బోగీలు పలాస రైలు మీద పడి నుజ్జునుజ్జయ్యాయి. అదే సమయంలో కొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ మీద పడ్డాయి. దీంతో పెను విషాదం అలముకుంది. 

మృతులు 12 మంది.. 
ఘటనలో 12 మంది మృతిచెందినట్లు గుర్తించారు. వారి మృతదేహాలను బయటికి తీశారు. నుజ్జునుజ్జయిన బోగీల్లో మరిన్ని మృతదేహాలు ఉండే అవ­కాశం ఉంది. ఇక బోగీల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతుల్లో ఒక లోకో పైలట్‌ ఉన్నట్లు సమాచారం. 32 మందికి పైగా క్షతగాత్రులను 20 అంబులెన్స్‌ల్లో విజయనగరం, విశాఖల్లో వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు.    

చీకట్లోనే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు..
ప్రమాదం గురించి తెలియగానే క్షణం ఆలస్యం చేయ­కుండా పోలీసు, వైద్య, రెవెన్యూ, ఇతర శాఖ­లను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆ బృందాలు హుటాహుటిన సహాయక చర్యలను ప్రారంభించాయి. విశాఖ నుంచి ఒక ఎన్డీఆర్‌ఎఫ్, రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ, రిలీఫ్‌ ఆపరేషన్‌లు చేపట్టాయి. అదనంగా విశాఖపట్నం నుంచి మరో ఎన్‌డీఆర్‌ఎఫ్, కాకినాడ నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రంగంలోకి దింపారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయ­టకు తీశారు. స్థానికులు కూడా సహకరించారు.  

క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న ఏపీ విపత్తు నిర్వహణ సిబ్బంది

హుటాహుటిన ప్రజాప్రతినిధులు, అధికారుల రాక 
ప్రమాద ఘటన వార్త తెలుసుకున్న వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ ఎం.దీపికతో పాటూ పలువురు జిల్లా అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. జిల్లా యంత్రాంగానికి మంత్రి బొత్స పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.   
ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు    

వైద్యశాఖ అప్రమత్తం.. 
ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖను అప్రమత్తం చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రమాదం గురించి తెలిసిన కొద్ది నిమిషాల్లోనే అప్రమత్తమైన ప్రభుత్వం 108 అంబులెన్సులను  ఘటనా స్థలికి తరలించింది. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి 30 వరకూ 108 అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆ­స్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వా­రిని విశాఖ కేజీహెచ్‌కు.. స్వల్పంగా గాయపడ్డ వారి­ని విజయనగరంతో పాటు, సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. బాధితులకు వైద్య సహాయార్థం కేజీహెచ్‌లో హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేశారు. 

సీఎం జగన్‌ దిగ్భ్రాంతి 
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్లుగా.. పలు బోగీలు పట్టాలు తప్పినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్సులను పంపించాలని, మంచి వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. మరోవైపు.. దుర్ఘటనపై రాష్ట్ర హోం, విపత్తుల నివారణ శాఖ మంత్రి తానేటి వనిత కూడా దిగ్భ్రాంత్రి వ్యక్తంచేసి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ‘సాక్షి’కి చెప్పారు.  

ముఖ్యమంత్రికి రైల్వే మంత్రి ఫోన్‌ 
ఈ ప్రమాదంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సీఎం జగన్‌తో ఫోన్‌లో ఆదివారం రాత్రి మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను సీఎం జగన్‌ ఆయనకు వివరించారు. సహాయ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని చెప్పారు.

జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యన్నారాయణ, స్థానిక కలెక్టర్, ఎస్పీ కూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు సరైన వైద్యసేవలు అందించడంపై అధికారులు దృష్టిపెట్టారని, వీరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్యసేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి చెప్పారు.  

ఏపీ మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలతో పాటు, క్షతగాత్రులకు సీఎం జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు చొప్పున సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరణించిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున సహాయం అందించాలన్నారు. 

రైలు ప్రమాదంపై ప్రధాని విచారం
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి రూ.రెండు లక్షల చొప్పున పరిహారాన్ని చెల్లించనున్నట్లు ప్రకటించారు. క్షత్రగాత్రులకు రూ.50,000 చొప్పున సహాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. తక్షణమే పరిస్థితిని సమీక్షించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ప్రధాని ఆదేశించారు.  

ఏం జరిగిందో అర్థంకాలేదు.. 
పార్వతీపురంలోని మా ఇంటికి వెళ్లేందుకు పెందుర్తిలో రైలెక్కాను. సుమారు గంట తరువాత ఆకస్మాత్తుగా రైలు భారీ కుదుపునకు గురైంది. మా బోగిలో అందరూ చెల్లాచెదురైపోయారు. కాసేపు ఏం జరిగిందో అర్థంకాలేదు. తేరుకునేటప్పటికి నా కాలికి తీవ్ర గాయమైంది. మా అల్లుడు వచ్చి పెందుర్తి ఆసుపత్రిలో చికిత్స చేయించాడు.  
    – వరలక్ష్మి, ప్రమాదంలో గాయపడిన మహిళ  

వెనుక నుంచి ఢీకొట్టడంవల్లే..
సాక్షి, విశాఖపట్నం/విజయనగరం అర్బన్‌/­రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ) : వాల్తేరు డివిజన్‌ పరిధిలోని విజయనగరం జిల్లా అలమండ సమీపంలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం భీతావహంగా మారింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వాల్తేరు రైల్వే డివిజన్‌ అధికారులు ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌ సిద్ధంచేసి రైల్వే మంత్రిత్వ శాఖకు పంపించారు. ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఏఏ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి? అనే ప్రాథమిక అంశాల్ని అందులో పొందుపరిచారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం వివరాలిలా ఉన్నాయి..

► ప్రమాదం జరిగిన తీరు: వెనుక నుంచి ఢీకొట్టడంవల్ల..
► ప్రమాదం జరిగిన సమయం: 29 అక్టోబరు రాత్రి 7 గంటలకు..
► డివిజన్‌ : వాల్తేరు రైల్వే డివిజన్‌
► ఏ సెక్షన్‌లో జరిగింది: కంటకా­పల్లి–అలమండ డీఎన్‌ మిడిల్‌ లైన్‌లో
► ప్రమాదం జరిగిన ప్రాంతం: 840/27 కి.మీ వద్ద
► ఏఏ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి: 08532 ఎక్స్‌ప్రెస్, 08504 ఎక్స్‌ప్రెస్‌
► సమీప స్టేషన్‌ నుంచి ఎప్పుడు బయలుదేరాయి: 08532 ఎక్స్‌ప్రెస్‌ సా. 6.42 గంటలకు బయల్దేరింది.. 08504 ఎక్స్‌ప్రెస్‌ 6.52 గంటలకు బయలుదేరింది
► ఇతర సమాచారం: యాక్సిడెంట్‌ రిలీఫ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కోసం 7.05కి సమాచారం ఇచ్చారు
► 7.07 గంటలకు యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్‌ను (ఏఆర్‌టీ) ఆర్డర్‌ చేయగా 7.31 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది.
► 7.10 గంటలకు 120 టన్నుల క్రేన్‌ బయల్దేరింది
► సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు : వాల్తేరు డివిజన్‌ డీఆర్‌ఎం, ఏడీఆర్‌ఎం(ఆపరేషనల్‌), ఇతర అధికారులు 

రైలు ప్రమాదంపై గవర్నర్‌ విచారం
సాక్షి, అమరావతి : విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. 

బీజేపీ, జనసేన నేతల దిగ్భ్రాంతి 
విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవాలని ఆమె ఓ ప్రకటనలో కోరారు. బాధితులకు అండగా నిలవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొద్ది నెలలక్రితం ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద సంఘటనను మరువకముందే మన రాష్ట్రంలో మరో ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement