సాక్షి, హైదరాబాద్ : కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదానికి మానవ తప్పి దమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎంఎంటీఎస్ లోకోపైలట్ సిగ్నల్‌ను గమనించకపోవటంవల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గుర్తించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జీఎం ఆదేశం మేరకు అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. ఏ రైలుకు సిగ్నల్ ఇచ్చింది, ఏది ముందు వెళ్లాల్సి ఉంది తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించి ఆ సమాచారాన్ని నిర్ధారించుకున్నారు. ఎంఎంటీఎస్ రైలు లోకో పైలట్ చంద్రశేఖర్ సిగ్నల్‌ను గమనించకుండా రైలును ముందుకు తీసుకెళ్లటం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని గుర్తించినట్టు వారు పేర్కొన్నారు.
కర్నూలు నుంచి వచ్చిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు మూడో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారని, అది పూర్తిగా వెళ్లిన తర్వాతే ఎంఎంటీఎస్‌కు సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని వివరించారు. కానీ ఇంటర్‌సిటీ రైలు రెండో ట్రాక్‌పై ఉండగానే ఎంఎంటీఎస్ ముందుకు వెళ్లిందని, ఆ సమయంలో సిగ్నలింగ్ ప్యానెల్ బోర్డుపై దానికి రెడ్ సిగ్నలే ఉన్నట్టుగా గుర్తించామని పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్ చంద్రశేఖర్ పొరబడి.. సిగ్నల్ లేకున్నా రైలును ముందుకు తీసుకెళ్లినట్టుగా భావిస్తున్నారు. రైలు కేబిన్‌లో ఇరుక్కుపోయి, 8 గంటల తర్వాత బయటపడిన ఆయన కాస్త కోలుకున్నాక కారణాలు తెలుసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఆటోమేటిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నల్ వ్యవస్థ...
ప్రస్తుతం మన రైల్వే ప్రధాన స్టేషన్‌లో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థనే వినిగియోగిస్తున్నారు. ఆటోమేటిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాచిగూడలో కూడా అదే వ్యవస్థ ఉన్నందున సిగ్నలింగ్‌కు సంబంధించి సాం కేతిక లోపం తలెత్తే అవకాశం లేదని స్పష్టంచేస్తున్నారు. ‘ఇది సిగ్నల్ వ్యవస్థలో లోపంతో జరిగిన ప్రమాదం కాదు. మానవ తప్పిదంగానే భావిస్తున్నాం. ఆటోమేటిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టంలో ఒకే మార్గంలో రెండు రైళ్లకు సిగ్నల్ ఇవ్వటం కుదరదు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కే సిగ్నల్ ఉన్నందున ఎంఎంటీఎస్‌కు లేనట్టే. కానీ దాన్ని గమనించకుండా లోకోపైలట్ రైలును ముందుకు తీసుకెళ్లినట్టు భావిస్తున్నాం’అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్ పేర్కొన్నారు.
ఆ లోకోపైలట్‌కు ఎనిమిదేళ్ల అనుభవం....
ఎంఎంటీఎస్ రైలు లోకోపైలట్ చంద్రశేఖర్‌కు రైళ్లు నడపటంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉంది. ఆయన 2011లో ఆ ఉద్యోగంలో చేరారని అధికారులు పేర్కొన్నారు. తొలుత గూడ్సు రైళ్లకు లోకోపైలట్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లకు, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు లోకోపైలట్‌గా వ్యవహరించారు. ఆరు నెలల క్రితం ఆయనకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపే బాధ్యత అప్పగించారు. ఈ ఆరు నెలల్లో ఆయన ఎలాంటి పొరపాట్లూ చేయలేదని చెబుతున్నారు.
అప్రమత్తం చేసేందుకు యత్నించా
నాకు గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే గార్డుకు సమాచారం అందించా. ఆ తర్వాత రైలును ముందుకు కదిలించా. రెండో ట్రాక్ నుంచి మూడో ప్లాట్‌ఫామ్‌కు మళ్లే క్రమంలో ఎదురుగా ఎంఎంటీఎస్ రైలు రావటాన్ని గమనించా. వెంటనే ఆ లోకోపైలట్‌ను అప్రమత్తం చేసే సిగ్నల్ కూడా ఇచ్చాను. కానీ ఆయన దాన్ని గమనించలేదేమో. అప్పటికే దగ్గరకు వచ్చినందున బ్రేక్ వేసే వీలు కూడా లేనట్టుంది. – బాలకృష్ణ, ఇంటర్‌సిటీ లోకోపైలట్
ఆ మలుపే కాపాడింది..
ప్రమాద సమయంలో రెండు రైళ్లు తక్కువ వేగంతోనే ఉన్నాయి. వేగం తక్కువగానే ఉన్నా.. రెండు రైళ్లు కదులుతున్న పరిస్థితిలో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అందుకే ఇంటర్‌సిటీ ఇంజిన్ ఎంఎంటీఎస్ లోకోపైలట్ కేబిన్‌లోకి చొచ్చుకుపోయింది. అయినా కూడా తీవ్ర గాయాలు కాకుండా లోకోపైలట్ చంద్రశేఖర్ తప్పించుకోగలిగారు. దీనికి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ట్రాక్ మారే క్రమంలో దాని ఇంజిన్ సరిగ్గా ఎదురుగా కాకుండా కొంత పక్కగా ఉండటమే కారణంగా భావిస్తున్నారు. రెం డు ఇంజిన్లు కుడివైపు ఢీకొన్నాయి. ఇంటర్‌సిటీ ఇంజిన్ ఎంఎంటీఎస్ కేబిన్‌లో దూసుకుపోయినా.. నేరుగా దాని లోకోపైలట్ ఉన్న భాగాన్ని ధ్వం సం చేయలేదు. ఆయన కూర్చున్న ప్రాంతానికి కాస్త పక్కగా ఇంజిన్ దూ సుకొచ్చింది. దీంతో ఆయన కుర్చీ పైకి లేచి ఇరుక్కుపోయింది. ఫలితంగా లోకోపైలట్‌కు తీవ్ర గాయాలు కాలేదు. అదే సరిగ్గా ఎదురెదురుగా ఢీకొని ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉండేదని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment