Free Wi-Fi services
-
మానుకోటలో ‘ఫైబర్ టు ది హోం’ అభినందనీయం
తొలి విడతలో 10 గ్రామాలకు ఉచిత వైఫై సేవలు ఎంపీ సీతారాం నాయక్ కేబుల్ ఆపరేటర్ల సహకారంతో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రాజెక్టు పోచమ్మమైదాన్ : మానుకోట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేబుల్ ఆపరేటర్ల సహకారంతో బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ‘ఫైబర్ టు ది హోం’(ఎఫ్టీటీహెచ్) కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. మంగళవారం వరంగల్‌లోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్(పీజీఎం) నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన టెలికాం అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడమే లక్ష్యంగా ఎఫ్టీటీహెచ్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మహారాష్ట్ర తరహాలో మానుకోట పార్లమెంట్ స్థానం పరిధిలో తొలి విడతగా 10 గ్రామాలు ఉచిత వైఫై సేవలు అందేలా చూస్తానన్నారు. చిన్న జిల్లాలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎంపీ అన్నారు. ప్రజలకు మరిన్ని∙మెరుగైన సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సమాయత్తం కావాలన్నారు. అనంతరం పీజీఎం నరేందర్ మాట్లాడుతూ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ ద్వారా ప్రతినెలా 10వేల కొత్త సెల్‌ఫోన్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. మహబూబాబాద్‌లో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 6న జరిగిన టీఏసీ సమావేశంలో సభ్యులు లెవనెత్తిన సమస్యలకు చూపిన పరిష్కారాల గురించి నివేదిక చదివి వినిపించారు. టీఏసీ సభ్యుడు ఒగిలిశెట్టి అనిల్ మాట్లాడుతూ వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో ఇటీవల ఓఎఫ్సీ కేబుల్ కట్ కావడంతో రెండు రోజుల పాటు అక్కడి ఎస్బీహెచ్లో బ్యాకింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. అజ్మీర శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ నర్సంపేట మహేశ్వరంలోని రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ గత కొన్ని రోజులుగా పని చేయడం లేదని, బీఎస్ఎన్ఎల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో సభ్యులు బాస్కుల ఈశ్వర్, వీరస్వామి, సోమనర్సజీ, పీఆర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాచిగూడ స్టేషన్లో ఉచిత వైఫై
♦ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్న రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ♦ త్వరలో సికింద్రాబాద్, నాంపల్లిలలో... సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉచిత అన్లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా రోజుకు నలభై నుంచి యాభై వేల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు ఢిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు వీడియో లింక్ ద్వారా ఈ సేవలను ప్రారంభిస్తారు. అదే సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎంపీలు కె.కేశవరావు, వి.హనుమంతరావు, మహ్మద్ అలీఖాన్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని 18 ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖ ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ సేవలను మరింత విస్తృతం చేసే యోచనలో ఉన్న శాఖ... కాచిగూడతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా అన్లిమిటెడ్ హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని కల్పించనుంది. త్వరలో నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో కూడా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో అరగంట పరిమిత ఉచిత ఇంటర్నెట్ సదుపాయం ఉంది. -
‘హాట్ స్పాట్’ అంతటా నెట్!
గ్రేటర్ నెటి(సిటీ)జన్లకు శుభవార్త. స్మార్ట్ ఫోన్..ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్...వీటిలో ఏ ఒక్కటి మీ చెంత వున్నా, ఏ మూలన మీరున్నా..సులభంగా ‘నెట్టు’కు రావచ్చు. హాయిగా ఇంటర్నెట్ను ఎంజాయ్ చేయొచ్చు. డిసెంబర్‌లోగా నగరమంతటా వై ఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 60 హాట్ స్పాట్లు సేవలందిస్తుండగా...వాటిని ఏకంగా రెండు వేలకు పెంచనున్నారు. ఒక హాట్‌స్పాట్ పరికరం పరిధిలో ఒకేసారి 500 మంది 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. - గ్రేటర్ వ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు - డిసెంబర్‌లోగా అందుబాటులోకి - చర్యలు చేపట్టిన ఐటీ శాఖ - నగరం నలుమూలలా రెండు వేల హాట్స్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వ్యాప్తంగా డిసెంబరులోగా తొలి అరగంట ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నగరంలో కీలకమైన పర్యాటక, దర్శనీయ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. మాదాపూర్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఇప్పటికే వై-ఫై సేవలు అందుబాటులోకి రాగా.. మంగళవారం నుంచి చార్మినార్, గాంధీ ఆస్పత్రి, నిమ్స్, బిర్లామందిర్, బిర్లా మ్యూజియం, బిర్లా ప్లానెటోరియం, పబ్లిక్ గార్డెన్స్‌లో అరగంట ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. కాగా మహానగర వ్యాప్తంగా వై-ఫై సేవలు అందించేందుకు రెండువేల హాట్‌స్పాట్ పరికరాలను బీఎస్ఎన్ఎల్, క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతానికి 60 చోట్ల వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఒక హాట్‌స్పాట్ పరికరం పరిధిలో ఒకేసారి 500 మంది లాగిన్ అయి అత్యాధునిక 5జి సేవలు అందుకునే వీలుంటుందని చెప్పారు. త్వరలో ఈ ప్రాంతాల్లో... నగరంలోని టూరిస్టు హోటళ్లు, తారామతి బారాదరి, శిల్పారామం, శిల్పకళా వేదిక, ఎంజీబీఎస్, జూబ్లీబస్స్టేషన్లలో మరో పక్షం రోజుల్లో వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అరగంటపాటు 300 ఎంబీ సామర్థ్యంగల డేటాను ఉచితంగా వినియోగించుకునే అవకాశం కలగనుంది. ఆ తరవాత ప్రతి అరగంటకు రూ.30 చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రీచార్జి కార్డులను బీఎస్ఎన్ఎల్ స్టోర్లలో విక్రయించనున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వై-ఫై సేవలను ప్రస్తుతానికి సుమారు 50 వేల మంది వినియోగించుకుంటున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వై-ఫై అంటే.. వైఫై అంటే.. వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ (డబ్ల్యూఐఎల్‌ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఆంగ్లభాషలో డబ్ల్యూఎల్‌ఏఎన్‌ను కుదించి ‘వై ఫై’ అని పిలుస్తున్నారు. అంటే ైవెర్లైస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వైఫై టవర్ సిగ్నల్స్ ఇండోర్‌లో అయితే 20 మీటర్లు (66 ఫీట్లు), ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు (330 ఫీట్లు) వరకు అందుతాయి. వైఫైతో కంప్యూటర్లు, వీడియో గేమ్స్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు, కొన్ని రకాల డిజిటల్ కెమెరాలు, ట్యాబ్లెట్స్, డిజిటల్ ఆడియో ప్లేయర్లు వంటివెన్నో కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా వినియోగించుకోవాలి... - మీ స్మార్ట్‌ఫోన్‌లో వై ఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మీ మొబైల్ నెంబరును, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్చేయాలి - ఆ తర్వాత మీ మొబైల్‌కు యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి. - రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు అరగంటపాటు ఉచితంగా వైఫై సేవలు అందుతాయి. సిగ్నల్స్ ఇలా.. తీగల అవసరం లేకుండా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడమే వైఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వైఫై రౌటర్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్ను నిర్ణీత పరిధిలో వైఫై సౌకర్యం కలిగి ఉన్న ఫోన్లు, కంప్యూటర్లు వంటివాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తాయి. సులువుగా చెప్పాలంటే మనం బ్లూటూత్ ద్వారా ఫోటోలు, పాటలు పంపినట్లే వై-ఫై ఇంటర్నెట్ సేవలను అందిస్తుందన్నమాట. -
నేటి నుంచి హైదరాబాద్‌లో ఉచిత వైఫై
పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌ను వైఫై నగరంగా మార్చుతామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. నగరవాసులకు ఉచిత వైఫై సేవలు అందించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టనుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. గురువారం సాయంత్రం 5.15 గంటలకు హోటల్ మారియట్‌లో ఉచిత వైఫై పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తొలి వీడియో(ఫేస్‌టైం) కాల్ చేసి కేటీఆర్ సంభాషించనున్నారు. ఈ ఉచిత వైఫై ప్రాజెక్టుకు బీఎస్ఎన్ఎల్, క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా సేవలు అందించనున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల పరిధిలోని వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయని, ఒకేసారి 2,500 మంది లాగిన్ కావచ్చని అధికారులు తెలిపారు.2 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వేగంతో ఈ ఉచిత వైఫై సేవలు లభిస్తాయని, ఒక్కో పౌరుడు 30 నిమిషాలు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చని వివరించారు. -
నవీముంబైకి వైఫై సేవలు
సాక్షి, ముంబై : నగరంలో మొట్ట మొదటిసారిగా శివాజీ పార్క్‌లో ఉచిత వైఫై సేవలను పూర్తి చేసిన తర్వాత నవీ ముంబైలో కూడా ఉచితంగా ఈ సేవలను ప్రారంభించడానికి కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. రెసిడెన్షియల్ కాలనీలు, ఉద్యాన వనాలు, బస్టాపులు, కాలేజీలలో వైఫై సేవలను ఏర్పాటు చేయడానికి నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. ప్రస్తుతం నవీ ముంబై పలు మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలకు నిలయంగా మారింది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ కారిడార్‌గా పేరు సంపాదించింది. ఈ క్రమంలో రెసిడెన్షియల్ కాలనీల కోసం మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయం అందించేందుకు కార్పొరేషన్ మరింత కృషి చేస్తోంది. 2012లోనే నిర్ణయం.. సాంకేతికారణాలతో జాప్యం నవీ ముంబైలో ఉచిత వైఫై సేవలను అందించడం ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. 2012-13లోనే కార్పొరేషన్.. నవీ ముంబై వాసులకు ఉచిత వైఫై సేవలను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ సేవల నిమిత్తం బడ్జెట్లో రూ.2 కోట్లను కేటాయించారు. నవీ ముంబైలో ఈ ఉచిత సేవలు ప్రారంభమైతే రాష్ర్ట మొట్ట మొదటి నగరంగా పేరు గడించనుంది. కానీ, కొన్ని సాంకేతిక పరమైన అడ్డంకులు ఎదురు కావడంతో అమలులో జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారి జి.వి.రావ్ తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన ప్రతిపాదన కేవలం రెసిడెన్షియల్ కాలనీల వరకే పరిమితం చేయాలనీ, ఈ సేవలను కార్యాలయాలు, వాణిజ్య సంస్థల స్థలాలకు విస్తరించ వద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సేవలను అందించే ప్రక్రియలతో కార్పొరేషన్ బిజీగా ఉందనీ, వచ్చే ఏడాది వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఏఏ స్థలాలలో వీటిని ఏర్పాటు చేయాలన్న అంశంపై కార్పోరేషన్ నిర్ణయించనున్నదన్నారు. వైఫై సేవలను అందించేందుకు తాము పబ్లిక్ స్థలాలైన ఉద్యాన వనాలు, బస్‌స్టాపులు, కాలేజీలు, వినోద కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని ఎన్‌ఎంఎంసీ అడిషినల్ సిటీ ఇంజినీర్ జి.వి.రావ్ తెలిపారు. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి టెండర్లను ప్రారంభించలేదన్నారు. ఈ ప్రక్రియ కోసం మరో మూడు నెలల సమయం పట్టనుందని అధికారి తెలిపారు.