సాక్షి, ముంబై : నగరంలో మొట్ట మొదటిసారిగా శివాజీ పార్క్‌లో ఉచిత వైఫై సేవలను పూర్తి చేసిన తర్వాత నవీ ముంబైలో కూడా ఉచితంగా ఈ సేవలను ప్రారంభించడానికి కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. రెసిడెన్షియల్ కాలనీలు, ఉద్యాన వనాలు, బస్టాపులు, కాలేజీలలో వైఫై సేవలను ఏర్పాటు చేయడానికి నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. ప్రస్తుతం నవీ ముంబై పలు మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలకు నిలయంగా మారింది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ కారిడార్‌గా పేరు సంపాదించింది. ఈ క్రమంలో రెసిడెన్షియల్ కాలనీల కోసం మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయం అందించేందుకు కార్పొరేషన్ మరింత కృషి చేస్తోంది.
2012లోనే నిర్ణయం.. సాంకేతికారణాలతో జాప్యం
నవీ ముంబైలో ఉచిత వైఫై సేవలను అందించడం ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. 2012-13లోనే కార్పొరేషన్.. నవీ ముంబై వాసులకు ఉచిత వైఫై సేవలను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ సేవల నిమిత్తం బడ్జెట్‌లో రూ.2 కోట్లను కేటాయించారు. నవీ ముంబైలో ఈ ఉచిత సేవలు ప్రారంభమైతే రాష్ర్ట మొట్ట మొదటి నగరంగా పేరు గడించనుంది.
కానీ, కొన్ని సాంకేతిక పరమైన అడ్డంకులు ఎదురు కావడంతో అమలులో జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారి జి.వి.రావ్ తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన ప్రతిపాదన కేవలం రెసిడెన్షియల్ కాలనీల వరకే పరిమితం చేయాలనీ, ఈ సేవలను కార్యాలయాలు, వాణిజ్య సంస్థల స్థలాలకు విస్తరించ వద్దని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సేవలను అందించే ప్రక్రియలతో కార్పొరేషన్ బిజీగా ఉందనీ, వచ్చే ఏడాది వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఏఏ స్థలాలలో వీటిని ఏర్పాటు చేయాలన్న అంశంపై కార్పోరేషన్ నిర్ణయించనున్నదన్నారు. వైఫై సేవలను అందించేందుకు తాము పబ్లిక్ స్థలాలైన ఉద్యాన వనాలు, బస్‌స్టాపులు, కాలేజీలు, వినోద కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని ఎన్‌ఎంఎంసీ అడిషినల్ సిటీ ఇంజినీర్ జి.వి.రావ్ తెలిపారు. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి టెండర్లను ప్రారంభించలేదన్నారు. ఈ ప్రక్రియ కోసం మరో మూడు నెలల సమయం పట్టనుందని అధికారి తెలిపారు.
నవీముంబైకి వైఫై సేవలు
Published Wed, Jul 23 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement