shivaji park
-
సుందరీకరణ ప్రాజెక్ట్ : ఎన్నికల్ని బహిష్కరిస్తాం.. ఓటర్ల హెచ్చరిక
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో పేరుకుపోయిన ఎర్రమట్టిని తొలగించే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. పర్యావరణానికి అలాగే తమకు ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు సృష్టిస్తున్న ఈ ఎర్రమట్టిని తొలగిస్తారా..? లేదా..? అని ప్రజలు స్ధానిక ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకుంటే నవంబరు 20న జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు ఓటు వేయాలని తమను బలవంతం చేసినా లేదా ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా..? నన్ ఆఫ్ ఎబౌ (నోటా) మీటను నొక్కుతామని స్పష్టం చేశారు.శివాజీపార్క్ మైదానం బీఎంసీకి చెందిన జీ–ఉత్తర వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ వార్డు అసిస్టెంట్ కమిషనర్ అజీత్‌కుమార్ ఆంబీని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహానికి గురైన మైదానం చుట్టుపక్కల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని, కుదరని పక్షంలో నోటాపై నొక్కాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులు ఆందోళనలో పడ్డారు. సైలెన్స్ జోన్లో ఉన్నా...షరతులతో అనుమతి.. నగరం నడిబొడ్డున దాదర్ ప్రాంతంలో 98 వేల చదరపు మీటర్ల స్ధలంలో చారిత్రాత్మక శివాజీపార్క్ మైదానం విస్తరించి ఉంది. బ్రిటీష్ హయాంలో స్వాతంత్య్ర పోరాటం సహా అనేక పోరాటాలకు ఈ మైదానం వేదికైంది. అంతేకాదు గతంలో సునీల్ గవాస్కర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనీల్ కాంబ్లే వంటి దిగ్గజాలు సహా అనేకమంది క్రికెటర్లు క్రికెట్ ఆటను ఈమైదానంలో సాధన చేసేవారు.ఇక లోక్‌సభ, అసెంబ్లీ, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు వచ్చాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రచార సభలతో ఈ మైదానం హోరెత్తుతుంటుంది. ఈ మైదానం సైలెన్స్ జోన్లో ఉన్నప్పటికీ కొన్ని షరతులతో అనుమతి ఇవ్వక తప్పకపోవడంతో వీటన్నిటి నేపథ్యంలో మైదానంలో పెద్దఎత్తునఎర్రమట్టి పేరుకుపోతోంది. ఫలితంగా చుట్టపక్కల నివాసముంటున్న వేలాది కుటుంబాలు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కుంటున్నాయి. తమ సమస్య పరిష్కరించాలని ఏళ్ల తరబడి బీఎంసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగలడంతో తమ సమస్యను పరిష్కరించాలని కాలుష్య నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేస్తూ పలుమార్లు లేఖలు కూడా రాశారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడంతో అనేక ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా స్ధానికులు ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన ప్రభుత్వం మైదానంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ప్రారంభించింది.కానీ జూన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.మైదానంలో ఉదయం, సాయంత్రం అనేక మంది వ్యాయామం చేస్తారు. కొందరు మార్నింగ్, ఈవ్నింగ్ వాక్కు వస్తుంటారు. మరికొందరు పిల్లపాపలతో సరదాగా గడిపేందుకు, మరికొందరు కాలక్షేపం కోసం వస్తుంటారు. దీంతో స్ధానికులతోపాటు ఇక్కడకు వచ్చినవారంతా శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ను అమల్లో ఉందంటూ బీఎంసీ అధికారులు పనుల కొనసాగింపును వ్యతిరేకిస్తున్నారు. కాగా మట్టిని తొలగించడానికి ఎన్నికల కోడ్‌కు సంబంధమేమిటని శివాజీపార్క్ రహివాసీ సంఘటన సభ్యులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
లతా మంగేష్కర్ స్మారక నిర్మాణంపై దుమారం
Lata Mangeshkar Brother On Shivaji Park Memorial Controversy: దివంగత దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పేరిట స్మారక చిహ్నం నిర్మించే విషయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన.. ముంబై శివాజీ పార్క్ వద్దే మెమోరియల్ నిర్మించాలంటూ బీజేపీ పట్టుబడుతుండగా.. అధికార శివసేన అందుకు సుముఖంగా లేదు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలంటూ ఆమె కుటుంబ సభ్యుల కోరికగా మొదలైన ప్రచారం.. ఈ రగడకు కారణమైంది. బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు. ఎక్కడైతే ఆమె అంత్యక్రియలు నిర్వహించారో.. అక్కడే స్మారకం నిర్మించాలంటూ డిమాండ్ చేశాడు. ఇది ఆమె కుటుంబ సభ్యుల కోరిక అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ వెంటనే మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్.. ఈ డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఆౕ వెంటనే మిత్రపక్షం(మహా వికాస్ అగాధి) శివసేన ఒత్తిడితో ఆ డిమాండ్‌పై స్వరం మార్చారు నానా. ఇక బీజేపీ డిమాండ్‌పై అధికార శివసేన సుముఖంగా లేదు. అందుకు కారణం.. ఆ పార్క్‌తో ఉన్న అనుబంధం. బాల్ థాక్రే హయాం నుంచే సుమారు 28 ఎకరాల ఈ పార్క్ నుంచి దసరా ర్యాలీని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ సెంటిమెంట్ నేపథ్యంలోనే లతాజీ మెమోరియల్ నిర్మాణం డిమాండ్‌పై మౌనం పాటిస్తోంది. ఇక ఈ డిమాండ్..అభ్యంతరాల నడుమ పలు పార్టీలు సైతం స్పందిస్తున్నాయి. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనా9MNS) నేత సందీప్ దేశ్‌పాండే ఈ వ్యవహారంలో రాజకీయాలు తగవని అంటున్నారు. దాదర్ ప్రజలు ఈ పార్క్ ఆక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు.. సంరక్షించుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు అంటూ సందీప్ ట్వీట్ చేశారు. ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దిన ఈ మైదానంపై రాజకీయం తగదని పలు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ పట్టువీడడం లేదు. ఇక శివసేన ప్రభుత్వం మాత్రం లతా మంగేష్కర్ గౌరవార్థం కాళినలో ఒక అంతర్జాతీయ సంగీత అకాడమీని నెలకొల్పేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం 2.5 ఎకరాల స్థలం, సుమారు 1,200 కోట్ల ఖర్చును అంచనా వేసింది. ఈ నిర్ణయం ఆమెకు సరైన నివాళి అంటున్నారు ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్. లతా మంగేష్కర్ మెమోరియల్ డిమాండ్‌పై ఆమె సోదరుడు, సంగీతకారుడు హృదయనాథ్ మంగేష్కర్ స్పందించారు. శివాజీ పార్క్ వద్ద మెమోరియల్ నిర్మించాలన్నది తమ కుటుంబ డిమాండ్ కాదని, దయచేసి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం దయచేసి ఆపండి. అలాంటి డిమాండ్ మా కుటుంబం నుంచి రాలేదు. అది మా అభిమతం కూడా కాదు అని ఆయన స్పష్టం చేశారు. -
లతా మంగేష్కర్ కడసారి వీడ్కోలు.. బారీగా వచ్చిన అభిమానులు
-
లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
-
ముంబై శివాజీ పార్కుకు లతా మంగేష్కర్ పార్థివదేహం తరలింపు
-
ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్‌కు స్పీకర్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే(59) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్ గ్రౌండ్లో గురువారం సాయంత్రం 6.40 గంటలకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’ తరఫున ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారు. కొత్త ప్రభుత్వంలో ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి, కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి లభించనున్నట్లు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ బుధవారం రాత్రి వెల్లడించారు. ఉద్ధవ్‌తో పాటు మూడు పార్టీలకు చెందిన ఒకరిద్దరు ముఖ్యులూ ప్రమాణం చేస్తారు. ఉద్ధవ్ ప్రభుత్వంలో ఒకే ఉప ముఖ్యమంత్రి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో బుధవారం కూటమి ముఖ్య నేతలు కీలక చర్చలు జరిపారు. మంత్రిమండలిలో ఒక్కో పార్టీకి లభించే ప్రాతినిధ్యంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులు చర్చల్లో పాలుపంచుకున్నారు. ఆ తరువాత వారితో కాంగ్రెస్ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఖర్గే కలిశారు. శివసేనకు సీఎం సహా 15, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం సహా 15, కాంగ్రెస్‌కు స్పీకర్ కాకుండా 13 మంత్రి పదవులు ఇవ్వాలనే సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు సేన వర్గాలు తెలిపాయి. అంతకుముందు, ఉదయం గవర్నర్ భగత్ కోశ్యారీని ఉద్ధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, 20 ఏళ్ల తరువాత శివసేన నేత సీఎం అవుతున్నారు. మహారాష్ట్రలో శివసేన తరఫున తొలి ముఖ్యమంత్రిగా 1995లో మనోహర్ జోషి బాధ్యతలు చేపట్టగా, 1999లో నారాయణ రాణె శివసేన తరఫున సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు మహారాష్ట్రలో తొలిసారి ఠాక్రే కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివాజీ పార్క్‌లో నేటి సాయంత్రం అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపైననే 100 మంది కూర్చునేలా భారీ వేదికను శివాజీ పార్క్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు.కాంగ్రెస్ చీఫ్ సోనియాను ఉద్ధవ్ కొడుకు ఆదిత్య ఆహ్వానించారు. సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఉద్ధవ్ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమానికి సోనియాగాంధీతో పాటు పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ సీఎంలు, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యే అవకాశముందని తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్, బీజేపీ అగ్రనేత అద్వానీలను శివసేన ఆహ్వానించిందని సమాచారం. ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులను శివసేన ఆహ్వానించింది. వారిలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ఉన్నారు. అజిత్‌కు డిప్యూటీ సీఎం? అజిత్ పవార్‌కి ఇచ్చే పదవిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్‌ను మరోసారి ఎన్నుకుంటారని, ఉప ముఖ్యమంత్రి పదవీ రావొచ్చని తెలుస్తోంది. భద్రతపై హైకోర్టు ఆందోళన ప్రమాణ కార్యక్రమాన్ని శివాజీ పార్క్‌లో జరపడాన్ని బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాణస్వీకారంపై తాము స్పందించడం లేదని, కేవలం శివాజీ పార్క్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ చాగ్లాల బెంచ్ బుధవారం వ్యాఖ్యానించింది. వీకామ్ ట్రస్ట్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ఎన్సీపీ వెంటే.. బీజేపీకి మద్దతునివ్వడం ద్వారా నాలుగు రోజుల పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగి ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వెనక్కి తగ్గిన అజిత్ పవార్ తాను ఎన్సీపీలోనే ఉన్నానని చెప్పారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణం చేశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుతానికి నేను కొత్తగా చెప్పడానికేమీ లేదు. సమయమొచ్చినపుడు చెప్తాను. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఎన్సీపీలోనే కొనసాగుతాను. ఇందులో ఎలాంటి అయోమయానికి తావు లేదు’ అని చెప్పారు. ఇకపై పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే తాను నిర్ణయం మార్చుకొని, ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని అజిత్ పవార్ చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో అజిత్ పవార్ ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఆయనకు సముచిత స్థానమే లభిస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో అధికారం చేపట్టనున్న శివసేన భవిష్యత్తులో కేంద్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని రౌత్ వ్యాఖ్యానించారు. గత నెల రోజులుగా శివసేన తరఫున వ్యూహకర్తగా, మీడియా ప్రతినిధిగా వ్యవహరించిన రౌత్.. ఇకపై తాను పార్టీ పత్రిక ‘సామ్నా’ పనుల్లో నిమగ్నమవుతానన్నారు. అజిత్‌కు సుప్రియా ఆత్మీయ ఆహ్వానం మహారాష్ట్ర నూతన ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. 285 ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కొలంబ్కర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు వచ్చిన అజిత్ పవార్‌కు అనూహ్యమైన రీతిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. ఆయన సోదరి, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే, అజిత్ పవార్‌కు ఎదురై నవ్వుతూ పలకరించి, ఆత్మీయంగా హత్తుకున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలే విధాన సభ ముఖద్వారం దగ్గరే నిల్చొని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ స్వాగతం పలికారు. రాజకీయ ఉద్యమాలకు ఊతమిచ్చిన నేల మరాఠాయోధుడు ఛత్రపతి గుర్తుగా శివాజీ పార్కు రాజకీయ ఉద్దండులెందరినో పరిచయం చేసిన వేదికది. దేశం గర్వించదగ్గ క్రీడాకారుల ఆశలకూ, ఆకాంక్షలకూ ఊతమిచ్చిన క్రీడాప్రాంగణమది. యోధుడు ఛత్రపతి శివాజీ చరిత్రను అనునిత్యం గుర్తుచేసే మరాఠాల పోరాటాలకు పురిటిగడ్డ కూడా అదే ప్రాంతం. అన్నింటికన్నా ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాల్ ఠాక్రే అంతిమ సంస్కారాలకు వేదికగా నిలిచింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతోన్న ఉద్ధవ్ ఠాక్రే నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిటీలోనే అతిపెద్ద పార్కు ముంబైలోని దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్కు సిటీలోనే అతిపెద్ద పార్కు. ఎన్నో రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చిన పార్కు వైశాల్యం దాదాపు 28 ఎకరాలు. ఈ పార్కు క్రికెట్ క్రీడాకారులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. 1927 వరకు బ్రిటిష్ ఇండియాలో 1925లో ప్రారంభించిన ఈ పార్కు అనంతర కాలంలో ముంబైలోని ఎన్నో స్వాతంత్య్రోద్యమాలకు కేంద్రబిందువైంది. 1947 స్వాతంత్య్ర కాలం నుంచి సంయుక్త మహారాష్ట్ర చాల్వాల్ (మహారాష్ట్ర ఏకీకరణ) ఉద్యమానికి ఇదే పార్కు వేదికయ్యింది. ప్రముఖ పాత్రికేయులు, నాటకరచయిత, కవి, సామాజిక నేత ఆచార్య ప్రహ్లద్ కేశవ్ అత్రే నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం 1960 మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటుకి దారితీసింది. ఆ తరువాత శివసేన నడిపిన ఎన్నో రాజకీయ ఉద్యమాలు ఈ వేదికగా ప్రారంభించారు. మహిమా పార్కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బ్రిటిష్ కాలంలో ఈ పార్కుని ఏర్పాటు చేశారు. 1927 వరకు ఈ పార్కుని మహిమా పార్కుగా పిలిచేవారు. మున్సిపల్ కౌన్సిలర్ అవంతీ గోఖలే ఆదేశాల మేరకు ఛత్రపతి శివాజీ పేరుని పెట్టారు. పార్కులోపలి వైశాల్యం 1.17 కిలోమీటర్లు. మొత్తం మైదానం 112,937 చదరపు మీటర్లు. ఈ ప్రాంగణంలో టెన్నిస్ కోర్టు, వ్యాయామశాల, పిల్లల, వృద్ధుల పార్కులు, లైబ్రరీలు ఉన్నాయి. సైలెన్స్ జోన్‌గా ప్రకటించిన కోర్టు నిత్యం రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉన్న ఈ పార్కు వల్ల ధ్వని కాలుష్యం ఎక్కువైందంటూ స్థానికులు 2009లో కోర్టుకి వెళ్ళారు. దీంతో మే, 2010లో బాంబే హైకోర్టు ఈ ప్రాంగణాన్ని సైలెంట్ జోన్‌గా ప్రకటించింది. అసెంబ్లీ వద్ద సోదరుడు అజిత్‌ను ఆత్మీయంగా పలకరిస్తున్న సుప్రియా సూలే. -
ఫడ్నవీస్‌కు చేదు అనుభవం
ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు నివాళులర్పించడానికి స్థానిక శివాజీ పార్క్‌కు వెళ్లిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. శివాజీ పార్క్ వెలుపల శివసేన కార్యకర్తలు ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాల్ ఠాక్రే 7వ వర్ధంతి సందర్భంగా ఆదివారం శివాజీ పార్క్‌కు సహచర బీజేపీ నేతలతో కలిసి ఫడ్నవీస్ వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ శివసేన సీనియర్ నేతలెవరూ లేరు. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత కార్యదర్శి మిలింద్ నర్వేకర్ మాత్రం ఉన్నారు. అంతకుముందు, బాల్ ఠాక్రే ప్రసంగాల వీడియోలను ట్వీటర్లో ఫడ్నవీస్ షేర్ చేశారు. కాగా, బాల్ ఠాక్రేకు బీజేపీ, శివసేన నేతలు వేర్వేరుగా నివాళులర్పించారు. ఉదయం పదిగంటల సమయంలో బాల్ ఠాక్రే కుమారుడు, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబ సభ్యులతో కలిసి శివాజీ పార్క్‌లో నివాళులర్పించగా, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాల్ ఠాక్రేకు నివాళులర్పించేందుకు ఫడ్నవీస్ శివాజీ పార్క్‌కు వెళ్లారు. శివాజీ అందరివాడు ఛత్రపతి శివాజీ ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క కులానికో చెందినవాడు కాదని శివసేన వ్యాఖ్యానించింది. శివాజీ 11 కోట్ల మరాఠీలకు చెందినవాడని స్పష్టం చేసింది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్, పార్టీ పత్రిక ‘సామ్నా’లో ‘రోక్‌తోక్’ అనే తన కాలమ్‌లో పై వ్యాఖ్యలు చేశారు. ‘ నేడు పవార్, సోనియా భేటీ పుణె: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నారు. వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమై, ప్రభుత్వ ఏర్పాటు ప్రాతిపదికలపై చర్చిస్తారన్నారు. -
రాహుల్ గాంధీకి చుక్కెదురు
ముంబై: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మార్చి 1వ తేదీన దాదార్‌లోని శివాజీ పార్క్‌లో తలపెట్టిన ఎన్నికల ర్యాలీకి చుక్కెదురైంది. శివాజీ పార్కులో ర్యాలీ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం నుంచి అనుమతి లభించలేదు. దీంతో అదే తేదీన బీకేసీలోని ఎంఎంఆర్డీఏ మైదానంలో రాహుల్ ర్యాలీ నిర్వహించబోతున్నామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ ప్రకటించారు. చారిత్రక శివాజీ పార్కులో రాహుల్ గాంధీ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణసేన, బీజేపీలు శివాజీ పార్కులో భారీ ర్యాలీలు నిర్వహించాయని, అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చి తమ పార్టీకి మాత్రం అవకాశం ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వివక్షలో భాగమేనని చవాన్ ఆరోపించారు. మార్చి నెలలో రాహుల్ మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు. మార్చి 1న ముంబై, ధూలే ప్రాంతాల్లో రాహుల్ ర్యాలీలు నిర్వహిస్తారు. రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని రాహుల్ మహారాష్ట్ర నుంచి ప్రారంభిస్తారని భావిస్తున్నారు. -
మైదానాలను 45 రోజులు వాడుకోవచ్చు..
సాక్షి, ముంబై: శివాజీపార్క్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర మైదానాల్లో ఇక నుంచి 45 రోజులపాటు రాజకీయ సభలు, సమావేశాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఇదివరకు ఈ మైదానాలలో సంవత్సరంలో 30 రోజులపాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఉండేది. చట్టంలో సవరణలుచేసి అదనంగా 15 రోజులు మైదానాలు వాడుకునేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది. దీంతో ప్రభుత్వ, రాజకీయ, ధార్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలాంటి నగరంలో సభలు, సమ్మేళనాలు నిర్వహించేందుకు మైదానాలు దొరకడమే కష్టతరంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మైదానాల కొరతవల్ల ముఖ్యంగా రాజకీయ పార్టీలకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా ప్రభుత్వ నిర్ణయంతో శివాజీపార్క్‌లో గతంలో లాగే 30 రోజులు ధార్మిక, సామాజిక కార్యాక్రమాలు, అదనంగా మంజూరైన 15 రోజుల్లో రాజకీయ సభలు నిర్వహించేందుకు అనుమతి లభించనుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై క్రీడాకారులు కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు క్రీడల శిక్షణకు తగినంత సమయం దొరకదని వారు పేర్కొంటున్నారు. -
అంబేద్కర్‌కు ఘన నివాళి
జనసంద్రంగా మారిన చైత్యభూమి సదుపాయాలు కల్పించిన బీఎంసీ అన్నదానం చేసిన స్వచ్ఛంద సంస్థలు సాక్షి, ముంబై: శివాజీపార్క్‌లోని చైత్యభూమి పరిసరాలు జనసంద్రంగా మారాయి. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని శనివారం దాదర్ ప్రాంతమంతా ఆయన అభిమానులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది జనం శుక్రవారం అర్ధరాత్రి నుంచి చైత్యభూమి వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం ప్రారంభించారు. శనివారం ఉదయం గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మేయర్ స్నేహల్ అంబేకర్, బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ నాయకుడు ప్రకాష్ ఆంబేకర్, ఆర్పీఐ నాయకుడు రాందాస్ ఆఠవలే, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన కొందరు కొత్త మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ చైత్యభూమికి పక్కనే ఉన్న ఇందు మిల్లు స్థలంలో 2015 ఏప్రిల్ 14న అంబేద్కర్ స్మారకానికి భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడతాయని చెప్పారు. మహాపరినిర్వాణ్ సందర్భంగా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అన్ని సౌకర్యాలు కల్పించింది. శివాజీపార్క్ మైదానంలో లక్ష చదరపు టడుగుల విస్తీర్ణంలో నేలపై కార్పెట్లు పరిచారు. మూడు రోజుల ముందు నుంచి ఇక్కడ అభిమానుల సందడి మొదలైంది. వారికి బస మొదలుకుని స్నానాల గదులు, తాగునీరు, సంచార మరుగు దొడ్లు, కుళాయిలు ఇతర సదుపాయాలు కల్పించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లు సిద్ధంగా ఉంచింది. తప్పిపోయిన వారి వివరాలు అందించేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బలగాలను మోహరించారు. వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అవసరమైతే అస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. చైత్యభూమికి సమీపంలో ఉన్న ఇందూ మిల్లు ఖాళీ స్థలంలో కూడా సౌకర్యాలు కల్పించారు. లక్షలాదిగా తరలివచ్చిన అంబేద్కర్ అభిమానులు ఇబ్బందులు పడకుండా శివాజీపార్క్ పరిసరాల్లో వాహనాల రాకపోకల్లో మార్పులు చేశారు. చైత్యభూమి ఇరువైపుల క్యూలో నిలబడేందుకు తాత్కాలిక బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ఇటు సెంచూరి బజార్, అటు మాహిం దిశగా ఫుట్‌పాత్‌లపై రెండు కి.మీ. మేర క్యూ లైను ఏర్పాటుచేశారు. శివాజీపార్క్ మైదానంలో అంబేద్కర్ ఆనుయాయులకు అనేక సేవా సంస్థలు అల్పాహారాలు, తాగు నీరు, భోజనం తదితరా తినుబండరాలు పంపిణీ చేశాయి. టీవీవీ ఆధ్వర్యంలో అన్నదానం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని చైత్యభూమి వద్ద తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ), తెలుగు బహుజన మహాసభ (టీబీఎం) ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాన్ని టీబీఎం అధ్యక్షుడు నాగ్‌సేన్ మాల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీవీవీ కన్వీనర్ కె. నర్సింహ గౌడ్, భీవరత్న మాల, రాంతంగారే మాదిగ, తలారి నవీన్, చాందన్ అహ్మద్, సంపత్ కుమార్ మాదిగ, మూల్నివాసి మాల తదితరులు పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాలకు నగర పోలీసు శాఖ సన్నద్ధమైంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులు, స్థానిక ప్రజలు, మండలి కార్యకర్తలు, స్వయం సేవా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా కోరారు. ఉత్సవాలను పురస్కరించుకుని పోలీసులకు వారాంతపు సెలవులు, దీర్ఘకాలిక సెలవులు రద్దుచేశారు. దీంతో నగర పోలీసు శాఖ ఆధీనంలో ఉన్న మొత్తం 45 వేల మంది పోలీసు సిబ్బంది విధులకు అందుబాటులో ఉన్నట్లే.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ఐదు రకాల పోలీసు బలగాలను మోహరించినట్లు మారియా చెప్పారు. ఇందులో నేర నిరోధక శాఖ, ఉగ్రవాద నిరోధక శాఖ, రద్దీ నియంత్రణ, అత్యవసర దళం, ధార్మక స్థలాల భద్రత దళాలు ఉన్నాయని ఆయన అన్నారు. రద్దీ సమయంలో అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చే సే ఆకతాయిల ఆటకట్టించేందుకు సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా వేయనున్నారు. ఇప్పటికే ముంబై వివిధ ఉగ్రవాద సంస్థల హిట్ లిస్టులో ఉంది. ముష్కరులు ఎప్పుడు, ఏ రూపంలో వచ్చి దాడులు చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వివిధ రహదారులన్నింటిపై పోలీసులు నిఘావేశారు. సముద్రతీరాల వెంబడి గస్తీ నిర్వహించే కోస్టు గార్డులను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో వాహనాల తనఖీలు, నాకా బందీలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో సెప్టెంబర్ రెండు, నాలుగు, ఏడు, ఎనిమిది తేదీల్లో ఉదయం ఆరు గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి పోలీసు శాఖ అనుమతినిచ్చింది. నిమజ్జనం సమయంలో చిన్న పిల్లలు తప్పిపోతే వారి ఆచూకీ కోసం ఫిర్యాదు చేసేందుకు జూహూ, గిర్గావ్ (చర్నిరోడ్ చౌపాటి), బాంద్రా, పవాయి, శివాజీపార్క్ తదితర నిమజ్జన ఘాట్లవద్ద ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తమ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వాహనాల పార్కింగ్‌కు అనుమతినివ్వకూడదని వ్యాపారవర్గాలకు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ జి.కె.ఉపాధ్యాయ్ సూచించారు. బీఎంసీ ఏర్పాట్లు... విగ్రహాలు నిమజ్జన ం చేసే సముద్రతీరాల (ఘాట్ల) వద్ద మహానగర పాలక సంస్థ (బీఎంసీ) తగిన ఏర్పాట్లు పూర్తిచేసింది. సుమారు 10 వేల మంది బీఎంసీ సిబ్బందిని నియమించింది. వాచ్ టవర్లు, ఫ్లడ్ లైట్లు, 400 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాసన్ చెప్పారు. ప్రతి నిమజ్జన ఘాట్‌వద్ద 8-10 సీసీటీవీ కెమెరాల చొప్పున మొత్తం నిమజ్జన ఘాట్లవద్ద 258 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సముద్ర తీరాలకు వచ్చిన భక్తులకు సంచార టాయిలెట్లు, తాత్కాలిక తాగునీరు కుళాయిలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బీఎంసీ పరిపాలనా విభాగం రూ.13-15 కోట్లు ఖర్చుచేస్తోంది. -
నవీముంబైకి వైఫై సేవలు
సాక్షి, ముంబై : నగరంలో మొట్ట మొదటిసారిగా శివాజీ పార్క్‌లో ఉచిత వైఫై సేవలను పూర్తి చేసిన తర్వాత నవీ ముంబైలో కూడా ఉచితంగా ఈ సేవలను ప్రారంభించడానికి కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. రెసిడెన్షియల్ కాలనీలు, ఉద్యాన వనాలు, బస్టాపులు, కాలేజీలలో వైఫై సేవలను ఏర్పాటు చేయడానికి నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. ప్రస్తుతం నవీ ముంబై పలు మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలకు నిలయంగా మారింది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ కారిడార్‌గా పేరు సంపాదించింది. ఈ క్రమంలో రెసిడెన్షియల్ కాలనీల కోసం మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయం అందించేందుకు కార్పొరేషన్ మరింత కృషి చేస్తోంది. 2012లోనే నిర్ణయం.. సాంకేతికారణాలతో జాప్యం నవీ ముంబైలో ఉచిత వైఫై సేవలను అందించడం ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. 2012-13లోనే కార్పొరేషన్.. నవీ ముంబై వాసులకు ఉచిత వైఫై సేవలను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ సేవల నిమిత్తం బడ్జెట్లో రూ.2 కోట్లను కేటాయించారు. నవీ ముంబైలో ఈ ఉచిత సేవలు ప్రారంభమైతే రాష్ర్ట మొట్ట మొదటి నగరంగా పేరు గడించనుంది. కానీ, కొన్ని సాంకేతిక పరమైన అడ్డంకులు ఎదురు కావడంతో అమలులో జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారి జి.వి.రావ్ తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన ప్రతిపాదన కేవలం రెసిడెన్షియల్ కాలనీల వరకే పరిమితం చేయాలనీ, ఈ సేవలను కార్యాలయాలు, వాణిజ్య సంస్థల స్థలాలకు విస్తరించ వద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సేవలను అందించే ప్రక్రియలతో కార్పొరేషన్ బిజీగా ఉందనీ, వచ్చే ఏడాది వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఏఏ స్థలాలలో వీటిని ఏర్పాటు చేయాలన్న అంశంపై కార్పోరేషన్ నిర్ణయించనున్నదన్నారు. వైఫై సేవలను అందించేందుకు తాము పబ్లిక్ స్థలాలైన ఉద్యాన వనాలు, బస్‌స్టాపులు, కాలేజీలు, వినోద కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని ఎన్‌ఎంఎంసీ అడిషినల్ సిటీ ఇంజినీర్ జి.వి.రావ్ తెలిపారు. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి టెండర్లను ప్రారంభించలేదన్నారు. ఈ ప్రక్రియ కోసం మరో మూడు నెలల సమయం పట్టనుందని అధికారి తెలిపారు. -
తీరప్రాంతాల్లో ‘అల’జడి!
సాక్షి, ముంబై: కడలి ఉగ్రరూపం దాల్చడంతో ముంబైలోని తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. గత రెండ్రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడం, రోజురోజుకు అలల తాకిడి మరింతగా పెరుగుతుండడంతో సముద్ర తీరప్రాంతాలైన గేట్ వే ఆఫ్ ఇండియా, మెరైన్ డ్రైవ్, వర్లీ, శివాజీ పార్కు, మాహిం తదితర ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకొస్తోంది. నీటితోపాటు కొట్టుకొస్తున్న చెత్తాచెదారంతో ఈ ప్రాంతాలన్ని డంప్‌యార్డును తలపిస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండుమూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉండడంతో ఇక్కడి మురికివాడలను ఖాళీ చేయాల్సిందిగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరే షన్(బీఎసీ) ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం కూడా నాలుగున్నర మీటర్ల నుంచి ఐదు మీటర్ల ఎత్తు అలలు ఎగిసిపడడంతో సముద్రపు నీరంతా రోడ్లపైకి వచ్చింది. దీంతో మెరైన్ డ్రైవ్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చౌపాటీ వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన పానీపూరి, బేల్‌పూరి, శేవ్పూరి తదితర తినుబండరాలు విక్రయించే స్టాళ్లన్ని అలలకు చెల్లాచెదురయ్యాయి. ఒకపక్క ఎగిసిపడుతున్న భారీ అలలు, మరోపక్క వేగంగా వీస్తున్న గాలులవల్ల నీరంతా దుకాణాల్లోకి వచ్చేస్తోంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు కూత వేటు దూరంలో ఉన్న తాజ్‌మహల్ హోటల్ ప్రవేశ ద్వారం వరకు సముద్ర పు నీరు చేరడంతో ఆ ప్రాంతమంత చెత్తకుప్పగా మారింది. భారీగా వస్తున్న అలల కారణంగా గేట్ వే ఆఫ్ ఇండియాను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులను అనుమతించడం లేదు. శివాజీపార్క్ పరిసరాల్లో ఉన్న స్కౌట్ అండ్ గైడ్ ప్రధాన కార్యాలయం వరకు నీరు వచ్చి చేరింది. కీర్తి కాలేజీ రహదారిపైకి, కాలనీల్లోకి కూడా నీరు రావడంతో పార్కింగ్ చేసిన వాహనాలన్నీ పాడైపోయాయి. మాహిం ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ముందుజాగ్రత్త చర్యగా హై టైడ్ సమయంలో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణశాఖ డిప్యూటీ డెరైక్టర్ కృష్ణానంద హోసాలికర్ చెప్పారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద 15 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. దాదర్, జుహూ, వర్సోవా, అక్సా బీచ్, గోరాయి తదితర తీర ప్రాంతాలవద్ద అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, జాతీయ విపత్తుల నిర్వహణ సిబ్బంది, బీఎంసీ భద్రతాశాఖ సిబ్బంది. ఇలా వందలాది మందిని నియమించారు. వీరంతా కోస్టుగార్డు సిబ్బందితో తరుచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ‘అల’జడి కొనసాగే సమయం తేది సమయం అలల ఎత్తు (మీ.లో) 14 జూన్ మ.12.32 4.60 15 జూన్ మ.2.03 4.85 16 జూన్ మ.2.50 4.85 17 జూన్ మ.3.56 4.74 18 జూన్ సా. 4.23 4.55 -
గణతంత్రం..భద్రత కట్టుదిట్టం!
సాక్షి, ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో పటిష్ట భద్రతను చేపట్టారు. సాధారణంగా గణతంత్ర వేడుకలను ప్రతి ఏడాది శివాజీ పార్క్‌లో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు మెరిన్‌డ్రైవ్‌లో మొదటిసారిగా గణతంత్ర వేడుకలను జరుపనున్నారు. దీంతో ఇప్పటినుంచే ఆ ప్రాంతంలో నిరంతర నిఘా ఏర్పాటుచేశారు. వేడుకలను సముద్ర తీరం వెంబడి నిర్వహించనుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. కాగా గణతంత్ర దినోత్సవం నాడు వీఐపీలు, ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఇక్కడికి రానున్నందున పరేడ్ నిమిత్తం గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మెరిన్ డ్రైవ్ వద్ద రోజూ ఉదయం, రాత్రివేళ్లలో పెట్రోలింగ్ నిర్వహించాలని తమ సిబ్బందికి నిర్దిష్ట ఆదేశాలు జారీ చేశామన్నారు. మామూలు రోజుల్లో, చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ గణతంత్ర దినోత్సవాలు జరిగేవరకు ‘నోఫ్లయింగ్ జోన్’గా ప్రకటించాలని స్టేట్ ప్రొటోకాల్ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, మెరిన్‌డ్రైవ్ వద్ద ఇరు దిశల్లో ట్రాఫిక్‌కు అనుమతి ఉండదన్నారు. ‘క్విక్ రెస్పాన్స్ టీమ్’, ‘ఫోర్స్‌వన్’ నుంచి సిబ్బందిని మోహరించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 26/11 దాడులను దృష్టిలో పెట్టుకొని తమ సిబ్బంది మఫ్టీలో అత్యాధునిక పరికరాలతో సంచరిస్తారని ఆయన తెలిపారు. -
బాల్‌ఠాక్రే వర్ధంతి కోసం భారీ ఏర్పాట్లు
సాక్షి, ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే ప్రథమ వర్థంతిని ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న శివాజీపార్క్ మైదానంలో జరగనున్న కార్యక్రమానికి లక్షలాది మంది కార్యకర్తలు తరలిరానున్నారు. ఇప్పటికే రాష్ర్టంలోని ప్రతి పార్టీ కార్యకర్త, అభిమానులు తరలివచ్చి నివాళులు ఆర్పించాలని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ రోజు జరిగే బాల్‌ఠాక్రే వర్ధంతి కార్యక్రమానికి శివసేన మిత్రపక్షాలైన బీజేపీ, ఆర్పీఐ నాయకులను కూడా హాజరుకావాలని ఆహ్వనించింది. దీంతో ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భారీ సంఖ్యలో శివసైనికులను శివాజీపార్క్ మైదానానికి తరలించే బాధ్యతలు ముంబైలోని అన్ని విభాగ ప్రముఖులకు అప్పగించారని పార్టీ వర్గాలు తెలిపాయి. శివాజీపార్క్ మైదానంలో బాల్‌ఠాక్రే పేరుతో నిర్మించిన (ఉద్యానవనం రూపంలో ఉన్న) స్మారకాన్ని శివసైనికులు ‘శక్తి స్థల్’ గా గుర్తించాలనే ఉద్ధేశ్యంతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదిలాఉండగా బాల్ ఠాక్రే వర్ధంతి పురస్కరించుకుని శివసేన సీని యర్ నాయకుడు, ఎమ్మెల్యే సుభాష్ దేశాయి గోరేగావ్‌లో మూడు రోజుల పాటు ‘ఠాక్రే ఉత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నుం చి మూడు రోజులపాటు వేర్వేరు కార్యక్రమాలు జరగనున్నాయి. బాల్‌ఠాక్రే ప్రథమ వర్థంతి సందర్భంగా శివసేన విడుదల చేసిన పోస్టర్లపై ‘చలా శివ్ తీర్థావర్’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు జనాలను భారీ సంఖ్యలో తరలించడంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. బాల్‌ఠాక్రే చనిపోయిన తర్వాత ఉద్ధవ్ రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆయన లేని లోటు కారణంగా కార్యకర్తలు, పదాధికారులు పార్టీని వదిలి వెళ్లిపోకుండా ఉద్ధవ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేగాక ముంబైతోపాటు రాష్ట్రంలో శివసేనకు చెందిన కీలక లోక్‌సభ నియోజకవర్గాలలో సమావేశాలు జరిపి మరింత పటిష్టం చేశారు. ఆదివారం జరగనున్న ప్రథమ వర్ధంతికి పెద్ద ఎత్తున జనం, శివసైనికులు తరలి వచ్చేందుకు ఇంటర్నెట్, ఫేస్బుక్, ట్విట్టర్లలో భారీగా పోస్ట్‌లు చేశారు. దీన్నిబట్టి ఆ రోజు భారీగానే బలప్రదర్శన జరిగే అవకాశాలున్నాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
శివసేనకు కోర్టు నోటీసులు
సాక్షి, ముంబై: దసరా రోజున శివాజీపార్క్ మైదానంలో శివసేన నిర్వహించిన ర్యాలీలో నియమాల ఉల్లంఘన జరిగిందంటూ స్థానిక పోలీసులు నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ జారీచేశారు. నాయకుల ప్రసంగంలో కోర్టు నిర్దేశించిన డెసిబుల్ కంటే లౌడ్స్పీకర్లలో ఎక్కువ సౌండ్ వినియోగించారని, దీంతో నియమాల ఉల్లంఘన జరిగిందని శివాజీపార్క్ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. శివాజీపార్క్ మైదానం పరిసరాలు సెలైంట్ జోన్ పరిధిలోకి రావడంతో కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఎలాంటి సభలు, రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతివ్వడం లేదు. కాగా నాలుగు దశాబ్దాలకుపైగా దసరా రోజున శివసేన ఇక్కడే ర్యాలీ నిర్వహిస్తూ వస్తోం దని, ఈ సారి కూడా అనుమతివ్వాలని బీఎంసీకి నిర్వాహకులు దరఖాస్తు పెట్టుకున్నారు. కాగా ఈ ఏడాది పార్టీ నిర్వహిస్తున్న సభ శివసేన అధినేత బాల్ ఠాక్రే లేకుండా జరగడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సదరు దరఖాస్తును బీఎంసీ తిరస్కరించడంతో పార్టీ నాయకులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో బాల్ ఠాక్రే లేకుండా మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి అనుమతి లభిస్తుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విచారణ జరిపిన న్యాయమూర్తులు కొన్ని షరతులపై అనుమతి ఇచ్చారు. ధ్వని కాలుష్యాన్ని (డెసిబుల్ సౌండ్) నియంత్రణలో ఉంచాలంటూ షరతు విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వనిపై విధించిన నియమాలను ఉల్లంఘించబోమని కోర్టు రాతపూర్వకంగా నిర్వాహకుల నుంచి కోర్టు హామీ తీసుకుంది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. మైక్ టెస్టింగ్ సమయంలో 55 డెసిబుల్ ఉన్న సౌండ్ సభ ప్రారంభం కాగానే వేదికపై కొందరు నాయకులు ప్రసంగించినప్పుడు 59 డెసిబుల్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ 103.4 డెసిబుల్‌కు చేరుకుంది. కాగా దసరా ర్యాలీకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, బాణసంచా పేల్చడం వల్ల ధ్వని కాలుష్యం పెరిగిందని శివసేన నాయకుడొకరు తెలిపారు. దీనిపై ‘ఆవాజ్ ఫౌండేషన్’ తాను రూపొందించిన నివే దికను సీఎంకు పంపించింది. కాగా ఈ షోకాజ్ నోటీసుపై వెంటనే వివరణ ఇవ్వాలని కోర్టు నిర్వాహకులను ఆదేశించింది. -
అజ్ఞాతంలోకి!
సాక్షి, ముంబై: కొద్ది రోజులుగా శివసేన పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు మనోహర్ జోషి గత 24 గంటల నుంచి ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన సెల్‌కు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వస్తోంది తప్పితే వేరే సమాధానం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు..? ఎవరితో కలిసి ఎక్కడికి వెళ్లారనేది అంతుచిక్కడం లేదు. శివాజీపార్క్ మైదానంలో ఆదివారం రాత్రి శివసేన నిర్వహించిన దసరా ర్యాలీకి వివిధ ప్రముఖులతోపాటు జోషి కూడా హాజరయ్యారు. అప్పటికే ఆయన వైఖరిపై ఆగ్రహంతో ఉన్న పార్టీ కార్యకర్తలు జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనోహర్ జోషి హాయ్ హాయ్ అంటూ కేకలు వేశారు. వేదిక దిగి వెళ్లిపోవాలని గందరగోళం సృష్టించారు. దీంతో చేసేది లేక జోషి మౌనంగా వేదిక దిగి కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి నాట్ రీచబుల్ (అజ్ఞాతం)లో ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో నగరం విడిచి వెళ్లిపోయారు. స్వగ్రామమైన రాయ్‌గడ్ జిల్లా నాంద్వి వెళ్లినట్లు కొందరు చెబుతుండగా, ప్రస్తుతం ఆయన లోణావాలాలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు మరికొందరు చెబుతున్నారు. అయితే, ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. ఇదిలాఉండగా మనోహర్ జోషి మహారాష్ట్ర న వనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో తరుచూ సంప్రదించడంవల్ల ఆ పార్టీలో చేరుతుండవచ్చని వచ్చిన వ దంతులను ఆ పార్టీ నాయకులు కొట్టిపారేశారు. ఈ పుకార్లన్నీ మీడియా ద్వారా వచ్చినవేనని ఎమ్మెన్నెస్‌కు చెందిన ఓ సీనియర్ నాయకుడు అన్నారు. జోషి, రాజ్ ఠాక్రేల మధ్య కుటుంబ సంబంధాలున్నాయి. వీటికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆ నాయకుడు స్పష్టం చేశారు. ఎమ్మెన్నెస్ యువతకు సంబంధించిన పార్టీ. ఇందులో మనోహర్ జోషిలాంటి సీనియర్ నాయకున్ని ఎలా చేర్చుకోవాలనే ప్రశ్న తలెత్తుతోందని ఆయన అన్నారు. కాని ఉద్ధవ్‌కు వ్యతిరేకంగా జోషి అలా వ్యాఖ్యలు చేయకపోయుంటే బాగుండేదని ఆ నాయకుడు అభిప్రాయపడ్డారు. కాని జోషిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే అలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు. మొదలైన ఫిరాయింపులు.. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకుల ఫిరాయింపులు మొదలయ్యాయి. అనేకమంది మాజీ మంత్రులు, పదాధికారులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో తీర్థం పుచ్చుకోవడం మొదలుపెట్టారు. శివసేన ఉప నాయకుడు సంజయ్ ఘాడి, అతడి భార్య సంజనా ఘాడి, మాజీ కార్పొరేటర్ రాజా చౌగులే, కార్మిక యూనియన్ నాయకుడు నితిన్ జాదవ్, ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ సొదరుడు, మాజీ కార్పొరేటర్ కప్తాన్ మాలిక్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుడ్తర్కర్ తదితరులు సోమవారం ఎమ్మెన్నెస్‌లో చేరారు. పార్టీ నాయకులు తమను చిన్నచూపు చూడటం, వారి పనితీరుపై విసిగెత్తి ఎమ్మెన్నెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ ఠాక్రేతో పేర్కొన్నారు. శివ సైనికుల ఆగ్రహం సహేతుకమే.. ముంబై : దసరా ర్యాలీలో జోషికి జరిగిన అవమానంపై పలు పార్టీలు స్పందించాయి. ఒకప్పుడు శివసేనలో మనోహర్జోషికు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ప్రస్తుత ఎన్సీపీ నాయకుడు చగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ .. ‘జోషీ తీరుపై సైనికుల ఆగ్రహం సహేతుకమే.. ఆ పార్టీ అండే లేకుంటే జోషీ ముఖ్యమంత్రి పదవి అధిరోహించేవాడేకాదు.. అటువంటి పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిజమైన కార్యకర్తలు విని ఊరుకోరు కదా..’ అన్నారు. కాగా, జోషీ విషయం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానిక్రావ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. ‘జోసీ ఒక సీనియర్ నాయకుడు. ఏ పార్టీలోనూ ఇటువంటి సంఘటనలు వాంఛితం కాదు. అయితే అతడిపై కార్యకర్తల తీరు ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా మాత్రమే మేం చూస్తున్నాం..’ అని స్పందించారు. కాంగ్రెస్ మంత్రి నారాయణ్ రానే మాట్లాడుతూ ‘ జోషి వంటి నాయకుడికి ఆ పార్టీ ర్యాలీలో తీరని అవమానం జరిగింది. అతడు సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పనితీరును విమర్శించబట్టే ఆ పరిస్థితి ఎదురైంది’ అని అన్నారు. ర్యాలీలో జోషికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా ఉద్ధవ్, అతడి భార్య రష్మి, కుమారుడు ఆదిత్య కూడా వారిని వారించేందుకు ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నం ఫలించలేదు. చివరకు జోషి వేదిక దిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. -
దసరా ర్యాలీపై శివసేనలో ఉత్కంఠ
సాక్షి, ముంబై: శివసేన ప్రతియేటా దాదర్‌లోని శివాజీపార్క్‌లో నిర్వహించే దసరా ర్యాలీ ఎక్కడ నిర్వహించనున్నారనే విషయం ఈసారి శివసేనకు తల నొప్పిగా మారింది. పార్టీ స్థాపించినప్పటి నుం చి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దాదర్‌లోని శివాజీపార్క్‌లో దసరా ర్యాలీ నిర్వహిస్తున్న విష యం విదితమే. అయితే శివాజీపార్క్ సెలైన్స్ జోన్ పరిధిలో ఉందని ఈసారి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతిని నిరాకరిం చింది. గతంలో కూడా ఇదే మాదిరిగా బీఎంసీ నిరాకరిస్తే హైకోర్టును ఆశ్రయించడంతో శివసేనకు అనుమతి లభించింది. అయితే ఈసారి శివాజీపార్క్‌లో దసరా ర్యాలీకి అనుమతి లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గతేడాదే హైకో ర్టు అనుమతించే సమయంలో వచ్చే ఏడాది ప్రత్యామ్నాయ వేదికను చూసుకోవాలని ఆదేశించిన విషయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నా రు. దీంతో దసరా ర్యాలీ కోసం శివాజీపార్క్ లభిం చకపోతే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని ఎమ్మెమ్మార్డీయే గ్రౌండ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ సమీపంలోని ఆజాద్ మైదాన్‌లో నిర్వహించాలని పార్టీ భావి స్తున్నట్టు సమాచారం. ఈసారి బీకేసీలో దసరా ర్యాలీ...? అయితే బీఎంసీ అనుమతి నిరాకరించడంతో ముం దు జాగ్రత్తగా బీకేసీలోని ఎమ్మెమ్మార్డీయే మైదానం లో సభ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ శివసేన పార్టీ దరఖాస్తు పెట్టుకుంది. దీంతో ఈసారి శివాజీపార్క్‌లో అనుమతి లభించకపోతే ఎమ్మెమ్మార్డీయే గ్రౌండ్లో జరిగే అవకాశాలు కనబడుతున్నా యి. అయినప్పటికీ శివాజీపార్క్ కోసం అన్ని విధా లా ప్రయత్నాలు చేస్తోంది. నాలుగు దశాబ్దాల చరిత్రలో మరో బ్రేక్..? శివసేన పార్టీ అవిర్భవించిన నాటినుంచి సుమారు నాలుగు దశాబ్దాలకుపైగా ఏటా దసరా రోజున శివాజీపార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహిస్తోంది. అయితే అనివార్య కారణాలవల్ల కేవలం రెండుసార్లు మాత్రమే సభ జరగలేదు. అయితే ఈసారి అనుమతి లభించలేదు. దీంతో ఈసారి కూడా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయి తే ర్యాలీ మరో ప్రాంతంలో జరగొచ్చు. మొదటిసారిగా బాల్‌ఠాక్రే లేకుండా..! దసరా రోజు జరిగే సభలో శివసేన అధినేత బాల్‌ఠాక్రే ప్రసంగం వినేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు లక్షల సంఖ్యలో తరలివస్తారు. అయితే ఈసారి తొలిసారిగా ఆయన లేకుండా సభ జరగనుంది. గతంలో అనారోగ్యం కారణంగా ఆయన ప్రసంగాన్ని సీడీల ద్వారా స్క్రీన్లపై విని పించారు. అయితే ఈసారి ఆయన మరణానంతరం తొలిసారిగా జరగనున్న శివసేన ప్రతిష్టాత్మకంగా భావించే దసరా ర్యాలీ సభకు అనుమతులు లభించకపోవడంతో కార్యకర్తల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈసారి కూడా ఆయన లేనిలోటు తీర్చేందుకు సభలో ఆయన గతంలో చేసిన ప్రసం గం సీడీలు ప్రదర్శించే అవకాశాలున్నాయి. అలాగే ఆ పార్టీ కార్యధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అగ్రనాయకుడు మనోహర్ జోషీ, ఆదిత్య ఠాక్రే తదితరుల ప్రసంగాలే కీలకం కానున్నాయి. -
శివాజీపార్క్‌లో దసరా ర్యాలీ వద్దు
సాక్షి, ముంబై: శివసేన ప్రతి ఏటా దాదర్‌లోని శివాజీపార్క్‌లో నిర్వహించే దసరా ర్యాలీకి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతిని నిరాకరించింది. ఆ ప్రాంతం సెలైంట్ జోన్ పరిధిలోకి వస్తుందని తేల్చిచెప్పింది. ఈ విషయం శివసేన పార్టీకి తలనొప్పిగా మారింది. బాల్‌ఠాక్రే లేకుండా తొలిసారిగా జరుగుతున్న ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కోర్టుకు వెళ్లనున్న శివసేన... దసరా ర్యాలీ అనుమతి కోసం శివసేన కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. గతంలో ఎదురైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా హైకోర్టుకు వెళ్లాలని శివసేన పార్టీ నాయకులు నిర్ణయించారు. గత ర్యాలీకి కూడా బీఎంసీ అనుమతి నిరాకరించింది. అయితే శివసేన నేత అనీల్ పరబ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సానుకూల నిర్ణయం వెలువడింది. అయితే అదే సమయంలో వచ్చే ఏడాది మాత్రం మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని ర్యాలీ కోసం చూసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో ఈసారి మళ్లీ కోర్టు అనుమతిస్తుందా..?, గతంలో చెప్పినట్టుగా ఏదైన వేరే స్థలం చూసుకోవాలని సూచిస్తుందా..? అని పార్టీ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. -
శివాజీపార్క్లోనే బాల్‌ఠాక్రే స్మారకం
సాక్షి, ముంబై: దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే స్మారకాన్ని శివాజీపార్క్లోనే నిర్మిస్తామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ సీతారాం కుంటే స్పష్టం చేశారు. ఆయన స్మృతి స్మారక నిర్మాణ పనులు అనుకున్న సమయానికి నవంబర్ 17వ తేదీ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు నగర మేయర్ సునీల్ ప్రభు, స్థాయీ సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలేతో కుంటే భేటీ అయ్యారు. బాల్‌ఠాక్రే ప్రథమ వర్థంతి జరిగే నవంబర్ 17వ తేదీ లోపే స్మారకం నిర్మించి సిద్ధంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ‘ఈ స్మారకం చుట్టూ ఉద్యానవనం ఉంటుంది. ఈ స్థలం సీఆర్‌జెడ్ (తీర ప్రాంత నియంత్రణ మండలి) పరిధిలోకి రావడంతో బాల్‌ఠాక్రే స్మారక నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సంబంధిత శాఖకు పంపించాం. ఉద్యానవనంలో నిర్మించే స్మారక నిర్మాణ పనులకు సంబంధించిన మ్యాపు హెరిటేజ్ కమిటీకి పంపించాం. దీంతో అన్ని పనులు నియమాలకు లోబడి అధికారికంగా కొనసాగుతుండడంతో ఈ స్మారకం నిర్మించేందుకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకావ’ని సీతారాం కుంటే స్పష్టం చేశారు. ఈ స్మారకం నిర్మాణానికి అవసరమయ్యే అన్ని అనుమతులు బీఎంసీ పరిపాలన విభాగం ప్రభుత్వం నుంచి తీసుకుందని సునీల్ ప్రభు వివరించారు. పనులన్నీ నియమాలకు లోబడే సాగుతున్నాయని, దీనిపై వివిధ రాజకీ య పార్టీలు అనవసరంగా రాజకీయం చేసి లబ్ధిపొందే ప్రయత్నం చేయవద్దని రాహుల్ శేవాలే అన్నారు. కాగా, బాల్‌ఠాక్రే చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై అనేక తర్జన భర్జనలు జరిగాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం పార్టీ అవిర్భవించిన నాటి నుంచి ఏటా దసరా రోజున శివాజీ పార్క్ మైదానంలో శివసేన భారీ ర్యాలీ జరిగేది. దీంతో ఈ మైదానంతో ఠాక్రేకు అవినావ భావం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడే ఠాక్రేకు అంత్యక్రియలు నిర్వహిస్తామని శివసేన నాయకులు పట్టుబట్టారు. కానీ ఒక బహిరంగ ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించాలంటే నియయనిబంధనలు అడ్డువచ్చాయి. చివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో శివాజీపార్క్ మైదానంలో ఠాక్రే భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత ఈ ప్రాంతాన్ని ఠాక్రే అభిమానులు దర్శించుకునేందుకు అక్కడ గద్దె నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ప్రతీరోజు వేలాది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ గద్దెను సందర్శించి వెళుతుండేవారు. దీంతో ఠాక్రే స్మృతి స్మారకాన్ని ఇక్కడే నిర్మించాలని శివసేన నాయకులు పట్టుబట్టారు. తర్వాత అనేక రంగాలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావడంతో మార్గం సుగమమైంది.