కుదరని పక్షంలో మూకుమ్మడిగా నోటాకు ఓటేస్తాం
ప్రజా ప్రతినిధులకు శివాజీ పార్క్ మైదానం పరిసర ప్రాంతాల ప్రజల హెచ్చరిక
బహిరంగసభలు, క్రీడల నిర్వహణ, సాధనకు కేరాఫ్ అడ్రస్‌గా దాదర్ శివాజీ పార్క్ మైదానం
వీటి కారణంగా మైదానంలో భారీ ఎత్తున పేరుకుపోతున్న ఎర్రమట్టి, దాని వల్ల చెలరేగే ధూళితో ప్రజలకు శ్వాసకోశ ఇబ్బందులు
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల్లో పాల్గొనబోమని జీ–ఉత్తర వార్డు ప్రజల ప్రకటన
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో పేరుకుపోయిన ఎర్రమట్టిని తొలగించే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. పర్యావరణానికి అలాగే తమకు ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు సృష్టిస్తున్న ఈ ఎర్రమట్టిని తొలగిస్తారా..? లేదా..? అని ప్రజలు స్ధానిక ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకుంటే నవంబరు 20న జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు ఓటు వేయాలని తమను బలవంతం చేసినా లేదా ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా..? నన్ ఆఫ్ ఎబౌ (నోటా) మీటను నొక్కుతామని స్పష్టం చేశారు.
శివాజీపార్క్ మైదానం బీఎంసీకి చెందిన జీ–ఉత్తర వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ వార్డు అసిస్టెంట్ కమిషనర్ అజీత్‌కుమార్ ఆంబీని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహానికి గురైన మైదానం చుట్టుపక్కల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని, కుదరని పక్షంలో నోటాపై నొక్కాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులు ఆందోళనలో పడ్డారు.
సైలెన్స్ జోన్‌లో ఉన్నా...షరతులతో అనుమతి..
నగరం నడిబొడ్డున దాదర్ ప్రాంతంలో 98 వేల చదరపు మీటర్ల స్ధలంలో చారిత్రాత్మక శివాజీపార్క్ మైదానం విస్తరించి ఉంది. బ్రిటీష్ హయాంలో స్వాతంత్య్ర పోరాటం సహా అనేక పోరాటాలకు ఈ మైదానం వేదికైంది. అంతేకాదు గతంలో సునీల్ గవాస్కర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనీల్ కాంబ్లే వంటి దిగ్గజాలు సహా అనేకమంది క్రికెటర్లు క్రికెట్ ఆటను ఈమైదానంలో సాధన చేసేవారు.
ఇక లోక్‌సభ, అసెంబ్లీ, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు వచ్చాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రచార సభలతో ఈ మైదానం హోరెత్తుతుంటుంది. ఈ మైదానం సైలెన్స్ జోన్‌లో ఉన్నప్పటికీ కొన్ని షరతులతో అనుమతి ఇవ్వక తప్పకపోవడంతో వీటన్నిటి నేపథ్యంలో మైదానంలో పెద్దఎత్తునఎర్రమట్టి పేరుకుపోతోంది. ఫలితంగా చుట్టపక్కల నివాసముంటున్న వేలాది కుటుంబాలు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కుంటున్నాయి. తమ సమస్య పరిష్కరించాలని ఏళ్ల తరబడి బీఎంసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగలడంతో తమ సమస్యను పరిష్కరించాలని కాలుష్య నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేస్తూ పలుమార్లు లేఖలు కూడా రాశారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడంతో అనేక ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ ఏడాది మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా స్ధానికులు ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన ప్రభుత్వం మైదానంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ప్రారంభించింది.కానీ జూన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.మైదానంలో ఉదయం, సాయంత్రం అనేక మంది వ్యాయామం చేస్తారు. కొందరు మార్నింగ్, ఈవ్‌నింగ్ వాక్‌కు వస్తుంటారు. మరికొందరు పిల్లపాపలతో సరదాగా గడిపేందుకు, మరికొందరు కాలక్షేపం కోసం వస్తుంటారు. దీంతో స్ధానికులతోపాటు ఇక్కడకు వచ్చినవారంతా శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ను అమల్లో ఉందంటూ బీఎంసీ అధికారులు పనుల కొనసాగింపును వ్యతిరేకిస్తున్నారు. కాగా మట్టిని తొలగించడానికి ఎన్నికల కోడ్‌కు సంబంధమేమిటని శివాజీపార్క్ రహివాసీ సంఘటన సభ్యులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment