people protest
-
సుందరీకరణ ప్రాజెక్ట్ : ఎన్నికల్ని బహిష్కరిస్తాం.. ఓటర్ల హెచ్చరిక
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో పేరుకుపోయిన ఎర్రమట్టిని తొలగించే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. పర్యావరణానికి అలాగే తమకు ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు సృష్టిస్తున్న ఈ ఎర్రమట్టిని తొలగిస్తారా..? లేదా..? అని ప్రజలు స్ధానిక ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకుంటే నవంబరు 20న జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు ఓటు వేయాలని తమను బలవంతం చేసినా లేదా ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా..? నన్ ఆఫ్ ఎబౌ (నోటా) మీటను నొక్కుతామని స్పష్టం చేశారు.శివాజీపార్క్ మైదానం బీఎంసీకి చెందిన జీ–ఉత్తర వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ వార్డు అసిస్టెంట్ కమిషనర్ అజీత్‌కుమార్ ఆంబీని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహానికి గురైన మైదానం చుట్టుపక్కల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని, కుదరని పక్షంలో నోటాపై నొక్కాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులు ఆందోళనలో పడ్డారు. సైలెన్స్ జోన్లో ఉన్నా...షరతులతో అనుమతి.. నగరం నడిబొడ్డున దాదర్ ప్రాంతంలో 98 వేల చదరపు మీటర్ల స్ధలంలో చారిత్రాత్మక శివాజీపార్క్ మైదానం విస్తరించి ఉంది. బ్రిటీష్ హయాంలో స్వాతంత్య్ర పోరాటం సహా అనేక పోరాటాలకు ఈ మైదానం వేదికైంది. అంతేకాదు గతంలో సునీల్ గవాస్కర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనీల్ కాంబ్లే వంటి దిగ్గజాలు సహా అనేకమంది క్రికెటర్లు క్రికెట్ ఆటను ఈమైదానంలో సాధన చేసేవారు.ఇక లోక్‌సభ, అసెంబ్లీ, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు వచ్చాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రచార సభలతో ఈ మైదానం హోరెత్తుతుంటుంది. ఈ మైదానం సైలెన్స్ జోన్లో ఉన్నప్పటికీ కొన్ని షరతులతో అనుమతి ఇవ్వక తప్పకపోవడంతో వీటన్నిటి నేపథ్యంలో మైదానంలో పెద్దఎత్తునఎర్రమట్టి పేరుకుపోతోంది. ఫలితంగా చుట్టపక్కల నివాసముంటున్న వేలాది కుటుంబాలు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కుంటున్నాయి. తమ సమస్య పరిష్కరించాలని ఏళ్ల తరబడి బీఎంసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగలడంతో తమ సమస్యను పరిష్కరించాలని కాలుష్య నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేస్తూ పలుమార్లు లేఖలు కూడా రాశారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడంతో అనేక ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా స్ధానికులు ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన ప్రభుత్వం మైదానంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ప్రారంభించింది.కానీ జూన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.మైదానంలో ఉదయం, సాయంత్రం అనేక మంది వ్యాయామం చేస్తారు. కొందరు మార్నింగ్, ఈవ్నింగ్ వాక్కు వస్తుంటారు. మరికొందరు పిల్లపాపలతో సరదాగా గడిపేందుకు, మరికొందరు కాలక్షేపం కోసం వస్తుంటారు. దీంతో స్ధానికులతోపాటు ఇక్కడకు వచ్చినవారంతా శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ను అమల్లో ఉందంటూ బీఎంసీ అధికారులు పనుల కొనసాగింపును వ్యతిరేకిస్తున్నారు. కాగా మట్టిని తొలగించడానికి ఎన్నికల కోడ్‌కు సంబంధమేమిటని శివాజీపార్క్ రహివాసీ సంఘటన సభ్యులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
ఊరికి కరెంట్ కట్
సాక్షి, కొండాపూర్(మెదక్) : కరెంట్ బిల్లులు చెల్లించలేదని ఆ శాఖ అధికారులు గ్రామానికి మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతేకాకుండా ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌ను సైతం కట్ చేశారు. దీంతో తాగునీటి కోసం గ్రామస్తుల ఇబ్బందులు వర్ణాణాతీం. ఇది కొండాపూర్ మండల పరిధిలోని నూతన పంచాయతీగా ఏర్పడిన శివ్వన్నగూడెం గ్రామ ప్రజల పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని శివ్వన్నగూడెం గ్రామ పంచాయతీలో విద్యుత్ బిల్లులను ప్రతీ నెల 17వ తేదీన వచ్చి వసూళ్లు చేసేవారు. అయితే గ్రామంలో ఎటువంటి చాటింపు లేకుండా, ప్రజలకు సమాచారం అందించకుండా ఆదివారం ఉదయం 11 గంటలకు అధికారులు గ్రామానికి వచ్చారు. అసలే వర్షాకాలం కావడంతో రైతులంతా తమ పొలాల్లో విత్తనాలు నాటేందుకు వెళ్లారు. గ్రామంలో ఎంత తిరిగినా ఎవరూ లేకపోవడంతో బిల్ కలెక్షన్ ఏమీ రాలేదు. దీంతో ఆగ్రహించిన విద్యుత్ అధికారులు ఆ గ్రామానికి మొత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్వయంగా గ్రామ సర్పంచ్ చెప్పినా అధికారులు వినలేదు సరి కదా ఏకంగా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ బోర్ల వద్ద కూడా కనెక్షన్లను తొలగించారు. దీంతో ఆదివారం నుండి తాగేందుకు నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని, నీళ్లు లేనిది ఎలా ఉండాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బిల్లులు కట్టని వాళ్ల కనెక్షన్ తొలగించాలి కానీ కట్టిన వారి కనెక్షన్ తొలగించడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్ ఏడీఏ రాజమల్లేశంను వివరణ కోరగా వ్యవసాయ బోర్ల విద్యుత్‌ను కట్ చేయలేదని, ఎన్నిసార్లు బిల్ కలెక్షన్‌కు వెళ్లినా అధికారులను తిట్టి పంపిస్తున్నారని, అందుకే సరఫరా నిలిపివేశామని తెలిపారు. మళ్లీ ప్రతి నెల సక్రమంగా బిల్లులు చెల్లిస్తామంటూ సర్పంచ్ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని వివరణ ఇచ్చారు. -
139 మందికి లీగల్ నోటీసులు
డిచ్పల్లి : మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఆర్మూర్ రోడ్దు ప్రాంతంలో నివసిస్తున్న 139 మంది స్థానికులకు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు లీగల్ నోటీసులు పంపడం డిచ్‌పల్లిలో కలకలం రేపుతోంది. లీగల్ నో?సులు అందుకున్న బాధితులు అందోళనకు గురవుతున్నారు. నోటీసులు అందుకున్న బాధితులు శుక్రవారం డిచ్పల్లి రైల్వేస్టేషన్ ఎదుట నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాలు.. డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదుటగల ప్రాంతంలో పలు నివాస గృహాలు, హనుమాన్ ఆలయం ఉన్నాయి. ఎం.రాజశేఖర్ (సీతారాంనగర్ కాలనీ నిజామాబాద్), ఎం.రాజేంద్రకుమార్ (ఖైరతాబాద్, హైదరాబాద్) అనే వ్యక్తులు 14ఎకరాల 39 గుంటల స్థలం తమ పూర్వీకులదని ఆ స్థలంలో కొందరు ఇండ్లు నిర్మించుకున్నారని వాటిని కూలగొట్టి తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. 139 మందికి వ్యక్తిగతంగా ఈ నోటీసులు అందడంతో కొన్ని సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని ఉంటున్న స్థానికులు ఒక్కసారిగా అందోళనకు గురయ్యారు. చివరకు హనుమాన్ ఆలయం సైతం తమ స్థలంలోనే ఉందని ఆలయం పేరిట సైతం నోటీసు పంపడం స్థానికులను విస్తుపోయేలా చేస్తోంది. కొద్దిరోజుల క్రితం నివాస గృహాలుపోగా ఖాళీగా ఉన్న ప్లాట్లు తమకు చెందినవేనని కొందరు వ్యక్తులు ఇలాగే స్థానికులను బెదిరింపులకు గురి చేశారు. అప్పుడు సైతం స్థానికులంతా ఏకమై జిల్లా కలెక్టర్‌ను, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆ వ్యక్తులు మళ్లీ ఇటువైపు తొంగి చూడలేదు. ఇప్పుడు తాజాగా లీగల్ నోటీసులు రావడంతో స్థానికులు కలవరం చెందుతున్నారు. కొందరు బినామీ వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం తమ స్థలమని పేర్కొంటూ నోటీసులు పంపించడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకుని బతుకుతున్నామని పేర్కొంటున్నారు. రాస్తారోకో వల్ల రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచి పోయాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి సీఐ రామాంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సముదాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం నోటీసులు అందుకున్న బాధితులంతా తహసీల్దార్ శేఖర్‌ను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. -
సర్వేకి వెళితే ఛీత్కారమే!
సాక్షి, రాజమండ్రి : పింఛన్ మొత్తాన్ని పెంచడానికి ముందే.. రకరకాల సాకులతో లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి సర్వే పేరుతో చంద్రబాబు సర్కారు పన్నిన కుతంత్రం.. వడ్డనకు ముందే కొంతమందిని పంక్తిలోంచి లేపేసే కుయుక్తి లాంటిదేనని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఓవైపు రుణమాఫీ హామీని అమలు చేయకుండా కుత్సితంతో తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడుపై రైతులు, డ్వాక్రా మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతుండగా.. ఇప్పుడు పింఛన్ల సర్వే ప్రజల్లో నిరసన జ్వాలను రగిల్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భయపడుతున్నారు. అందుకే పింఛన్ల సర్వేకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో చేరేందుకు వెనుకాడుతున్నారు. సర్వే పేరుతో.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కొందరిని లబ్ధిదారులుగా రద్దు చేసినా, తమ పార్టీ వారిని లబ్ధిదారులుగా చేర్చినా ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని బెంబేలెత్తుతున్నారు. పింఛన్ల సర్వేకు ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మండల కమిటీల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీల్లో వార్డుల కమిటీల్లో కౌన్సిలర్లు, నగర పాలక సంస్థల్లో డివిజన్ల కమిటీల్లో కార్పొరేటర్లను భాగస్వాములను చేశారు. మొదట్లో వీరంతా తమకేదో హోదా దక్కినట్టు సంబరపడ్డా.. ఈ సర్వేపై ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసన గ్రహించాక ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్నారు. సర్కారు పింఛన్ల సర్వే కోసం కమిటీల్ని నియమించగానే లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. ముం దస్తు ప్రచారం లేకుండా హడావిడిగా కమిటీలు వేసి సర్వే అంటే ఎలా అని తీవ్రంగా నిరసిస్తున్నారు. దీంతో సర్వే పేరుతో ఇళ్లకు వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జంకుతున్నారు. కమిటీలపై జీఓ వెలువడిన దగ్గర నుంచి గురువారం సాయంత్రం వరకూ టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు అనుయాయులతో సమావేశమవుతూ.. సర్వేలో పాల్గొంటే ఎదురయ్యే పరిణామాలపై చర్చిస్తున్నారు. వారిలో అత్యధికులు శుక్రవారం నుంచి మొదలవుతున్న సర్వేకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అధికారులను పాపాలభైరవులను చేద్దాం.. ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారిలో నూరు శాతం గత ప్రభుత్వాలు ఎంపిక చేసిన వారే. వీరిలో 80 శాతం పైగా పింఛన్లు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చినవరంగా భావిస్తున్నారు. అప్పటి వరకూ రూ.75గా ఉన్న పింఛన్ మొత్తాన్ని వైఎస్ అధికారంలోకి రాగానే రూ.200కు పెంచారు. పేదల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తామని వాగ్దానాలిచ్చిన చంద్రబాబు..గద్దెనెక్కాక వాటి అమలుకు పూనుకోకపోగా..నిస్సిగ్గుగా, నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టే ఎత్తులు వేస్తున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన జనం ఇప్పటికే సర్కారు వంచనపై నిప్పులు కక్కుతున్నారు. ఇప్పుడు పింఛన్ల సర్వే పేరుతో జనం మధ్యకు వెళితే ఆ కాక తమకు తప్పదని అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు. ఆ అవస్థను, పేదల పొట్ట కొటామన్న అపప్రథను తప్పించుకోవడానికి.. పింఛన్ల ఏరివేతకు అధికారులనేబాధ్యులను చేస్తే పోలా అనుకుంటున్నారు. కమిటీల్లో సభ్యులుగా ప్రజల ముందుకు వెళ్లరాదని నిర్ణయించుకుంటున్నారు. అప్పుడు ప్రజలు అధికారులనే పాపాపాపాల భైరవులుగా పరిగణిస్తారని ఆశిస్తున్నారు. ఈ తంతును అధికారులతోనే కానిచ్చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరుతున్నారు. రద్దు చేస్తామంటే జనం ఊరుకోరు క్షేత్రస్థాయిలో పింఛన్ల సర్వే మా వంటి ప్రజా ప్రతినిధులకు ఇబ్బంది కలగజేస్తుంది. గతంలో ఇచ్చిన పింఛన్లను రద్దు చేస్తామంటే జనం ఊరుకోరు. మరింత మంది అర్హులను గుర్తించి వారికీ పింఛన్లిస్తేనే జనం హర్షిస్తారు. లేదంటే ఇదికూడా ఓ రాజకీయంగా పరిగణిస్తారు. - ఇజ్జరపు రాజశేఖర్, కౌన్సిలర్, పెద్దాపురం వార్డుల్లోకి వెళితే తిరగబడతారు ప్రభుత్వ నిర్ణయం సమంజసమైంది కాదు. వార్డుల్లోకి వెళ్తే జనం తిరగబడేలా ఉన్నారు. గతంలో కూడా అర్హతను చూసే కదా పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా సర్వే పేరుతో తొలగిస్తామంటే జనం ద్వేషిస్తారు. కార్పొరేటర్లు జనం మధ్య తిరిగే అవకాశం కోల్పోతారు. కమిటీల కూర్పు సరైంది కాదు. - సంజీవరావు, రిటైర్డ్ జడ్జి, కో ఆప్షన్ సభ్యుడు, రాజమండ్రి