డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్న బాధితులు
డిచ్‌పల్లి : మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఆర్మూర్ రోడ్దు ప్రాంతంలో నివసిస్తున్న 139 మంది స్థానికులకు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు లీగల్ నోటీసులు పంపడం డిచ్‌పల్లిలో కలకలం రేపుతోంది. లీగల్ నో?సులు అందుకున్న బాధితులు అందోళనకు గురవుతున్నారు. నోటీసులు అందుకున్న బాధితులు శుక్రవారం డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ ఎదుట నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాధితులు తెలిపిన వివరాలు.. డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ ఎదుటగల ప్రాంతంలో పలు నివాస గృహాలు, హనుమాన్ ఆలయం ఉన్నాయి. ఎం.రాజశేఖర్ (సీతారాంనగర్ కాలనీ నిజామాబాద్), ఎం.రాజేంద్రకుమార్ (ఖైరతాబాద్, హైదరాబాద్) అనే వ్యక్తులు 14ఎకరాల 39 గుంటల స్థలం తమ పూర్వీకులదని ఆ స్థలంలో కొందరు ఇండ్లు నిర్మించుకున్నారని వాటిని కూలగొట్టి తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు.
139 మందికి వ్యక్తిగతంగా ఈ నోటీసులు అందడంతో కొన్ని సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని ఉంటున్న స్థానికులు ఒక్కసారిగా అందోళనకు గురయ్యారు. చివరకు హనుమాన్ ఆలయం సైతం తమ స్థలంలోనే ఉందని ఆలయం పేరిట సైతం నోటీసు పంపడం స్థానికులను విస్తుపోయేలా చేస్తోంది. కొద్దిరోజుల క్రితం నివాస గృహాలుపోగా ఖాళీగా ఉన్న ప్లాట్లు తమకు చెందినవేనని కొందరు వ్యక్తులు ఇలాగే స్థానికులను బెదిరింపులకు గురి చేశారు.
అప్పుడు సైతం స్థానికులంతా ఏకమై జిల్లా కలెక్టర్‌ను, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆ వ్యక్తులు మళ్లీ ఇటువైపు తొంగి చూడలేదు. ఇప్పుడు తాజాగా లీగల్ నోటీసులు రావడంతో స్థానికులు కలవరం చెందుతున్నారు. కొందరు బినామీ వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం తమ స్థలమని పేర్కొంటూ నోటీసులు పంపించడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకుని బతుకుతున్నామని పేర్కొంటున్నారు. రాస్తారోకో వల్ల రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచి పోయాయి. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి సీఐ రామాంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సముదాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం నోటీసులు అందుకున్న బాధితులంతా తహసీల్దార్ శేఖర్‌ను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment