dich palle
-
139 మందికి లీగల్ నోటీసులు
డిచ్పల్లి : మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఆర్మూర్ రోడ్దు ప్రాంతంలో నివసిస్తున్న 139 మంది స్థానికులకు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు లీగల్ నోటీసులు పంపడం డిచ్‌పల్లిలో కలకలం రేపుతోంది. లీగల్ నో?సులు అందుకున్న బాధితులు అందోళనకు గురవుతున్నారు. నోటీసులు అందుకున్న బాధితులు శుక్రవారం డిచ్పల్లి రైల్వేస్టేషన్ ఎదుట నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాలు.. డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదుటగల ప్రాంతంలో పలు నివాస గృహాలు, హనుమాన్ ఆలయం ఉన్నాయి. ఎం.రాజశేఖర్ (సీతారాంనగర్ కాలనీ నిజామాబాద్), ఎం.రాజేంద్రకుమార్ (ఖైరతాబాద్, హైదరాబాద్) అనే వ్యక్తులు 14ఎకరాల 39 గుంటల స్థలం తమ పూర్వీకులదని ఆ స్థలంలో కొందరు ఇండ్లు నిర్మించుకున్నారని వాటిని కూలగొట్టి తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. 139 మందికి వ్యక్తిగతంగా ఈ నోటీసులు అందడంతో కొన్ని సంవత్సరాలుగా ఇండ్లు నిర్మించుకుని ఉంటున్న స్థానికులు ఒక్కసారిగా అందోళనకు గురయ్యారు. చివరకు హనుమాన్ ఆలయం సైతం తమ స్థలంలోనే ఉందని ఆలయం పేరిట సైతం నోటీసు పంపడం స్థానికులను విస్తుపోయేలా చేస్తోంది. కొద్దిరోజుల క్రితం నివాస గృహాలుపోగా ఖాళీగా ఉన్న ప్లాట్లు తమకు చెందినవేనని కొందరు వ్యక్తులు ఇలాగే స్థానికులను బెదిరింపులకు గురి చేశారు. అప్పుడు సైతం స్థానికులంతా ఏకమై జిల్లా కలెక్టర్‌ను, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆ వ్యక్తులు మళ్లీ ఇటువైపు తొంగి చూడలేదు. ఇప్పుడు తాజాగా లీగల్ నోటీసులు రావడంతో స్థానికులు కలవరం చెందుతున్నారు. కొందరు బినామీ వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం తమ స్థలమని పేర్కొంటూ నోటీసులు పంపించడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకుని బతుకుతున్నామని పేర్కొంటున్నారు. రాస్తారోకో వల్ల రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచి పోయాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి సీఐ రామాంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సముదాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం నోటీసులు అందుకున్న బాధితులంతా తహసీల్దార్ శేఖర్‌ను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. -
వ్యక్తి దారుణ హత్య
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామ శివారులో ఓ వ్యకి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. డిచ్పల్లికి చెందిన సంజీవ(50)ను స్థానిక దర్గా వద్దకు గురువారం అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు పని ఉందంటూ తీసుకెళ్లారు. అయితే సంజీవ శుక్రవారం విగత జీవిగా స్థానికులకు కనిపించాడు. మృతుడి శరీరంపై కత్తి పోట్లు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డాగ్ స్క్యాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. (డిచ్పల్లి) -
మన పోలీసులే ఆదర్శం
డిచ్పల్లి, న్యూస్‌లైన్ : దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. అందుకే అనేక రాష్ట్రాల పోలీసులు ఇక్కడికి వచ్చి వివిధ అంశాల్లో శిక్షణ తీసుకొని వెళుతున్నారన్నారు. ఆదివారం డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్‌లో ఏపీఎస్పీ 56 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్‌కు పోలీసు సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైని కులు సరిహద్దుల్లో శత్రువులను ఎదుర్కొంటుంటే సివిల్, స్పెషల్ పోలీసులు దేశంలోని అంతర్గత శత్రువులతో పోరాడుతున్నారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసు లు ముందున్నారన్నారు. ప్రస్తుతం కొత్తకొత్త సమస్యలు పుట్టుకు వస్తున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. దుష్టశక్తులను తిప్పికొట్టేందుకు ఎప్పటికప్పుడు ఆధునిక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే అభినందించేవారు ఎవరూ ఉండరని, అదుపు తప్పితే విమర్శలు చేసేవారు మాత్రం ఎక్కువ మంది ఉంటారని గుర్తుంచుకోవాలన్నారు. విమర్శలతో నిరుత్సాహం చెందవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. గతంలో తాను జేసీగా పని చేసినప్పుడు పోలీసు కార్యక్రమాలకు తప్పకుండా వెళ్లేవాడినని ప్రద్యుమ్న తెలిపారు. బెటాలియన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ తరుణ్ జోషికి బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్‌రావు జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారి, తహశీల్దార్ వెంకటయ్య, నడిపల్లి సర్పంచ్ అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు వెంకట్రాములు, నెహ్రూ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కమాండెంట్ వినతి మేరకు బెటాలియన్‌లోని అంతర్గత రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.