డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ :
దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. అందుకే అనేక రాష్ట్రాల పోలీసులు ఇక్కడికి వచ్చి వివిధ అంశాల్లో శిక్షణ తీసుకొని వెళుతున్నారన్నారు. ఆదివారం డిచ్‌పల్లిలోని ఏడో బెటాలియన్‌లో ఏపీఎస్పీ 56 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్‌కు పోలీసు సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైని కులు సరిహద్దుల్లో శత్రువులను ఎదుర్కొంటుంటే సివిల్, స్పెషల్ పోలీసులు దేశంలోని అంతర్గత శత్రువులతో పోరాడుతున్నారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసు లు ముందున్నారన్నారు. ప్రస్తుతం కొత్తకొత్త సమస్యలు పుట్టుకు వస్తున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. దుష్టశక్తులను తిప్పికొట్టేందుకు ఎప్పటికప్పుడు ఆధునిక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే అభినందించేవారు ఎవరూ ఉండరని, అదుపు తప్పితే విమర్శలు చేసేవారు మాత్రం ఎక్కువ మంది ఉంటారని గుర్తుంచుకోవాలన్నారు. విమర్శలతో నిరుత్సాహం చెందవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
గతంలో తాను జేసీగా పని చేసినప్పుడు పోలీసు కార్యక్రమాలకు తప్పకుండా వెళ్లేవాడినని ప్రద్యుమ్న తెలిపారు. బెటాలియన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కలెక్టర్‌తో పాటు ఎస్‌పీ తరుణ్ జోషికి బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్‌రావు జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారి, తహశీల్దార్ వెంకటయ్య, నడిపల్లి సర్పంచ్ అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు వెంకట్రాములు, నెహ్రూ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కమాండెంట్ వినతి మేరకు బెటాలియన్‌లోని అంతర్గత రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
మన పోలీసులే ఆదర్శం
Published Mon, Dec 2 2013 1:18 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement