సర్వేకి వెళితే ఛీత్కారమే!
సాక్షి, రాజమండ్రి : పింఛన్ మొత్తాన్ని పెంచడానికి ముందే.. రకరకాల సాకులతో లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి సర్వే పేరుతో చంద్రబాబు సర్కారు పన్నిన కుతంత్రం.. వడ్డనకు ముందే కొంతమందిని పంక్తిలోంచి లేపేసే కుయుక్తి లాంటిదేనని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఓవైపు రుణమాఫీ హామీని అమలు చేయకుండా కుత్సితంతో తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడుపై రైతులు, డ్వాక్రా మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతుండగా.. ఇప్పుడు పింఛన్ల సర్వే ప్రజల్లో నిరసన జ్వాలను రగిల్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భయపడుతున్నారు.
అందుకే పింఛన్ల సర్వేకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో చేరేందుకు వెనుకాడుతున్నారు. సర్వే పేరుతో.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కొందరిని లబ్ధిదారులుగా రద్దు చేసినా, తమ పార్టీ వారిని లబ్ధిదారులుగా చేర్చినా ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని బెంబేలెత్తుతున్నారు. పింఛన్ల సర్వేకు ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మండల కమిటీల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీల్లో వార్డుల కమిటీల్లో కౌన్సిలర్లు, నగర పాలక సంస్థల్లో డివిజన్ల కమిటీల్లో కార్పొరేటర్లను భాగస్వాములను చేశారు. మొదట్లో వీరంతా తమకేదో హోదా దక్కినట్టు సంబరపడ్డా.. ఈ సర్వేపై ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసన గ్రహించాక ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్నారు.
సర్కారు పింఛన్ల సర్వే కోసం కమిటీల్ని నియమించగానే లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. ముం దస్తు ప్రచారం లేకుండా హడావిడిగా కమిటీలు వేసి సర్వే అంటే ఎలా అని తీవ్రంగా నిరసిస్తున్నారు. దీంతో సర్వే పేరుతో ఇళ్లకు వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జంకుతున్నారు. కమిటీలపై జీఓ వెలువడిన దగ్గర నుంచి గురువారం సాయంత్రం వరకూ టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు అనుయాయులతో సమావేశమవుతూ.. సర్వేలో పాల్గొంటే ఎదురయ్యే పరిణామాలపై చర్చిస్తున్నారు. వారిలో అత్యధికులు శుక్రవారం నుంచి మొదలవుతున్న సర్వేకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
అధికారులను పాపాలభైరవులను చేద్దాం..
ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారిలో నూరు శాతం గత ప్రభుత్వాలు ఎంపిక చేసిన వారే. వీరిలో 80 శాతం పైగా పింఛన్లు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చినవరంగా భావిస్తున్నారు. అప్పటి వరకూ రూ.75గా ఉన్న పింఛన్ మొత్తాన్ని వైఎస్ అధికారంలోకి రాగానే రూ.200కు పెంచారు. పేదల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తామని వాగ్దానాలిచ్చిన చంద్రబాబు..గద్దెనెక్కాక వాటి అమలుకు పూనుకోకపోగా..నిస్సిగ్గుగా, నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టే ఎత్తులు వేస్తున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన జనం ఇప్పటికే సర్కారు వంచనపై నిప్పులు కక్కుతున్నారు. ఇప్పుడు పింఛన్ల సర్వే పేరుతో జనం మధ్యకు వెళితే ఆ కాక తమకు తప్పదని అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు. ఆ అవస్థను, పేదల పొట్ట కొటామన్న అపప్రథను తప్పించుకోవడానికి.. పింఛన్ల ఏరివేతకు అధికారులనేబాధ్యులను చేస్తే పోలా అనుకుంటున్నారు. కమిటీల్లో సభ్యులుగా ప్రజల ముందుకు వెళ్లరాదని నిర్ణయించుకుంటున్నారు. అప్పుడు ప్రజలు అధికారులనే పాపాపాపాల భైరవులుగా పరిగణిస్తారని ఆశిస్తున్నారు. ఈ తంతును అధికారులతోనే కానిచ్చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరుతున్నారు.
రద్దు చేస్తామంటే జనం ఊరుకోరు
క్షేత్రస్థాయిలో పింఛన్ల సర్వే మా వంటి ప్రజా ప్రతినిధులకు ఇబ్బంది కలగజేస్తుంది. గతంలో ఇచ్చిన పింఛన్లను రద్దు చేస్తామంటే జనం ఊరుకోరు. మరింత మంది అర్హులను గుర్తించి వారికీ పింఛన్లిస్తేనే జనం హర్షిస్తారు. లేదంటే ఇదికూడా ఓ రాజకీయంగా పరిగణిస్తారు.
- ఇజ్జరపు రాజశేఖర్, కౌన్సిలర్, పెద్దాపురం
వార్డుల్లోకి వెళితే తిరగబడతారు
ప్రభుత్వ నిర్ణయం సమంజసమైంది కాదు. వార్డుల్లోకి వెళ్తే జనం తిరగబడేలా ఉన్నారు. గతంలో కూడా అర్హతను చూసే కదా పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా సర్వే పేరుతో తొలగిస్తామంటే జనం ద్వేషిస్తారు. కార్పొరేటర్లు జనం మధ్య తిరిగే అవకాశం కోల్పోతారు. కమిటీల కూర్పు సరైంది కాదు.
- సంజీవరావు, రిటైర్డ్ జడ్జి, కో ఆప్షన్ సభ్యుడు, రాజమండ్రి