మీ రాజకీయ లబ్ధి కోసం తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్ మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ జన సమ్మాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో..రాష్ట్ర మంత్రి ధర్మారావు బాబా ఆత్రం, ఆయన కుమార్తె భాగ్యశ్రీ గురించి మాట్లాడారు. భాగ్యశ్రీ తండ్రి ప్రత్యర్ధి పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్‌పి)లోకి వెళ్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు తండ్రి ధర్మారావు బాబా ఆత్రంపై కుమార్తె భాగ్యశ్రీ పోటీ చేస్తుందన్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారంపై అజిత్ పవార్ స్పందించారు.
‘ తండ్రిపై కుమార్తె పోటీ చేయడం ఎంత వరకు కరెక్ట్. కూతురిని తన తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరు. పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ బెల్గాం వెళ్లినప్పటికీ..గడ్చిరోలిలో ఆమెకు (తండ్రి ఆత్రం) అండగా నిలిచి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిని చేశారు. ఇప్పుడు మీరు (భాగ్యశ్రీ) మీ తండ్రికి వెన్నుపోటు పొడిచి ఆయన మీదే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మీ నిర్ణయం సరైందేనా? అని ప్రశ్నించారు.
‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మీ తండ్రికి మద్దతు ఇవ్వండి. అతనిని గెలిపించండి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం , సంకల్పం ఆయనకు మాత్రమే ఉంది. కుటుంబంలో చీలికలు రావడాన్ని సమాజం అంగీకరించదు. నా విషయంలోనూ ఇదే జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దింపి ఉండాల్సింది కాదు. నేను తప్పు చేశా. చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకుంటున్నా’ అని అన్నారు.
అజిత్ పవార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. కొద్ది రోజుల క్రితం ఇలాగే మాట్లాడారు. ఇటీవల మహరాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శరద్ పవార్ తన అనుభవాన్ని రంగరించి, తన వర్గం ఎన్‌సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే, ఆ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్‌సీపీ తరుఫున సుప్రీయా సూలే బరిలో దిగగా..అదే స్థానంలో సుప్రియా సూలేపై అజిత్ పవార్ ఎన్‌సీపీ తరుఫున ఆయన భార్య సునేత్ర పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు నామినేట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మహరాష్ట్ర అధికార కూటమి నుంచి అజిత్ పవార్‌ను బీజేపీ పక్కన పెట్టేస్తుందంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాల నడుమ అజిత్ పవార్ ఇలా మాట్లాడుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment