సాక్షి, ముంబై: కొద్ది రోజులుగా శివసేన పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు మనోహర్ జోషి గత 24 గంటల నుంచి ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన సెల్‌కు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వస్తోంది తప్పితే వేరే సమాధానం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు..? ఎవరితో కలిసి ఎక్కడికి వెళ్లారనేది అంతుచిక్కడం లేదు. శివాజీపార్క్ మైదానంలో ఆదివారం రాత్రి శివసేన నిర్వహించిన దసరా ర్యాలీకి వివిధ ప్రముఖులతోపాటు జోషి కూడా హాజరయ్యారు.
అప్పటికే ఆయన వైఖరిపై ఆగ్రహంతో ఉన్న పార్టీ కార్యకర్తలు జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనోహర్ జోషి హాయ్ హాయ్ అంటూ కేకలు వేశారు. వేదిక దిగి వెళ్లిపోవాలని గందరగోళం సృష్టించారు. దీంతో చేసేది లేక జోషి మౌనంగా వేదిక దిగి కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి నాట్ రీచబుల్ (అజ్ఞాతం)లో ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో నగరం విడిచి వెళ్లిపోయారు. స్వగ్రామమైన రాయ్‌గడ్ జిల్లా నాంద్‌వి వెళ్లినట్లు కొందరు చెబుతుండగా, ప్రస్తుతం ఆయన లోణావాలాలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు మరికొందరు చెబుతున్నారు. అయితే, ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు.
ఇదిలాఉండగా మనోహర్ జోషి మహారాష్ట్ర న వనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో తరుచూ సంప్రదించడంవల్ల ఆ పార్టీలో చేరుతుండవచ్చని వచ్చిన వ దంతులను ఆ పార్టీ నాయకులు కొట్టిపారేశారు. ఈ పుకార్లన్నీ మీడియా ద్వారా వచ్చినవేనని ఎమ్మెన్నెస్‌కు చెందిన ఓ సీనియర్ నాయకుడు అన్నారు. జోషి, రాజ్ ఠాక్రేల మధ్య కుటుంబ సంబంధాలున్నాయి. వీటికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆ నాయకుడు స్పష్టం చేశారు. ఎమ్మెన్నెస్ యువతకు సంబంధించిన పార్టీ. ఇందులో మనోహర్ జోషిలాంటి సీనియర్ నాయకున్ని ఎలా చేర్చుకోవాలనే ప్రశ్న తలెత్తుతోందని ఆయన అన్నారు. కాని ఉద్ధవ్‌కు వ్యతిరేకంగా జోషి అలా వ్యాఖ్యలు చేయకపోయుంటే బాగుండేదని ఆ నాయకుడు అభిప్రాయపడ్డారు. కాని జోషిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే అలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు.
మొదలైన ఫిరాయింపులు..
వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకుల ఫిరాయింపులు మొదలయ్యాయి. అనేకమంది మాజీ మంత్రులు, పదాధికారులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో తీర్థం పుచ్చుకోవడం మొదలుపెట్టారు. శివసేన ఉప నాయకుడు సంజయ్ ఘాడి, అతడి భార్య సంజనా ఘాడి, మాజీ కార్పొరేటర్ రాజా చౌగులే, కార్మిక యూనియన్ నాయకుడు నితిన్ జాదవ్, ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ సొదరుడు, మాజీ కార్పొరేటర్ కప్తాన్ మాలిక్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుడ్తర్కర్ తదితరులు సోమవారం ఎమ్మెన్నెస్‌లో చేరారు. పార్టీ నాయకులు తమను చిన్నచూపు చూడటం, వారి పనితీరుపై విసిగెత్తి ఎమ్మెన్నెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ ఠాక్రేతో పేర్కొన్నారు.
శివ సైనికుల ఆగ్రహం సహేతుకమే..
ముంబై : దసరా ర్యాలీలో జోషికి జరిగిన అవమానంపై పలు పార్టీలు స్పందించాయి. ఒకప్పుడు శివసేనలో మనోహర్‌జోషికు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ప్రస్తుత ఎన్‌సీపీ నాయకుడు చగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ .. ‘జోషీ తీరుపై సైనికుల ఆగ్రహం సహేతుకమే.. ఆ పార్టీ అండే లేకుంటే జోషీ ముఖ్యమంత్రి పదవి అధిరోహించేవాడేకాదు.. అటువంటి పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిజమైన కార్యకర్తలు విని ఊరుకోరు కదా..’ అన్నారు. కాగా, జోషీ విషయం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానిక్‌రావ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. ‘జోసీ ఒక సీనియర్ నాయకుడు. ఏ పార్టీలోనూ ఇటువంటి సంఘటనలు వాంఛితం కాదు. అయితే అతడిపై కార్యకర్తల తీరు ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా మాత్రమే మేం చూస్తున్నాం..’ అని స్పందించారు. కాంగ్రెస్ మంత్రి నారాయణ్ రానే మాట్లాడుతూ ‘ జోషి వంటి నాయకుడికి ఆ పార్టీ ర్యాలీలో తీరని అవమానం జరిగింది. అతడు సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పనితీరును విమర్శించబట్టే ఆ పరిస్థితి ఎదురైంది’ అని అన్నారు. ర్యాలీలో జోషికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా ఉద్ధవ్, అతడి భార్య రష్మి, కుమారుడు ఆదిత్య కూడా వారిని వారించేందుకు ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నం ఫలించలేదు. చివరకు జోషి వేదిక దిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.
అజ్ఞాతంలోకి!
Published Wed, Oct 16 2013 5:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement
Advertisement