Manohar Joshi
-
విషాదం: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మనోహర్ తుదిశ్వాస విడిచారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మృతిచెందారు. ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఈరోజు మధ్యాహ్నం ముంబైలో మనోహర్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, గత ఏడాది మేలోనూ మెదడులో రక్తస్రావం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇక, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే వైద్యులు తెలిపారు. #WATCH | Former CM of Maharashtra Manohar Joshi passed away at Hinduja Hospital in Mumbai at around 3 am today. He was admitted here on February 21 after he suffered a cardiac arrest. Visuals from outside the hospital. pic.twitter.com/yFL7aUkhfo — ANI (@ANI) February 23, 2024 రాజకీయ ప్రస్థానం.. 1937 డిసెంబర్ 2న నాంద్వీలో మనోహర్ జోషి జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే జరిగింది. తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనోహర్ జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్య మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇక, శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గానూ వ్యవహరించారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున ముంబై నార్త్-సెంట్రల్ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాగా, ఆయన సతీమణి అనఘ మనోహర్ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
మనోహర్ జోషి పరిస్థితి ఆందోళనకరం
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా మారింది. శివసేన సీనియర్ నేత అయిన జోషిని మెదడులో రక్తస్రావంతో రెండు రోజుల క్రితం హుటాహుటిన ముంబైలోని పీడీ హిందూజా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన స్పృహలోలేరని, దాదాపు కోమాలో ఉన్నారని ఆయన కుమారుడు ఉన్మేశ్ సోమవారం చెప్పారు. ‘ 85 ఏళ్ల జోషి ఐసీయూలో ఉన్నా వెంటిలేటర్ సాయంలేకుండా సాధారణ శ్వాస తీసుకుంటున్నారు. ప్రస్తుత రక్తస్రావం పరిస్థితి అదుపులో ఉంది’ అని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దేశ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెల్సుకున్నారు. 1995లో బీజేపీతో పార్టీ సంకీర్ణం అయ్యాక మహారాష్ట్రలో శివసేన నుంచి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి పొందిన వ్యక్తి జోషియే. 1966లో శివసేన స్థాపించాక అప్పటినుంచీ జోషి అందులో సభ్యునిగా కొనసాగుతున్నారు. లోక్‌సభకు గతంలో స్పీకర్‌గా వ్యవహరించారు. ముంబై మేయర్‌గా సేవలందించారు. మహారాష్ట్ర శాసనసభలో విపక్షనేతగా కొనసాగారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. -
బీజేపీతో జట్టు కట్టేది లేదు: శివసేన
ముంబై: శివసేన బలం మరి కాస్త పెరిగింది. గురువారం ప్రకటించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఫలితాల్లో బీజేపీ, శివసేన పోటాపోటీగా సీట్లు గెలుపొందిన విషయం విదితమే. శివసేన 84, బీజేపీ 82 సీట్లు గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులకు డిమాండ్ పెరిగింది. విఖ్రోలీ, డిండోషి స్థానాల నుంచి విజయం సాధించిన ఇండిపెండెంట్లు స్నేహల్ మోరే, తులసీరాం షిండే శుక్రవారం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేను కలిసి మద్దతు ప్రకటించారు. దీంతో శివసేన బలం 86 కు పెరిగింది. ఇదిలా ఉండగా, ఇండిపెండెంట్‌గా గెలిచిన రహ్‌బార్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరు తమ పక్షానికి మద్దతు ప్రకటించనున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నేత మనోహర్ జోషి మాట్లాడుతూ.. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కమలనాథులతో జట్టు కట్టబోదని స్పష్టం చేశారు. తమదే ముంబై పీఠమని దీమా ప్రకటించారు. అలాగే, 31 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ కూడా తాము బీజేపీ, శివసేనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్టు ఇవ్వలేమని ప్రకటించింది. సైద్ధాంతిక పరంగా తీవ్రంగా విబేధాలున్న ఆ పార్టీలకు తాము దూరంగా ఉంటామని ఆ పార్టీ ముంబై నగర అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండాలనే ప్రజల తీర్పును గౌరవిస్తామని తెలిపారు. -
బీజేపీ తీరుపై అగ్రనేతల ఫైర్
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నేపథ్యంలో బీజేపీ తీరును తప్పబడుతూ ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని బిహార్ ఫలితాలు చాటుతున్నాయని బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా మంగళవారం రాత్రి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. బిహార్‌లో ఓటమికి ప్రతి ఒక్కరిది బాధ్యత అని చెప్పడం తప్పించుకోవడమే అవుతుందని, విజయం వస్తే క్రెడిట్ తీసుకోడానికి ముందుకొచ్చే వాళ్లే.. ఓటమి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నట్టు కనిపిస్తున్నదని ఈ ప్రకటనలో అగ్రనేతలు తీవ్రంగా మండిపడ్డారు. 'గత ఏడాది కాలంగా పార్టీలో కనిపిస్తున్న నీరసమైన విధానమే తాజా ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. తాజా ఓటమికి కారణాలు తెలుసుకోవడానికి సమగ్ర సమీక్ష జరుపాల్సిన అవసరముంది' అని అగ్రనేతలు పేర్కొన్నారు. -
వివాదాస్పదులపై వేటు-కొత్తవారికి చోటు
సాక్షి, ముంబై: శివసేన నాయకులైన మనోహర్ జోషి, సంజయ్‌రావుత్‌లను అధికార ప్రతినిధి పదవుల నుంచి తప్పించారు. పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొనేవిధంగా చేసిన కారణంగానే వీరిని తప్పించి ఉండొచ్చని భావిస్తున్నారు.వీరితోపాటు సుభాష్ దేశాయి, శ్వేతా పారుల్కర్‌లని కూడా ఈ పదవి నుంచి తప్పిం చారు. ఈ నేపథ్యంలో శివసేన కొత్తగా ఆరుగురు అధికార ప్రతినిధుల పేర్లను ప్రకటించింది. వీరిలో ముఖ్యంగా గతంలో ఉన్నవారిలో నీలం గోరే మినహా మిగతా వారంతా కొత్తవారే. వీరంతా యువకులే. కొత్త అధికార ప్రతినిధులలో ఎంపీ అరవింద్ సావంత్, అమోల్ కోల్హే, విజయ్ శివతారే, మనీషా కాయిందే, అరవింద భోస్లే ఉన్నారు. సంజయ్ రావుత్‌తోపాటు మనోహర్ జోషి గతంలో ఓ పర్యాయం చేసిన వ్యాఖ్యలపై కారణంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చే సిన సంగతి విదితమే. -
అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు
కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగిన రాహుల్ శెవాలే సాక్షి. ముంబై: బీఎంసీ కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాహుల్ శెవాలే అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్జోషీనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే టికెట్ కేటాయించారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గెలుపుకోసం కృషి చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నాయకుడైన ఏక్నాథ్ గైక్వాడ్‌పై ఘనవిజయం సాధించారు. దీంతో స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన నేరుగా పార్లమెంట్‌కు వెళ్లేందుకు ఆస్కారం లభించింది. దక్షిణ మధ్య ముంబై లోకసభ నియోజకవర్గం శివసేనకు పెట్టనికోట. కానీ గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పరాజయం పాలైంది. ఇక్కడ గెలుపును సవాలుగా తీసుకున్న శివసేన ఈసారి లోకసభ ఎన్నికల్లో సీనియర్ నాయకుడు మనోహర్ జోషీని కాదని రాహుల్ శెవాలేను బరిలోకి దింపింది. శివసేన అభ్యర్థిగా తాను మళ్లీ ఇక్కడ కాషాయ జెండాను ఎగరవేయడం చాలా ఆనందం కలిగించిందని రాహుల్ శెవాలే అన్నారు. శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే కలను సాకారం చేశాననే తృప్తి ఉందన్నారు. రాహుల్ శెవాలే తల్లి జయశ్రీ శెవాలే ఎమ్టీఎన్ఎల్ ఉద్యోగి కాగా, తండ్రి రమేష్ శెవాలే నౌకాదళం అధికారి. సివిల్ ఇంజనీర్ అయిన రాహుల్ శివసేనలో చేరి 2002లో కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత 2004లో అతనికి ప్రభాగ్ సమితి అధ్యక్షుని పదవి లభించింది. ఇలా ఒక్కో మెట్టుపైకి ఎదిగిన ఆయన 2005లో అణుశక్తినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఆయన మంచి పట్టు సాధించారు. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. -
అడుగు వెనక్కి..!
సాక్షి, ముంబై: లోక్‌సభ మాజీ స్పీకర్, శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి భవితవ్యంపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. ఈ సీనియర్ నాయకుడు ఆదివారం మాతోశ్రీకి వెళ్లి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లినట్టు చెబుతున్నప్పటికీ, జోషీ ఒక అడుగు వెనక్కి తగ్గారని భావిస్తున్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే ఎలా స్పందించారనేది మాత్రం తెలియరాలేదు. దాదర్ లోక్‌సభ సీటు విషయమై గత రెండు మూడు నెలలుగా జోషీ, శివసేనలో విభేదాలు ఏర్పడ్డాయి. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే స్మారకం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు. పార్టీలో నాయకత్వ లేమి కనిపిస్తోందంటూ పరోక్షంగా ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. మునుపటి మాదిరిగా శివసేనలో దూకుడు స్వభావమున్న నేతృత్వంలేదన్నారు. ఇది జరిగిన అనంతరం, అక్టోబర్ 13 నాటి దసరా ర్యాలీలో మనోహర్ జోషికి చేదు అనుభవం ఎదురయింది. సేన కార్యకర్తలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వేదికపై నుంచి లేచివెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఉద్ధవ్ ఠాక్రేపై తనకు ఎలాంటి కోపమూ లేదని, ఆయన నుంచి ఇంతవరకు పిలుపురాలేదని, వస్తే తప్పకుండా మాతోశ్రీ బంగ్లాకు వెళతానని మనోహర్ జోషీ చెబుతూ వస్తున్నారు. ఊహించని విధంగా జోషీ కొంత చల్లబడ్డట్టు కనిపిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని ఆదివారం మాతోశ్రీకి వెళ్లిన ఆయన ఉద్ధవ్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆర్పీఐ అధ్యక్షులు రామ్‌దాస్ అథవలే కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలిసింది. రాజకీయ చర్చలే వీ జరగలేదు.. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శుభాకంక్షలు తెలిపేందుకే తాను మాతోశ్రీకి వెళ్లినట్టు మనోహర్ జోషీ మీడియాకు తెలిపారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏదీ లేదన్నారు. దీపావళి సందర్భంగా శివసేన కార్యకర్తలు, నాయకులు కూడా మాతోశ్రీకి రావడంతో ఉద్ధవ్ ఠాక్రే జోషికి పెద్దగా సమయం కేటాయించలేకపోయరని తెలి సింది. అయినప్పటికీ వీరి భేటీ అనంతరం అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి. సేనలో మనోహర్ జోషీకి మళ్లీ మంచిరోజులు వచ్చినట్టేనా..? లేదా అనే విషయమై అందరి దృష్టి కేంద్రీకృతమయింది. ఇక ఆర్పీఐ అధిపతి రామ్‌దాస్ అథవలేకు ఉద్ధవ్ ఠాక్రే దీపావళిని పురస్కరించుకుని కానుక (హామీ) ఇచ్చినట్టు తెలిసింది. ఈసారి తనకు రాజ్యసభ సీటు లభిస్తుందని అథవలే విశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు మహాకూటమి కూడా అంగీకరించిందని తెలిపారు. -
శివసేనను విడిచిపోను : జోషి
సాక్షి, ముంబై: తాను శివసేన పార్టీని విడిచివెళతానన్నవి పుకార్లేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మనోహర్జోషి ప్రకటించారు. ఆయన మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తనకు ఎలాంటి కోపం లేదని, ఆయన నుంచి ఇంతవరకు పిలుపురాలేదని, వస్తే తప్పకుండా మాతోశ్రీ బంగ్లాకు వెళతానని జోషి చెప్పారు. శివసేన దసరా ర్యాలీలో అవమానానికి గురైన జోషి చాలా రోజుల తర్వాత ఆయన నోరు విప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శివాజీపార్క్ మైదానంలో దసరా రోజున జరిగిన ర్యాలీలో జోషికి అవమానం జరిగిన విషయం తెలిసిందే. ర్యాలీలో పథకం ప్రకారమే తన కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆయన ఆ తర్వాత ప్రకటించారు. ఆ రోజు వేదికపై కూర్చున్న లీలాధర్ డోకే విజ్ఞప్తి చేయడంతో తను వేదిక దిగి వెళ్లిపోయానని, తర్వాత మూడు రోజులపాటు ఖండాలాలో కుటుంబ సభ్యులతో గడిపానని చెప్పారు. పార్టీ తరఫున ఎక్కడి నుంచైనా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపారు. పార్టీ రాజ్యసభకు పంపినా తనకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. -
‘జోష్’ ఉండేనా!
సాక్షి, ముంబై: శివసేన పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు మనోహర్ జోషి దారేటూ అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతుంది. పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజార్టీ సభ్యులు అంటుండగా, అసంతృప్తి సద్దుమణిగి ఉద్ధవ్‌తో కలిసే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు. దసరా ర్యాలీ తర్వాత ఇప్పటివరకు ఉద్ధవ్, జోషి ఎదురెదురు పడి మాట్లాడుకున్న దాఖలాలు లేకున్నా త్వరలోనే పార్టీలో నెలకొన్న ఈ తుఫాన్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు. దీనికి వచ్చే నెల 14న వాంఖెడే స్టేడియంలో సచిన్ కెరీర్లో ఆడనున్న చివరి, 200వ టెస్టు మ్యాచ్ వేదిక కానుందని వార్తలు వినవస్తున్నాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే వీరు వీఐపీ గ్యాలరీలోనే తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలపైనే చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజక వర్గ అభ్యర్థిగా జోషిని ప్రకటించకపోవచ్చనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీనిపై ఉద్ధవ్‌ను కలిసి మాట్లాడగా ఆ స్థానంలో ఇప్పటివరకు ఏ అభ్యర్థిని బరిలోకి దింపాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. అప్పటినుంచి అసంతృప్తితో ఉంటున్న జోషికి ఇటీవల శివాజీపార్క్‌లో జరిగిన దసరా ర్యాలీలో కార్యకర్తల నుంచి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఆయన సభ నుంచి అర్థంతరంగా లేచి వెళ్లిపోవల్సి వచ్చింది. ఆ తర్వాత ఇరువురి మధ్య రాజీ కుదరడం గాని, భేటీ అయ్యే అవకాశాలు సన్నగిల్లినట్లేనని అందరూ భావించారు. అయితే సచిన్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెపుతున్నట్లు ప్రకటించడం, ఆ చివరి మ్యాచ్ వాంఖెడే స్టేడియంలో జరగనుండటంతో వీరిద్దరు ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే అవకాశాలున్నాయని ఊహగానాలు ఊపందుకున్నాయి. అక్కడ వీరి మధ్య రాజీ కుదరవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. సచిన్ ఆఖరు క్రికెట్ మ్యాచ్ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది.అయితే ఈ మ్యాచ్ తిలకించడానికి ఉద్ధవ్, జోషి హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా స్టేడియంలోని వీఐపీ గ్యాలరీలో ఇరువురు భేటీ అవుతుండవచ్చని భావిస్తున్నారు. ఇదిలాఉండగా దసరా ర్యాలీలో అవమానం భరించలేక వేదికపై నుంచి దిగి వెళ్లిపోయిన తర్వాత జోషి తన ఆవేదనను లిఖిత పూర్వకంగా ఉద్ధవ్‌కు వెల్లడించారు. అయినా ఉద్ధవ్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. దీంతో జోషి ఏం నిర్ణయం తీసుకుంటారు..? ఉద్ధవ్‌తో చర్చిస్తారా..? అనే అంశాలపై రాజకీయ నాయకులు తమకు ఇష్టమున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ చివరి క్రికెట్ మ్యాచ్ పుణ్యమా అని భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన జోషికి, ఎంసీఏ సభ్యుడైన ఉద్ధవ్‌కు కూడా ఆహ్వానం అందనుంది. దీంతో వీరు వీఐపీ బాక్స్‌లో ఎదురుపడనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుత ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఈ మ్యాచ్ తిలకించేందుకు విచ్చేయనున్నారు. పవార్ సమక్షంలో ఉద్ధవ్, జోషీలు భేటీ అవుతుండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.అయితే జోషితో ఎలాంటి సంప్రదింపులు, ఇక నుంచి ఆయనకు ఏ పదవులు ఇవ్వకూడదని ఉద్ధవ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జోషితో కనీసం చర్చలే కాదు. కనీసం ఆయన రాసిన లేఖకు సమాధానం ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారు. ఉద్ధవ్ వైఖరి ఇలాగే కొనసాగితే క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు స్టేడియానికి రాకపోవచ్చని తెలుస్తోంది. -
‘దసరా ర్యాలీ’లో అవమానంపై మనోహర్ జోషి
ముంబై : పార్టీ నిర్వహించిన దసరా ర్యాలీలో తనకు జరిగిన అవమానం ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి అన్నారు. దసరా ర్యాలీ సందర్భంగా శివాజీ పార్క్‌లో జోషీ వేదికపైన ఉండగా పార్టీ కార్యకర్తలు అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతడిని వేదిక దిగిపోవాలని డిమాండ్ చేశారు. దాంతో జోషి తప్పనిసరి పరిస్థితుల్లో వేదిక దిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే గత నాలుగు రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. మీడియాకు కూడా ముఖం చాటేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియా ముందుకు వచ్చారు. జోషీ మాట్లాడుతూ .. ‘ ఆ రోజు (దసరా ర్యాలీనాడు) జరిగిన సంఘటన పథకం ప్రకారమే జరిగింది. నాకు తెలుసు.. నేనంటే పడని పార్టీలోని కొందరు నాపై కుట్ర పన్ని ఆ పనిచేయించారు. అయితే దీంతో పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధం లేదు. ఏదేమైనా నేను ఎటువంటి తప్పు చేయలేదు. పార్టీలో 45 ఏళ్లుగా సేవలందిస్తున్నాను. నేను అజ్ఞాతంలోకి వెళ్లిపోయానన్న వార్తలు అవాస్తవం. అవి కొందరు సృష్టించిన పుకార్లు మాత్రమే. నాకు సంబంధించిన కోహినూర్ గ్రూప్ కేటరింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మూడు రోజులుగా నా కుటుంబసభ్యులతో గడిపాను. నా మూడేళ్ల మనుమడు అర్నవ్ కూడా నాతో ఉన్నాడు.. అలాంటప్పుడు నేను అజ్ఞాతంలో ఉన్నానని అనడం అనాలోచితం..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉద్ధవ్‌కు గురువారం ఒక లేఖ రాశాను. అందులో వాస్తవాలు వివరించాను. ఎవరినీ క్షమాపణ కోరే ప్రసక్తే లేదు..’ అని జోషి స్పష్టం చేశారు. ‘నేను చేసిన దాంట్లో అసత్యాలు ఏమీ లేవనే నేను భావిస్తున్నాను.. నిజం చెప్పడం నేరమైతే.. నేను చేసింది నేరమే.. నా వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను..’ అని కుండబద్దలు కొట్టారు. ఉద్ధవ్‌కు రాసిన లేఖలో విషయాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..‘ లేఖలో సారాంశాన్ని నేను మీకు వివరించలేను.. అది నాకు, ఆయనకు మధ్య సంబంధించినది.. ఆ రోజు దసరా ర్యాలీలో జరిగిన విషయంతో నేను ఎంత మనస్తాపానికి గురయ్యానో పార్టీ అధినేతగా అతడికి వివరించాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. అప్పుడు అలా జరిగుండాల్సింది కాదని నా అభిప్రాయం..’ అని జోషి ముక్తాయించారు. -
యువతకు మార్గదర్శకంగా నిలవండి
సాక్షి, ముంబై: శివసేనలో అసంతృప్తితో కొనసాగే కంటే యువతరానికి మార్గదర్శకుడిగా నిలవడానికి కృషి చేయాలని సీనియర్ నాయకుడు మనోహర్ జోషికి ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే హితబోధ చేశారు. ఠాణేలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘గత సంవత్సరం నవంబర్‌లో శివసేన అధినేత బాల్‌ఠాక్రే అంత్యక్రియలు శివాజీపార్కు మైదానంలో జరి గాయి. ఈ తంతు పూర్త్తయిన రెండు, మూడు రోజుల్లోనే అదే మైదానంలో ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని జోషీ డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించకుండా ఇలా తొందరపడి డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదు. జోషీ డిమాండ్‌తో ఇటు ఉద్ధవ్‌ను అటు పార్టీని ఇబ్బందుల్లో పడేసింది’ అని అన్నారు. . జోషీ పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఉద్ధవ్ తప్పకుండా క్షమించే అవకాశాలున్నాయని, పార్టీని విడనాడవద్దు’’ అని జోషీకి అఠవలే సలహా ఇచ్చారు. శివసేన నేతృత్వంపై జోషీ బహిరంగంగా విమర్శలు చేసిన ఫలితంగా శివసైనికుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. శివాజీ పార్కు మైదానంలో జరిగిన దసరా ర్యాలీలో జోషీకి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలుచేసి ఆయన తనంతట తానుగా వేదిక దిగిపోయేలా చేశారు. దీంతో జోషీ రాజకీయ భవితవ్యమేమిటనే అంశంపై వివిధ పార్టీల నాయకులు బేరీజు వేసుకుంటున్నారు. ఇదిలాఉండగా ఏ లోక్‌సభ నియోజక వర్గం కావాలంటూ జోషి ఇంత రాద్ధాంతం సృష్టించారో అదే నియోజక వర్గాన్ని శివసేన, బీజేపీలో మిత్రపక్షంగా కొనసాగుతున్న ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే డిమాండ్ చేయడంతో కొత్త వివాదానికి దారితీసే పరిస్థితి నెలకొంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ మధ్య ముంబై, కల్యాణ్, పుణే, సాతారా, రామ్‌టెక్, వర్ధా స్థానాలు కావాలని ఆఠవాలే డిమాండ్ చేశారు. ఇం దులో కనీసం మూడు లోక్‌సభ నియోజక వర్గాలు, ఒక రాజ్యసభ స్థాన ం ఇవ్వాలని పట్టుబట్టనున్నట్లు అఠవాలే చెప్పారు. వచ్చే వారంలో తను ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండేలతో సమావేశమవుతానన్నారు. అప్పుడే పోటీ చేసే నియోజక వర్గాల విషయంలో తుది నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు. -
అజ్ఞాతంలోకి!
సాక్షి, ముంబై: కొద్ది రోజులుగా శివసేన పార్టీలో అసంతృప్తితో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు మనోహర్ జోషి గత 24 గంటల నుంచి ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన సెల్‌కు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వస్తోంది తప్పితే వేరే సమాధానం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు..? ఎవరితో కలిసి ఎక్కడికి వెళ్లారనేది అంతుచిక్కడం లేదు. శివాజీపార్క్ మైదానంలో ఆదివారం రాత్రి శివసేన నిర్వహించిన దసరా ర్యాలీకి వివిధ ప్రముఖులతోపాటు జోషి కూడా హాజరయ్యారు. అప్పటికే ఆయన వైఖరిపై ఆగ్రహంతో ఉన్న పార్టీ కార్యకర్తలు జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనోహర్ జోషి హాయ్ హాయ్ అంటూ కేకలు వేశారు. వేదిక దిగి వెళ్లిపోవాలని గందరగోళం సృష్టించారు. దీంతో చేసేది లేక జోషి మౌనంగా వేదిక దిగి కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి నాట్ రీచబుల్ (అజ్ఞాతం)లో ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో నగరం విడిచి వెళ్లిపోయారు. స్వగ్రామమైన రాయ్‌గడ్ జిల్లా నాంద్వి వెళ్లినట్లు కొందరు చెబుతుండగా, ప్రస్తుతం ఆయన లోణావాలాలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు మరికొందరు చెబుతున్నారు. అయితే, ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. ఇదిలాఉండగా మనోహర్ జోషి మహారాష్ట్ర న వనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో తరుచూ సంప్రదించడంవల్ల ఆ పార్టీలో చేరుతుండవచ్చని వచ్చిన వ దంతులను ఆ పార్టీ నాయకులు కొట్టిపారేశారు. ఈ పుకార్లన్నీ మీడియా ద్వారా వచ్చినవేనని ఎమ్మెన్నెస్‌కు చెందిన ఓ సీనియర్ నాయకుడు అన్నారు. జోషి, రాజ్ ఠాక్రేల మధ్య కుటుంబ సంబంధాలున్నాయి. వీటికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆ నాయకుడు స్పష్టం చేశారు. ఎమ్మెన్నెస్ యువతకు సంబంధించిన పార్టీ. ఇందులో మనోహర్ జోషిలాంటి సీనియర్ నాయకున్ని ఎలా చేర్చుకోవాలనే ప్రశ్న తలెత్తుతోందని ఆయన అన్నారు. కాని ఉద్ధవ్‌కు వ్యతిరేకంగా జోషి అలా వ్యాఖ్యలు చేయకపోయుంటే బాగుండేదని ఆ నాయకుడు అభిప్రాయపడ్డారు. కాని జోషిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే అలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు. మొదలైన ఫిరాయింపులు.. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకుల ఫిరాయింపులు మొదలయ్యాయి. అనేకమంది మాజీ మంత్రులు, పదాధికారులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో తీర్థం పుచ్చుకోవడం మొదలుపెట్టారు. శివసేన ఉప నాయకుడు సంజయ్ ఘాడి, అతడి భార్య సంజనా ఘాడి, మాజీ కార్పొరేటర్ రాజా చౌగులే, కార్మిక యూనియన్ నాయకుడు నితిన్ జాదవ్, ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ సొదరుడు, మాజీ కార్పొరేటర్ కప్తాన్ మాలిక్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుడ్తర్కర్ తదితరులు సోమవారం ఎమ్మెన్నెస్‌లో చేరారు. పార్టీ నాయకులు తమను చిన్నచూపు చూడటం, వారి పనితీరుపై విసిగెత్తి ఎమ్మెన్నెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ ఠాక్రేతో పేర్కొన్నారు. శివ సైనికుల ఆగ్రహం సహేతుకమే.. ముంబై : దసరా ర్యాలీలో జోషికి జరిగిన అవమానంపై పలు పార్టీలు స్పందించాయి. ఒకప్పుడు శివసేనలో మనోహర్జోషికు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ప్రస్తుత ఎన్సీపీ నాయకుడు చగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ .. ‘జోషీ తీరుపై సైనికుల ఆగ్రహం సహేతుకమే.. ఆ పార్టీ అండే లేకుంటే జోషీ ముఖ్యమంత్రి పదవి అధిరోహించేవాడేకాదు.. అటువంటి పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిజమైన కార్యకర్తలు విని ఊరుకోరు కదా..’ అన్నారు. కాగా, జోషీ విషయం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానిక్రావ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. ‘జోసీ ఒక సీనియర్ నాయకుడు. ఏ పార్టీలోనూ ఇటువంటి సంఘటనలు వాంఛితం కాదు. అయితే అతడిపై కార్యకర్తల తీరు ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా మాత్రమే మేం చూస్తున్నాం..’ అని స్పందించారు. కాంగ్రెస్ మంత్రి నారాయణ్ రానే మాట్లాడుతూ ‘ జోషి వంటి నాయకుడికి ఆ పార్టీ ర్యాలీలో తీరని అవమానం జరిగింది. అతడు సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పనితీరును విమర్శించబట్టే ఆ పరిస్థితి ఎదురైంది’ అని అన్నారు. ర్యాలీలో జోషికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా ఉద్ధవ్, అతడి భార్య రష్మి, కుమారుడు ఆదిత్య కూడా వారిని వారించేందుకు ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నం ఫలించలేదు. చివరకు జోషి వేదిక దిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. -
జోషి తిరుగుబాటు
సాక్షి, ముంబై: దక్షిణ ముంబై సీటుకు పార్టీ అధిష్టానం హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న మాజీ లోకసభ స్పీకర్, శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఉద్ధవ్ నాయకత్వ సామర్థ్యంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. ఉద్ధవ్ ప్రభుత్వంతో మిలాఖతై అన్ని పనులూ చేయించుకుంటున్నారని, పోరాటాలు, ఉద్యమాలపై ఆయనకు విశ్వాసం లేదని విమర్శించారు. ఉద్ధవ్ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం లేదని, అంతా తానే చూసుకోవాలనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే తాను సేనలోనే కొనసాగుతానని, అధిష్టానం ఆదేశించిన చోటు నుంచే పోటీ చేస్తానని వివరణ ఇచ్చారు. బాల్‌ఠాక్రే మాదిరిగా నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరూ ప్రస్తుత శివసేనలో లేరని దాదర్‌లో శుక్రవారం పేర్కొన్నారు. మరోవైపు ఆయన శివసేనను వీడనున్న వార్తలకు మరింత బలం చేకూరేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయన పరోక్షంగా శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంపై సవాల్ విసిరారని పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దక్షిణ ముంబై లోకసభ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై మనోహర్ జోషి, శివసేన సీనియర్ నాయకుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలుమార్లు దక్షిణ ముంబై లోకసభ నియోజకవర్గం కావాలని డిమాండ్ చేయడంతోపాటు పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే భేటీతో అనంతరం మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ్ నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాల్‌ఠాక్రే స్మారకం ఏర్పాటు కాకపోవడానికి శివసేన నాయకత్వలోపమే కారణమన్నారు. ‘బాల్‌ఠాక్రే ఆ స్థానంలో ఉండి ఉంటే ప్రభుత్వాన్ని కూడా కూల్చేవారు. స్మారకం మాత్రం ఏర్పాటయ్యేదన్నారు. ఆయన మాదిరిగా దూకుడుగా పార్టీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాచేస్తే ఇప్పటి వరకు స్మారకం అయిపోయేది’ అని జోషి పేర్కొన్నారు. ఉద్ధవ్, రాజ్ ఒక్కటవ్వాలి... శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షులు రాజ్ ఠాక్రేలిద్దరూ ఒక్కటవ్వాలని మనోహర్ జోషి పిలుపునిచ్చారు. ‘రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు ఒకే విషయంపై పోరాడుతున్నారు. వారిద్దరి లక్ష్యాలు ఒక్కటే. కేవలం పనిచేసే తీరు వేరు. అందుకే వీరిద్దరూ ఒక్కటవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాల్‌ఠాక్రే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వీరిద్దరు కూడా ఆదే చేస్తున్నారు. అయితే ఒక్కటిగా చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఉద్ధవ్‌తో భేటీ అయిన జోషి దాదర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోషి.. ఉద్ధవ్‌తో శనివారం ఆయన నివాసం మాతోశ్రీలోనే భేటీ అయ్యారు. ఈ వీరిద్దరి మధ్య చర్చల వివరాలు వెల్లడి కాలేదు. అయితే జోషి వ్యాఖ్యలపై సేన సీనియర్ నాయకులు రామ్‌దాస్ కదమ్, ఏక్నాథ్ షిండే తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. పార్టీ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, పదవులపై వ్యామోహంతోనే జోషి ఆ వ్యాఖ్యలు చేశారని కదమ్ విమర్శించారు. నేడు శివసేన దసరా ర్యాలీ సాక్షి, ముంబై: శివసేన అధినేత బాల్‌ఠాక్రే మరణానంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన దసరా ర్యాలీ కోసం ఈ పార్టీ సిద్ధమయింది. ర్యాలీ ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ప్రతి ఏటా దసరా ర్యాలీలో దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే ప్రసంగం వినడానికి భారీగా జనం వచ్చేవారు. ఈసారి ఆయన లేని వెలితి స్పష్టంగా కనిపించవచ్చని తెలుస్తోంది. అయితే ఆయన స్థానంలో ఉన్న శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ఠాక్రే ఈసారి తన ప్రసంగంతో ఏ మేరకు ఆకట్టుకుంటారు ? ఏయే అంశాలపై మాట్లాడనున్నారనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆదివారం జరగనున్న దసరా ర్యాలీపై దృష్టి పెట్టారని చెప్పవచ్చు. గత 48 సంవత్సరాలుగా ఒకటి రెండు ఘటనలు మినహా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దసరా ర్యాలీ జరుగుతోంది. ఇది శివసేనకు ఆనవాయితీగా మారింది. బాల్‌ఠాక్రే సందేశాన్ని వినేందుకు ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలివచ్చేవారు. ఈసారి కూడా శివాజీపార్క్ ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు వస్తారా లేదా అనేది వేచిచూడాల్సిందే. ఈసారి ర్యాలీ నిర్వహించేందుకు బీఎంసీ నుంచి అనుమతి లభించదని, సేన ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోకతప్పదని అంతా భావించారు. అయితే ఎట్టకేలకు హైకోర్టు ర్యాలీ నిర్వహించుకోవడానికి అనుమతి మంజూరు చేయడంతో సేన ఊపిరిపీల్చుకుంది. ఈ అనుమతి లభించడానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా సహకరించారని తెలుస్తోంది. భారీ భద్రత...: ర్యాలీకి భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. అనేక మంది పోలీసులను మోహరించనున్నారు. సేన కార్యకర్తలు కూడా దసరా ర్యాలీలో ఎవరికి ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కీలక ప్రాంతాల్లో నిఘా వేశారని సమాచారం. షరతులతో కూడిన అనుమతి లభించడంతో.. ఏ ఒక్క నియమాన్ని ఉల్లంఘించకుండా శివసేన జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు సభ వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. -
పవార్‌తో జోషి మంతనాలు
సాక్షి, ముంబై: శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి పార్టీ మారనున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ అనుమానం మరింత బలపడుతోంది. పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రేతో చెప్పాపెట్టకుండా గురువారం ఆయన రాజధానికి పయనం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమైన జోషి ఆ తర్వాత కొందరు బీజేపీ సీనియర్ నేతలతో కూడా సమావేశమైనట్లు చెప్పుకుంటున్నారు. దాదర్ లేదా కల్యాణ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని జోషి భావించినా అందుకు అవకాశాలు సన్నగిల్లడంతో ఆయన మనసు మార్చుకున్నట్లు పార్టీలోని కొందరు నేతలే చెప్పుకుంటున్నారు. కనీసం రాజ్యసభ సీటునైనా దక్కించుకోవాలనే ఆలోచనతోనే ఆయన ఢిల్లీకి పయనమైనట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా జోషి ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వెలువడ్డా స్వయంగా ఆయనే వాటిని ఖండించడంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. అయితే గురువారం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి పయనం కావడం చూస్తుంటే గతంలో వెలువడిన కథనాలే నిజమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవార్‌తో భేటీ ఎందుకు? ప్రస్తుతం నగరంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలతో వాతావరణం వేడిగా ఉంది. అసోసియేషన్ అధ్యక్ష పదవికి బీజేపీ నాయకుడు గోపినాథ్ ముండే కూడా పోటీ చేస్తున్నారు. దీంతో పవార్, ముండేల మధ్య పోటాపోటీగా సమరం సాగనుంది. కాగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మనోహర్ జోషి మాజీ అధ్యక్షుడు కావడంతో స్వయంగా పవారే, జోషిని పిలిపించినట్లు చెప్పుకుంటున్నారు. ఎంసీఏ గద్దెనెక్కేందుకు పవార్, జోషి మద్దతు తీసుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వీరిద్దరి భేటి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీకి రావడంతోనే రోజంతా ఓ హోటల్ గదికే పరిమితమైన జోషి సాయంత్రం బయటకు వచ్చి పవార్‌తో దాదాపు 40 నిమిషాలపాటు సమావేశమయ్యారు. అయితే ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఢిల్లీకి రాలేదని, అకస్మాత్తుగా రావాల్సి వచ్చిందని జోషి సన్నిహితులు మీడియాకు తెలిపారు. అయితే ఎందుకు వచ్చారన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు. -
జోషికి భవిష్యత్‌పై బెంగ
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి, లోక్‌సభ స్పీకర్ వంటి అనేక కీలక పదవులు చేపట్టిన శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ మధ్య ముంబై నుంచి టికెటు నిరాకరించడంతో పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే నన్ను అడగకుండానే అనేక పదవులు కట్టబెట్టారు. ఆయన కొడుకు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మాత్రం టికెట్‌ను కూడా నిరాకరించారు’ అని ఓ టీవీ చానెల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ శివసేనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల గణేశ్ ఉత్సవాల సమయంలో దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో బీఎంసీ స్థాయిసమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే హోర్డింగులు భారీ ఎత్తున ఏర్పాటు కావడంపై జోషి అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన మాతోశ్రీ బంగ్లాకు చేరుకుని ఉద్ధవ్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఉద్ధవ్ శేవాలేకు సర్దిచెబుతారని ఆయన భావించినా, అలా ఏమీ జరగలేదు. ఆ తరువాత ఉద్ధవ్ వీళ్లిద్దరినీ ఎదురుఎదురుగా కూర్చోబెట్టి చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి వాగ్వాదాలు వద్దంటూ సర్దిచెప్పారు. దీంతో శేవాలేకు మాతోశ్రీ అండ ఉందనే విషయం జోషికి తెలిసిపోయింది. లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో తన కు పూర్వవైభవం వస్తుందని జోషి విశ్వసిస్తున్నారు. ములాయంసింగ్, జయలలిత, మమతా బెనర్జీ వంటి నాయకులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని జోషి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అదృష్టం వరిస్తే తను రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అంతదూరం వెళ్లాలంటే ముందు ఇక్కడ టికెటు రావడం తప్పనిసరని జోషి వివరించారు. -
రాజ్ పంచన మనోహర్ జోషీ?
సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ పెద్ద ఎత్తున వదంతులు వస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి మనోహర్ జోషీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఆయననే బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. దీనికి ఊతమిచ్చే విధంగా రెండు నెలలక్రితం చర్చలు కూడా జరిగాయి. అయితే వినాయకచవితి ఉత్సవాల్లో ఒక్కసారిగా దక్షిణ ముంబైలో రాహుల్ శెవాలే పోస్టర్లు భారీగా దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయిన మనోహర్ జోషీ, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అనంతరం మనోహర్ జోషీ మీడియాకు చెప్పిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇంకా దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపాలనేది పార్టీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ నియోజకవర్గంతోపాటు ఠాణే, కళ్యాణ్ లోకసభ నియోజకవర్గం నుంచి దేన్ని కేటాయించినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను రాహుల్ శెవాలేకు ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్టు ఆయన మాటల ద్వారా అందరికీ తెలిసింది. దీన్నిబట్టి మనోహర్ జోషీ అసంతృప్తితో మాట్లాడారని, ఒక అడుగు వెనక్కివేసినట్టు అందరూ భావించారు. అయితే తాజాగా ఆయన ఎమ్మెన్నెస్బాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మనోహర్ జోషి, శివసేన పార్టీ నాయకులు ఎలా స్పందించనున్నారనేది తొందర్లోనే తేలనుంది. -
దక్షిణమధ్య ముంబై లోక్‌సభ సీటుపై ఓ అడుగు వెనక్కి..!
సాక్షి, ముంబై: దక్షిణ మధ్య ముంబై లోక్కసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పట్టుబట్టిన శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషీ ఓ అడుగు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ స్థానాన్ని రాహుల్ శెవాలేకు కేటాయించేందుకు శివసేన సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన తీరు దీనినే సూచిస్తోంది. తాను పోటీ చేయాలని భావించిన నియోజకవర్గంలో రాహుల్ శెవాలే బ్యానర్లు ఏర్పాటు కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మనోహర్ ఈ విషయమై బుధవారం ఉద్ధవ్‌తో సమావేశమయ్యారు. దీంతో రాహుల్ శెవాలేను కూడా పిలిపించి ఉద్ధవ్ మాట్లాడినట్టు తెలియవచ్చింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదంటూ పార్టీ అధిష్టానం తనకు తెలిపిందని మనోహర్ జోషి చెప్పారు. దక్షిణ మధ్య ముంబై, ఠాణే లేదా కళ్యాణ్ నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం నుంచి తాను పోటీ చేసేందుకు ఆస్కారం ఉందని చెప్పారు. దీంతో దక్షిణ మధ్య ముంబై నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థిగా రాహుల్‌కు ప్రాధాన్యమిచ్చిందని తెలుస్తోంది. శివసేనలోకి ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే మనోహర్ జాదవ్ శివసేనలో చేరనున్నారు. ఆ పార్టీ నిర్వహించే దసరా ర్యాలీలో హర్షవర్ధన్ అధికారికంగా చేరనున్నట్టు సమాచారం. హర్షవర్ధన్ జాదవ్ బుధవారం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కావడంతో ఈ విషయం స్పష్టమైంది. కన్నడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెన్నెస్ టికెట్‌పై విజయం సాధించిన హర్షవర్ధన్ 2013 ఆరంభంలోనే ఎమ్మెన్నెస్ నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో రాజ్ ఠాక్రేతోపాటు పార్టీపై అనేక ఆరోపణలు గుప్పించిన సంగతి విదితమే. -
దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ సీటు ఎవరికి?
సాక్షి, ముంబై: దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని రాహుల్ శెవాలేకు కేటాయించనున్నట్టు వచ్చిన వార్తలు శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషీని తీవ్ర అసంతృప్తికి లోనుచేశాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇదే సమయంలో రాహుల్ శెవాలే కు సంబంధించిన బ్యానర్లు దక్షిణ మధ్య ముంబై నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఈ వార్తలను మరింత బలపరిచాయి. ఈ విషయమై మనోహర్ జోషీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో మనోహర్ జోషీని బరిలోకి దింపే అంశంపై మూడు నెలలుగా పార్టీలో చర్చలు జరిగాయి. ఆ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపడం ఖాయమని అంతా భావించారు. అయితే ఠాణే లోక్‌సభ నియోజక వర్గం నుంచి మనోహర్‌ను బరిలోకి దింపే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ మధ్య ముంబై నుంచి రాహుల్‌ను బరిలోకి దింపనున్నారనే వార్తలు రావడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఈ అంశంపై మనోహర్‌తో చర్చలు జరిపేందుకు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే సిద్ధమైనట్టు తెలిసింది. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎవరికి కేటాయించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ అంశం మున్ముందు వివాదాస్పదంగా మారే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆసక్తి ఉందని, అందువల్ల దీనిని తమకు కేటాయించాలంటూ ఆర్పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ ఆఠవలే కూడా పేర్కొన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సీటు కేటాయింపు శివసేనకు తలనొప్పిగా పరిణమించే అవకాశం కూడా లేకపోలేదు. -
దక్షిణముంబై నుంచి జోషి పోటీ?
సాక్షి, ముంబై: శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషిని లోకసభ ఎన్నికల బరిలో దింపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ విషయమై సేనలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరాఠీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న శివసేనకు పెట్టనికోటగా భావించే దక్షిణ ముంబై లోకసభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు తెలిసింది. దీంతో మరాఠీ ఓట్లను చీల్చే సత్తా ఉన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్)ను కూడా అడ్డుకునేందుకు వీలుందని సేన భావిస్తోంది. శివసేనకు పట్టున్న దాదర్ ప్రాంతంలో ఎమ్మెన్నెస్ ప్రభావం కొంతమేర పెరిగింది. ఈ నేపథ్యంలో శివసేన ఇక్కడి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముందుగా కళ్యాణ్ లోకసభ నుంచి బరిలోకి దింపాలనుకున్న మనోహర్ జోషిని దక్షిణ ముంబై లోకసభ నుంచి బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. మనోహర్ జోషి సీనియర్ నాయకుడు కావడంతోపాటు రాజ్‌ఠాక్రేతో ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను బరిలోకి దింపితే, జోషికి వ్యతిరేకంగా ఎమ్మెన్నెస్ తమ అభ్యర్థిని బరిలోకి దింపబోదని భావిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా భావించే ఈ నియోజకవర్గాన్ని మనోహర్ జోషి కోసం ఎమ్మెన్నెస్ వదులుకుంటుందా అనేది మాత్రం సందేహాస్పదమే. ముందుగా భావించినట్టు సురేష్ ప్రభు, సంజయ్ రావుత్, సూర్యకాంత్ మాడిక్ను కాకుండా మనోహర్ జోషిని బరిలోకి శివసేన దింపుతుందా..? అనే విషయంపై సేన ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే దక్షిణ ముంబై నుంచే తానూ పోటీ చేస్తానని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధిపతి రాందాస్ అథవలె చెబు తున్నారు. ఆర్పీఐ మహాకూటమిలో భాగస్వామి కావడంతో శివసేన ఈ ప్రతిపాదనకు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. గత ఎన్నికల్లో అథవలె ఓటమిపాలు కావడంతో ఈసారి దక్షిణ ముంబై నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీ కూడా మహాకూటమిలో భాగస్వామి అనే విషయం తెలిసిందే.