ముంబై : పార్టీ నిర్వహించిన దసరా ర్యాలీలో తనకు జరిగిన అవమానం ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి అన్నారు. దసరా ర్యాలీ సందర్భంగా శివాజీ పార్క్‌లో జోషీ వేదికపైన ఉండగా పార్టీ కార్యకర్తలు అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతడిని వేదిక దిగిపోవాలని డిమాండ్ చేశారు. దాంతో జోషి తప్పనిసరి పరిస్థితుల్లో వేదిక దిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే గత నాలుగు రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. మీడియాకు కూడా ముఖం చాటేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియా ముందుకు వచ్చారు. జోషీ మాట్లాడుతూ .. ‘ ఆ రోజు (దసరా ర్యాలీనాడు) జరిగిన సంఘటన పథకం ప్రకారమే జరిగింది. నాకు తెలుసు.. నేనంటే పడని పార్టీలోని కొందరు నాపై కుట్ర పన్ని ఆ పనిచేయించారు. అయితే దీంతో పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధం లేదు. ఏదేమైనా నేను ఎటువంటి తప్పు చేయలేదు. పార్టీలో 45 ఏళ్లుగా సేవలందిస్తున్నాను. నేను అజ్ఞాతంలోకి వెళ్లిపోయానన్న వార్తలు అవాస్తవం.
అవి కొందరు సృష్టించిన పుకార్లు మాత్రమే. నాకు సంబంధించిన కోహినూర్ గ్రూప్ కేటరింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మూడు రోజులుగా నా కుటుంబసభ్యులతో గడిపాను. నా మూడేళ్ల మనుమడు అర్నవ్ కూడా నాతో ఉన్నాడు.. అలాంటప్పుడు నేను అజ్ఞాతంలో ఉన్నానని అనడం అనాలోచితం..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉద్ధవ్‌కు గురువారం ఒక లేఖ రాశాను. అందులో వాస్తవాలు వివరించాను. ఎవరినీ క్షమాపణ కోరే ప్రసక్తే లేదు..’ అని జోషి స్పష్టం చేశారు. ‘నేను చేసిన దాంట్లో అసత్యాలు ఏమీ లేవనే నేను భావిస్తున్నాను.. నిజం చెప్పడం నేరమైతే.. నేను చేసింది నేరమే.. నా వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను..’ అని కుండబద్దలు కొట్టారు. ఉద్ధవ్‌కు రాసిన లేఖలో విషయాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..‘ లేఖలో సారాంశాన్ని నేను మీకు వివరించలేను.. అది నాకు, ఆయనకు మధ్య సంబంధించినది.. ఆ రోజు దసరా ర్యాలీలో జరిగిన విషయంతో నేను ఎంత మనస్తాపానికి గురయ్యానో పార్టీ అధినేతగా అతడికి వివరించాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. అప్పుడు అలా జరిగుండాల్సింది కాదని నా అభిప్రాయం..’ అని జోషి ముక్తాయించారు.
‘దసరా ర్యాలీ’లో అవమానంపై మనోహర్ జోషి
Published Sat, Oct 19 2013 12:01 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
Advertisement