దక్షిణ మధ్య ముంబై లోక్‌కసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పట్టుబట్టిన శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషీ ఓ అడుగు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
సాక్షి, ముంబై: దక్షిణ మధ్య ముంబై లోక్‌కసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పట్టుబట్టిన శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషీ ఓ అడుగు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ స్థానాన్ని రాహుల్ శెవాలేకు కేటాయించేందుకు శివసేన సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన తీరు దీనినే సూచిస్తోంది. తాను పోటీ చేయాలని భావించిన నియోజకవర్గంలో రాహుల్ శెవాలే బ్యానర్లు ఏర్పాటు కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మనోహర్ ఈ విషయమై బుధవారం ఉద్ధవ్‌తో సమావేశమయ్యారు.
దీంతో రాహుల్ శెవాలేను కూడా పిలిపించి ఉద్ధవ్ మాట్లాడినట్టు తెలియవచ్చింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదంటూ పార్టీ అధిష్టానం తనకు తెలిపిందని మనోహర్ జోషి చెప్పారు. దక్షిణ మధ్య ముంబై, ఠాణే లేదా కళ్యాణ్ నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం నుంచి తాను పోటీ చేసేందుకు ఆస్కారం ఉందని చెప్పారు. దీంతో దక్షిణ మధ్య ముంబై నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థిగా రాహుల్‌కు ప్రాధాన్యమిచ్చిందని తెలుస్తోంది.
శివసేనలోకి ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే
ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే మనోహర్ జాదవ్ శివసేనలో చేరనున్నారు. ఆ పార్టీ నిర్వహించే దసరా ర్యాలీలో హర్షవర్ధన్ అధికారికంగా చేరనున్నట్టు సమాచారం. హర్షవర్ధన్ జాదవ్ బుధవారం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కావడంతో ఈ విషయం స్పష్టమైంది. కన్నడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెన్నెస్ టికెట్‌పై విజయం సాధించిన హర్షవర్ధన్ 2013 ఆరంభంలోనే ఎమ్మెన్నెస్ నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో రాజ్ ఠాక్రేతోపాటు పార్టీపై అనేక ఆరోపణలు గుప్పించిన సంగతి విదితమే.