సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ పెద్ద ఎత్తున వదంతులు వస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి మనోహర్ జోషీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఆయననే బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. దీనికి ఊతమిచ్చే విధంగా రెండు నెలలక్రితం చర్చలు కూడా జరిగాయి. అయితే వినాయకచవితి ఉత్సవాల్లో ఒక్కసారిగా దక్షిణ ముంబైలో రాహుల్ శెవాలే పోస్టర్లు భారీగా దర్శనమిచ్చాయి.
దీంతో అవాక్కయిన మనోహర్ జోషీ, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అనంతరం మనోహర్ జోషీ మీడియాకు చెప్పిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇంకా దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపాలనేది పార్టీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ నియోజకవర్గంతోపాటు ఠాణే, కళ్యాణ్ లోకసభ నియోజకవర్గం నుంచి దేన్ని కేటాయించినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను రాహుల్ శెవాలేకు ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్టు ఆయన మాటల ద్వారా అందరికీ తెలిసింది. దీన్నిబట్టి మనోహర్ జోషీ అసంతృప్తితో మాట్లాడారని, ఒక అడుగు వెనక్కివేసినట్టు అందరూ భావించారు. అయితే తాజాగా ఆయన ఎమ్మెన్నెస్‌బాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మనోహర్ జోషి, శివసేన పార్టీ నాయకులు ఎలా స్పందించనున్నారనేది తొందర్లోనే తేలనుంది.
రాజ్ పంచన మనోహర్ జోషీ?
Published Sun, Sep 29 2013 12:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement