Rahul Shewale
-
లోక్‌సభలో ‘సేన’ నేతగా రాహుల్ షెవాలే: షిండే
న్యూఢిల్లీ: లోక్‌సభలో శివసేన పార్టీ నాయకుడిగా రాహుల్ షెవాలేను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో ప్రస్తుతం శివసేనకు 19 మంది సభ్యులుండగా షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే సహా 12 మంది మంగళవారం స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. లోక్‌సభలో తమ పార్టీ నేతగా వినాయక్ రౌత్ స్థానంలో రాహుల్ షెవాలేను గుర్తించాలని కోరారు. ఇందుకు స్పీకర్ సమ్మతించారని హేమంత్ గాడ్సే అనే ఎంపీ తెలిపారు. ఇలా ఉండగా, వినాయక్ రౌత్ సోమవారం రాత్రి స్పీకర్ ఓం బిర్లాను కలిసి శివసేన పార్లమెంటరీ పార్టీ నేతగా తనను, పార్టీ చీఫ్ విప్‌గా రాజన్ విచారేను గుర్తించాలని వినతి పత్రం అందజేయడం గమనార్హం. షిండే వర్గంలోకి ఆ 12 మంది ఎంపీలు.. లోక్‌సభలో శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా.. మహారాష్ట్రలోనే 18 మంది ఉన్నారు. ఏక్నాథ్ షిండేతో సోమవారం వర్చువల్ సమావేశానికి సుమారు 12 మంది ఎంపీలు హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏక్నాథ్ షిండేకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో 12 మంది ఎంపీలకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. తమని ప్రత్యేక బృందంగా స్పీకర్ గుర్తించిన తర్వాత.. శివసేన గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు.. ‘వై’ కేటగిరి భద్రత ఏర్పాటు! -
‘సీఈవో’ అవసరం లేదు !
ముంబై: నగరానికి ప్రత్యేకంగా ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో)ను నియమించాలని చూడటం సబబు కాదని శివసేన విమర్శించింది. ముంబై అభివృద్ధికి సీఈవోను నియమించాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆలోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో శివసేన పైవిధంగా స్పందించింది. నగరానికి సీఈవోను ఏర్పాటుచేయడమంటే రాష్ట్రం నుంచి దాన్ని వేరుచేసినట్లే లెక్క.. అని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ ఎంపీ రాహుల్ షావలే తెలిపారు. నగరాభివృద్ధి శాఖ ద్వారా ముంబైని అభివృద్ధి చేసే విషయంలో సీఎంకు విశ్వాసం లేకనే ఈ విధంగా ఆలోచిస్తున్నారని ఆయన విమర్శించారు. నగరానికి రాష్ట్ర ముఖ్య కార్యదర్శితో సమాన హోదా ఉన్న మున్సిపల్ కమిషనర్ ఉన్నారని, ఆయనతో నగరాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించుకోవచ్చని సూచించారు. కాగా, శివసేన వ్యాఖ్యలను నగర బీజేపీ అధ్యక్షుడు అశిష్ శేలర్ ఖండించారు. ‘ శివసేన నగరానికి సీఈవో ఏర్పాటును అడ్డుకుంటే నగరాభివృద్ధిని అడ్డుకుంటున్నట్లేనని తాము భావించాల్సి ఉంటుందన్నారు. కాగా, నగరంలో పలు సంస్థల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను సమన్వయపరిచేందుకు అదనపు చీఫ్ సెక్రటరీతో సమాన హోదా కలిగిన సీఈవోను నియమించేందుకు యోచిస్తున్నట్లు సీఎం ఫడ్నవిస్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రాజ్ పంచన మనోహర్ జోషీ?
సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ పెద్ద ఎత్తున వదంతులు వస్తున్నాయి. అనేక సంవత్సరాలుగా దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి మనోహర్ జోషీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఆయననే బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. దీనికి ఊతమిచ్చే విధంగా రెండు నెలలక్రితం చర్చలు కూడా జరిగాయి. అయితే వినాయకచవితి ఉత్సవాల్లో ఒక్కసారిగా దక్షిణ ముంబైలో రాహుల్ శెవాలే పోస్టర్లు భారీగా దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయిన మనోహర్ జోషీ, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అనంతరం మనోహర్ జోషీ మీడియాకు చెప్పిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇంకా దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపాలనేది పార్టీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ నియోజకవర్గంతోపాటు ఠాణే, కళ్యాణ్ లోకసభ నియోజకవర్గం నుంచి దేన్ని కేటాయించినా తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను రాహుల్ శెవాలేకు ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్టు ఆయన మాటల ద్వారా అందరికీ తెలిసింది. దీన్నిబట్టి మనోహర్ జోషీ అసంతృప్తితో మాట్లాడారని, ఒక అడుగు వెనక్కివేసినట్టు అందరూ భావించారు. అయితే తాజాగా ఆయన ఎమ్మెన్నెస్బాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మనోహర్ జోషి, శివసేన పార్టీ నాయకులు ఎలా స్పందించనున్నారనేది తొందర్లోనే తేలనుంది. -
దక్షిణమధ్య ముంబై లోక్‌సభ సీటుపై ఓ అడుగు వెనక్కి..!
సాక్షి, ముంబై: దక్షిణ మధ్య ముంబై లోక్కసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పట్టుబట్టిన శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషీ ఓ అడుగు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ స్థానాన్ని రాహుల్ శెవాలేకు కేటాయించేందుకు శివసేన సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన తీరు దీనినే సూచిస్తోంది. తాను పోటీ చేయాలని భావించిన నియోజకవర్గంలో రాహుల్ శెవాలే బ్యానర్లు ఏర్పాటు కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మనోహర్ ఈ విషయమై బుధవారం ఉద్ధవ్‌తో సమావేశమయ్యారు. దీంతో రాహుల్ శెవాలేను కూడా పిలిపించి ఉద్ధవ్ మాట్లాడినట్టు తెలియవచ్చింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదంటూ పార్టీ అధిష్టానం తనకు తెలిపిందని మనోహర్ జోషి చెప్పారు. దక్షిణ మధ్య ముంబై, ఠాణే లేదా కళ్యాణ్ నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం నుంచి తాను పోటీ చేసేందుకు ఆస్కారం ఉందని చెప్పారు. దీంతో దక్షిణ మధ్య ముంబై నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థిగా రాహుల్‌కు ప్రాధాన్యమిచ్చిందని తెలుస్తోంది. శివసేనలోకి ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే మనోహర్ జాదవ్ శివసేనలో చేరనున్నారు. ఆ పార్టీ నిర్వహించే దసరా ర్యాలీలో హర్షవర్ధన్ అధికారికంగా చేరనున్నట్టు సమాచారం. హర్షవర్ధన్ జాదవ్ బుధవారం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కావడంతో ఈ విషయం స్పష్టమైంది. కన్నడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెన్నెస్ టికెట్‌పై విజయం సాధించిన హర్షవర్ధన్ 2013 ఆరంభంలోనే ఎమ్మెన్నెస్ నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో రాజ్ ఠాక్రేతోపాటు పార్టీపై అనేక ఆరోపణలు గుప్పించిన సంగతి విదితమే. -
దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ సీటు ఎవరికి?
సాక్షి, ముంబై: దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని రాహుల్ శెవాలేకు కేటాయించనున్నట్టు వచ్చిన వార్తలు శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషీని తీవ్ర అసంతృప్తికి లోనుచేశాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇదే సమయంలో రాహుల్ శెవాలే కు సంబంధించిన బ్యానర్లు దక్షిణ మధ్య ముంబై నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఈ వార్తలను మరింత బలపరిచాయి. ఈ విషయమై మనోహర్ జోషీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో మనోహర్ జోషీని బరిలోకి దింపే అంశంపై మూడు నెలలుగా పార్టీలో చర్చలు జరిగాయి. ఆ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపడం ఖాయమని అంతా భావించారు. అయితే ఠాణే లోక్‌సభ నియోజక వర్గం నుంచి మనోహర్‌ను బరిలోకి దింపే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ మధ్య ముంబై నుంచి రాహుల్‌ను బరిలోకి దింపనున్నారనే వార్తలు రావడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఈ అంశంపై మనోహర్‌తో చర్చలు జరిపేందుకు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే సిద్ధమైనట్టు తెలిసింది. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎవరికి కేటాయించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ అంశం మున్ముందు వివాదాస్పదంగా మారే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆసక్తి ఉందని, అందువల్ల దీనిని తమకు కేటాయించాలంటూ ఆర్పీఐ అధ్యక్షుడు రామ్‌దాస్ ఆఠవలే కూడా పేర్కొన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సీటు కేటాయింపు శివసేనకు తలనొప్పిగా పరిణమించే అవకాశం కూడా లేకపోలేదు.