తాను శివసేన పార్టీని విడిచివెళతానన్నవి పుకార్లేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌జోషి ప్రకటించారు.
సాక్షి, ముంబై: తాను శివసేన పార్టీని విడిచివెళతానన్నవి పుకార్లేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌జోషి ప్రకటించారు. ఆయన మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తనకు ఎలాంటి కోపం లేదని, ఆయన నుంచి ఇంతవరకు పిలుపురాలేదని, వస్తే తప్పకుండా మాతోశ్రీ బంగ్లాకు వెళతానని జోషి చెప్పారు. శివసేన దసరా ర్యాలీలో అవమానానికి గురైన జోషి చాలా రోజుల తర్వాత ఆయన నోరు విప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
శివాజీపార్క్ మైదానంలో దసరా రోజున జరిగిన ర్యాలీలో జోషికి అవమానం జరిగిన విషయం తెలిసిందే. ర్యాలీలో పథకం ప్రకారమే తన కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆయన ఆ తర్వాత ప్రకటించారు. ఆ రోజు వేదికపై కూర్చున్న లీలాధర్ డోకే విజ్ఞప్తి చేయడంతో తను వేదిక దిగి వెళ్లిపోయానని, తర్వాత మూడు రోజులపాటు ఖండాలాలో కుటుంబ సభ్యులతో గడిపానని చెప్పారు. పార్టీ తరఫున ఎక్కడి నుంచైనా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపారు. పార్టీ రాజ్యసభకు పంపినా తనకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.