మేమే పులులం
సాక్షి, ముంబై: బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీనే అసలైందని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే అన్నారు. నవ నిర్మాణ పార్టీగా అభివర్ణించారు. మధ్యలో పుట్టుకొచ్చిన పార్టీ ఒకటి తామే ప్రధానం అన్నట్టుగా వ్యవహరించడాన్ని పరోక్షంగా ఎమ్మెన్నెస్ అధినేత రాజ్‌ఠాక్రేపై విమర్శలు చేశారు. నవీముంబై ఐరోలిలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ...నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అమ్ముడుపోయేదని, తిరుగుబాటుదారుల పార్టీ అని ఆరోపించారు. శివసేనను వీడి ఎన్సీపీలో చేరిన నార్వేకర్‌తోపాటు ఇతర తిరుగుబాటుదారులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇక రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ పార్టీ ఎన్సీపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.
ఎమ్మెన్నెస్ గతంలో శివసేన అధినేత బాల్‌ఠాక్రే పేరుపై ఓట్లు అడిగేదని, ఇప్పుడు నరేంద్ర మోడీ పేరుపై ఓట్లు అడుగుతోందని ఎద్దేవా చేశారు. మేము హిందుత్వంపై మాట్లాడితే చర్యలు తీసుకుంటామంటారు. అయితే ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతున్న ఎంఐఎం నాయకుడు ఓవైసీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆత్మవిశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు.
మాదే విజయం....
లోక్‌సభ ఎన్నికల్లో శివసేన-బీజేపీ-ఆర్‌పీఐ-స్వాభిమాని పార్టీల మహాకూటమి విజయం సాధిస్తుందని ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. నరేంద్ర మోడీకి తమ మద్దతు ఉంటుందన్నారు. తమ కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు. ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమికి ఓటమి తప్పదన్నారు. అవినీతి కుంభకోణాలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు. ఎమ్మెన్నెస్‌ను అడ్డుపెట్టుకొని గతంలోలాగానే దెబ్బకొట్టాలనుకుంటున్నారని, అది ఈసారి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎవరెన్ని చేసినా మహాకూటమి విజయాన్ని మాత్రం ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీకి చురకలంటించిన ఉద్ధవ్
బీజేపీ సీనియర్ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ అభ్యర్థి విషయమై నెలకొన్న వివాదంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే తలదూర్చి అనేక సవాళ్లు బీజేపీ ముందుంచారు. నరేంద్ర మోడీ యుగం ప్రారంభమైందంటే లాల్‌కృష్ణ అద్వాని యుగం ముగిసినట్లు కాదని (అస్తమించలేదు) ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. సామ్నా దిన పత్రిక శనివారం సంపాదకీయంలో అద్వానీ అభ్యర్థి విషయంపై బీజేపీ వహిస్తున్న వైఖరిపై తనదైన శైలిలో మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా పరిశీలిస్తే శివసేన, బీజేపీలో నెలకొన్న వివాదం తగ్గినట్టు కన్పించడంలేదు.
ఇరు పక్షాలు ఏమీలేదని చెబుతున్నప్పటికీ పలుమార్లు ఆయా నాయకుల ప్రకటనల ద్వారా ఇరుపక్షాల మధ్య విభేదాలున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేతో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి భేటీ అయిన అనంతరం ఇలాంటి సంఘటనలు అధికమయ్యాయి. తాజాగా తమ మిత్రపక్షమైన బీజేపీకి శివసేన ఉద్ధవ్‌ఠాక్రే తనదైన శైలిలో సూచనలిస్తూనే చురకలంటించారు.
‘విషయం చిన్నది, దుర్ఘటన పెద్దది’ (గోష్ట్ చోటి, దుర్ఘటన మోటి’ అనే శీర్షికతో సంపాదకీయాన్ని ప్రచురించారు. సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీని అభ్యర్థిగా ప్రకటించడంలో ఎందుకు ఆలస్యమైనట్టు ఆయన ప్రశ్నించారు. అద్వానీ స్థానం ఇప్పటికీ బీజేపీలో ఇంకా చాలా గౌరవప్రదమైనది, కీలకమైనదన్నారు.
ఇక ముందు కూడా ఇదేవిధంగా ఉంటుందని చెప్పారు. ఇది చెప్పడానికి కారణం అద్వానీ విషయం చాలా చిన్నదిగా కన్పిస్తున్నా, పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని సూచించారు. బీజేపీని పరోక్షంగా హెచ్చరించారు. బీజేపీని బలోపేతం చేయడంలో అద్వానీ పాత్ర కీలకమన్నది మరవద్దన్నారు. ఇలా అద్వానీపై ప్రశంసల జల్లులు కురిపిస్తూనే, మరోవైపు బీజేపీకి చురకలంటించారు.