shiv sena party
-
శివసేన సర్కారు దూకుడు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మరణించి నప్పటినుంచి రాజుకుంటున్న వివాదం అనేకానేక మలుపులు తిరిగి చివరకు మంగళవారం అతని స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి అరెస్టుకు దారితీసింది. అది జరిగిన మరునాడే నటి కంగనా రనౌత్ నివాసం ఆవరణలో అనుమతుల్లేని నిర్మాణాలున్నాయంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేతలు మొదలుపెట్టడం, ముంబై హైకోర్టు ఆదేశాలతో మధ్యలో అవి నిలిచి పోవడం, ఆ విషయంలో శివసేనపై కంగనా విరుచుకుపడటం వంటి పరిణామాలన్నీ చకచకా జరిగాయి. రియా చక్రవర్తి అరెస్టుతో సుశాంత్ మరణంపై రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని అందరూ అనుకునేలోగానే ఇప్పుడు కంగనా ఇంటి కూల్చివేత వివాదం ఎజెండాలో కొచ్చింది. ఈ రెండు ఉదంతాలూ పరస్పర సంబంధమైనవి కాకపోయివుంటే ఈ కూల్చివేత ఇంత ఆదరా బాదరాగా జరిగేది కాదు. అలాగే ఇంత ప్రముఖంగా చర్చకొచ్చేది కూడా కాదు. ఎందుకంటే ఇంతక్రితం షారుఖ్ ఖాన్, సోనూసూద్ వంటి బాలీవుడ్ ప్రముఖుల నివాసాల్లో సైతం బీఎంసీ అక్రమ నిర్మాణాల పేరిట కొన్నింటిని కూల్చివేసింది. ఇటీవలకాలంలో శివసేనపై, ముంబై మహా నగరంపై కంగనా చేస్తున్న వ్యాఖ్యానాలు ఆ పార్టీకి ఆగ్రహం కలిగిస్తున్నాయి. సుశాంత్‌సింగ్ కేసులో ముంబై పోలీసుల వ్యవహారశైలిని ఆక్షేపిస్తూ ఆ నగరాన్ని కంగనా పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారు. ఇక్కడ జీవనం సాగించాలంటే భయంగా వుందని వ్యాఖ్యానించారు. అందుకు జవాబుగా శివసేన సైతం ఆమెపై నోరు పారేసుకుంది. దాంతో తన ప్రాణాలకు ముప్పువుందంటూ ఆమె కేంద్రానికి విన్నవించుకుని వై ప్లస్ సెక్యూరిటీ కూడా సాధించుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసిన ప్పుడు శివసేన ప్రతీకారం ఏ స్థాయిలో వుంటుందో అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నందువల్లా, ఆ అధికారాన్ని ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో పంచుకుంటూన్నందువల్లా ఆ పార్టీ ఈసారి భౌతిక దాడులకు బదులు వాగ్యుద్ధానికి మాత్రమే పరిమితమైంది. కానీ అధికారాన్ని విని యోగించి తన చేతనైంది చేయడానికి సిద్ధపడింది. దాని పర్యవసానమే బుధవారంనాటి కూల్చివేత. కంగనా బంగ్లాలో కొన్ని అక్రమ నిర్మాణాలున్నాయని బీఎంసీ మొన్న సోమవారం ఆమెకు నోటీసులు జారీ చేసింది. అది అవాస్తవమని ట్విటర్లో కంగనా జవాబిచ్చారు. ఆమె సిబ్బంది కూడా బీఎంసీకి లిఖితపూర్వక సమాధానం పంపారు. అది అందుకున్న వెంటనే బుధవారం ఉదయం బీఎంసీ కూల్చివేత మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి స్టే రావడంతో అది తాత్కాలికంగా నిలిచింది. ముంబై మహానగరంలో అధికారుల కుమ్మక్కు కారణంగా అనేకానేక అక్రమ నిర్మాణాలు బయల్దేరు తున్నాయని, పర్యవసానంగా వర్షాకాలంలో నగరం వరదల్లో చిక్కుకుంటున్నదని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న నిర్మాణాలు నగరంలో నిరుపేదలు, సాధారణ పౌరుల బతుకుల్ని నరకప్రాయం చేస్తున్నాయని వారంటున్నారు. కనుక అక్రమ నిర్మాణాలు కూల్చేయాల్సిందే. కానీ అందుకు తగిన విధివిధానాలు అనుసరించాలి తప్ప ఇష్టానుసారం చేయడం ఎవరూ హర్షించరు. ఇది హఠాత్తుగా చేసింది కాదని...ఆమెకు 2018లోనే నోటీసులిచ్చామని బీఎంసీ చెబుతోంది. అది నిజమే కావొచ్చు... కానీ దానిపై ఆమె కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఇచ్చిన నోటీసుకు సైతం కంగనా సిబ్బంది జవాబిచ్చారు. ఆ వెంటనే కూల్చివేత ప్రారంభించాల్సిన అగత్యం ఏమొచ్చిందో బీఎంసీ సంతృప్తికరమైన జవాబివ్వలేక పోతోంది. ఒకపక్క ఆమెకూ, శివసేనకూ మధ్య వివాదం రాజుకుని తారస్థాయికి వెళ్లిన సమయంలో ఇది చోటుచేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది వేధింపుగానే అందరూ భావిస్తారు. ఈ వివాదం మొత్తానికి మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు. సుశాంత్ మరణానికి మానసిక ఒత్తిళ్లే కారణమని, ఇలాంటి ఒత్తిళ్లను అయినవాళ్లు సకాలంలో గుర్తించకపోతే బాధితులు ఆత్మహత్య చేసుకునేవరకూ వెళ్తారని చానెళ్ల నిండా నిపుణులు చర్చిస్తున్న సమయంలో కంగనా రనౌత్ రంగ ప్రవేశం చేసి పూర్తి భిన్నమైన కథనం వినిపించారు. బాలీవుడ్లో బంధుప్రీతిని ప్రోత్సహించే మూవీ మాఫియా అతన్ని మృత్యు ఒడిలోకి నెట్టిందని ఆరోపించారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా వున్నదని ఆమె చెప్పారు. ఆ తర్వాత మొత్తం మారిపోయింది. అది చూస్తుండగానే కంగనాకూ, శివసేనకూ... కంగనాకూ, ఇతర బాలీవుడ్ నటీ మణులకూ మధ్య వివాదంగా మారింది. బిహార్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముంబై పోలీసులపై బురద జల్లుతున్నదని, వారి తరఫున కంగనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని శివసేన ఆరోపిస్తోంది. అందులో వాస్తవం కూడా ఉండొచ్చు. కానీ ఒక నటి చేసిన వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకుని, ఆమెపై కక్ష సాధిస్తున్నట్టు కనబడేలా వ్యవహరించడం శివసేన అపరిపక్వతను పట్టిచూపుతుంది. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. స్థానికుల ఉపాధి కాజేస్తున్నారన్న వంకతో స్థానికేతరులపై ఆ పార్టీ దాడులు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెస్తుంది. లాక్డౌన్ పర్యవసానంగా మన దేశంలో సామాన్యుల జీవనం ఎంత దుర్భరంగా మారిందో కళ్లకు కట్టే కథనాలు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. కరోనా మహమ్మారి జోరు ఇంకా తగ్గలేదు. కానీ మన మీడియా మాత్రం రెండున్నర నెలలుగా బాలీవుడ్ పరిధి దాటి బయటకు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా ఈ వివాదానికి తెరపడి జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అందరూ దృష్టి కేంద్రీకరిస్తే మంచిది. -
‘శివసేన సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానందస్వామి’
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి పేరును అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఖరారు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శివసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో శివసేన అభ్యర్థులు పోటీలో ఉంటారని పేర్కొన్నారు. -
అమితాబ్..అరడజను శత్రువులు
అమితాబ్ బచ్చన్ హీరోగా ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’ తీసిన రామ్‌గోపాల్ వర్మ ఆ సినిమాలకు కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ‘సర్కార్ 3’. తనకెంతో ఇష్టమైన హాలీవుడ్ చిత్రం ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో ‘సర్కార్’ ఫ్రాంచైజీలో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు వర్మ. అమితాబ్ నటించిన సుభాష్ నాగరే పాత్రను శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే తరహాలో ప్రజెంట్ చేశారు. మూడో చిత్రంలోనూ ఆయన సుభాష్ నాగరేగా కనిపించనున్నారు. ఇక అమితాబ్ కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యా రాయ్‌లు ‘సర్కార్ 3’లో నటించడం లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ముఖ్యమైన నటీనటుల ఫస్ట్ లుక్స్‌ను వర్మ విడుదల చేశారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ఇందులో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. చిత్రంలో ఆయన్ను అందరూ ‘సర్’ అని సంభోదిస్తారట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేశ్, మహేశ్‌బాబులకు నానమ్మగా నటించిన రోహిణీ హట్టంగడి ఈ చిత్రంలో రక్కుబై దేవిగా విలనిజం చూపించనున్నారు. గోరక్ రాంపూర్గా రెండు పార్శ్వాలున్న పాత్రలో భరత్ దభోల్కర్... తన తండ్రి చావుకి కారణమైన సుభాష్ నాగరేపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూసే పాత్రలో హీరోయిన్ యామీ గౌతమ్.. సుభాష్ నాగరే అనుచరుడిగా రోనిత్ రాయ్ నటిస్తున్నారని వర్మ తెలిపారు. అత్యంత క్రూరుడైన శివాజీ అలియాస్ చీకు పాత్రలో యువ నటుడు అమిత్ సాద్ కనిపించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరహా పాత్రను మనోజ్ బాజ్‌పాయ్ చేయనున్నారు. ‘‘కాకపోతే.. ఇది కాస్త వయొలెంట్ వెర్షన్’’ అన్నారు వర్మ. ‘‘మనోజ్ అద్భుతమైన నటుడే కానీ అరవింద్ కేజ్రీవాల్ కంటే నటనలో చాలా చిన్నోడు’’ అని వర్మ వ్యాఖ్యానించడం కొసమెరుపు. రోనిత్ రాయ్ మినహా వర్మ పరిచయం చేసిన మిగతా ఆరు పాత్రలూ ప్రతినాయక ఛాయలున్నవి కావడం గమనార్హం. సో.. ఇందులో అమితాబ్‌కు మొత్తం అరడజను మంది విలన్లు ఉంటారన్నమాట. -
త్వరలో ‘మరాఠా’ పేరుతో ఎమ్మెన్నెస్ దినపత్రిక
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షులు రాజ్ ఠాక్రే త్వరలోనే ఓ దిన పత్రికను ప్రారంభించనున్నారు. తానే ప్రధాన సంపాదకులుగా వ్యవహరించనున్న ఈ పత్రిక పేరు ‘మరాఠా’ అని ఖరారు చేసినట్టు తెలిసింది. గతంలో శివసేన పార్టీ తన వాణిని వినిపించేందుకు ‘మార్మిక్’ అనే వ్యంగ్య చిత్రాల వారపత్రికతోపాటు ‘సామ్నా’ దినపత్రికను కూడా ప్రారంభించింది. ఈ పత్రికలను శివసేన తన ఎదుగుదలతోపాటు ప్రత్యర్థులపై తాము చెప్పదల్చుకున్నది వివరించేందుకు ఉపయోగించుకుంటోంది. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శివసేన పార్టీకి సామ్నా పత్రిక ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బాల్ ఠాక్రే అడుగుజాడల్లో నడిచే రాజ్ ఠాక్రే పత్రిక స్థాపన విషయంలో కూడా ఆయనను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెన్నెస్ స్థాపించి ఎనిమిదేళ్లు పూర్తవుతుండగా, గత సంవత్సరం జరిగిన లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కేవలం ఒక్క శాసనసభ స్థానం లభించింది. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. ఇందులో బాగంగా ప్రజల సంక్షేమంతోపాటు వారి సమస్యల కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు , ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొట్టేందుకు తమకంటూ ఓ పత్రిక ఉండాలన్న నిర్ణయాలనికి వచ్చారు. మరాఠీ రాజభాష దినోత్సవం సందర్భంగా ఎమ్మెన్నెస్ ఆధ్వర్యంలో మంగళవారం బాంద్రాలోని ఎంఐజీ క్లబ్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కోసం ఓ పత్రిక ఉండాల్సిన అవసరాన్ని రాజ్ ఠాక్రే నొక్కి చెప్పినట్టు తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే పత్రికను ప్రారంభించాలన్న ఆలోచనతో రాజ్‌ఠాక్రే ఉన్నట్టు సమాచారం. -
సర్కారులోకి శివసేన
సాక్షి, ముంబై: శివసేన పార్టీని తమతో చేర్చుకుంటామని, త్వరలో ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గురువారం వెల్లడించారు. అయితే కూటమిగా ఏర్పడే ముందు ఇరుపార్టీలు మరోసారి చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నాయని, అవి శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. శివసేనకు అధికారంలో ఎంత వాటా.. ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఆ పార్టీతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహకార మంత్రి చంద్రకాంత్ పాటిల్ లకు అధికారాలిచ్చినట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఇదిలాఉండగా, వచ్చే వారంలో ఫడ్నవిస్ తన మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. అందుకు ఈ ఆదివారం వరకు శివసేనతో చర్చలు జరిపి పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే ప్రతిపాదనలు పూర్తిచేయనున్నారు. ఫడ్నవిస్, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కలిసి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రభుత్వంలో సరైన వాటా కల్పిస్తే ప్రభుత్వంలో చేరేందుకు తమకు అభ్యంతరం లేదని ఉద్ధవ్ వారిద్దరితో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, శివసేన లేనిదే రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఫడ్నవిస్ బీజేపీ అధిష్టానానికి వివరించారు. అలాగే చంద్రకాంత్ పాటిల్ కూడా షా కు శివసేన పాత్ర గురించి వివరించారు. స్థిర పాలన అందించాలంటే శివసేనను తమతో చేర్చుకోక తప్పదని షా కు స్పష్టం చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య చర్చలకు తిరిగి అవకాశం ఏర్పడింది. ‘పొత్తు’.. వారిష్టం !.. ఎన్సీపీ ముంబై: ప్రభుత్వంలో చేరే విషయంలో శివసేనతో బీజేపీ చర్చలు జరుపుతుందని సీఎం ఫడ్నవిస్ ప్రకటించడంపై ఎన్సీపీ స్పందించింది. ‘మేం ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందించేందుకే మైనారిటీ బీజేపీ సర్కార్‌కు బయటనుంచి బేషరతు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చాం.. అంతేతప్ప మా సిద్ధాంతాల్లో మార్పు లేదు.. శివసేనను ప్రభుత్వం కలుపుకోవడం ఆ రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం.. దాంతో మాకు ఎటువంటి సంబంధం లేదు..’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే వ్యాఖ్యానించారు. త్వరలోనే తమ పార్టీ తరఫున సీఎం ఫడ్నవిస్‌ను కలిసి రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాలని కోరనున్నట్లు తెలిపారు. అలాగే అహ్మద్‌నగర్ జిల్లా జావ్ఖేడలో జరిగిన మూడు హత్యలపై కూడా ప్రశ్నించనున్నట్లు చెప్పారు. రైతుల కోసం అవసరమైతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అలాగే విధాన మండలిలో ప్రతిపక్ష హోదా కోరనున్నట్లు తెలిపారు. మండలిలో 78 స్థానాలకు గాను తమ పార్టీకి 28 మంది సభ్యులున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మండలి అధ్యక్షుడి పదవిని కూడా తమ పార్టీ ఆశిస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా, ఈ నెల 29 వ తేదీ నుంచి రెండు రోజులపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటుచేసేందుకు పార్టీ అధినేత శరద్ పవార్ నిర్ణయించినట్లు చెప్పారు. -
సీఎం పదవి మాదే!
ముంబై: వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా, లేకున్నా తమ తరఫునే సీఎం ఉంటారని శివసేన పార్టీ పేర్కొంది. సీట్ల పంప కం విషయంలో శివసేన ఒకరికి ఇచ్చేదే తప్ప తీసుకునే స్థితిలో లేదంటూ బీజేపీకి స్పష్టం చేసింది. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... పొత్తు, సీట్ల పంపిణీపై శివసేన, బీజేపీ ఇరు పార్టీలూ పట్టుపడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో గురువారం జరిగిన ఒక సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌రౌత్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మహారాష్ట్రలో శివసేన అతిపెద్ద పార్టీగా ఉంది.. అదే కొనసాగుతుంది కూడా. బీజేపీ పుట్టకముందు నుంచీ మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన ఉంది. సీట్ల విషయంలో శివసేన ఇచ్చేదేగాని, తీసుకునేది కాదు. పొత్తులు ఉన్నా లేకున్నా.. ముఖ్యమంత్రి మాత్రం శివసేన తరఫునే ఉంటారు..’’ అని ఆయన పేర్కొన్నారు. 25 ఏళ్లుగా ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయని, పొత్తు వీడడమనేది ఇంతవరకూ లేదని పేర్కొన్నారు. కాగా, సంక్షోభం పరిష్కారం కోసం ఇరు పార్టీల నేతలు శుక్రవారం సాయంత్రం చర్చలు జరిపారు. సీట్ల పంపిణీ వ్యవహారం కొలిక్కి వస్తుందని సంకేతాలిచ్చారు. కూటమిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చర్చల్లో పాల్గొన్న ఉద్ధవ్ కుమారుడు అదిత్య ఠాక్రే చెప్పారు. సీట్ల పంపిణీపై శివసేనకు ఒక ప్రతిపాదన ఇచ్చామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సిందే వారేనని బీజేపీ పేర్కొంది. -
ఎన్నికల్లో డబ్బావాలా పోటీ
సాక్షి, ముంబై: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని డబ్బావాలాలు నిర్ణయించుకున్నారు. తమ తరఫున శాసనసభలో ఓ ప్రతినిధి ఉండాలనే ఉద్దేశంతో బైకల్లా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని తీర్మానించుకున్నారు. అయితే పోటీలో నిలిచే అభ్యర్థి ఎవరనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. 125 సంవత్సరాల చరి త్ర కలిగిన డబ్బావాలాలు తమదైన పనితీరుతో మేనేజ్మెంట్ గురూలుగా పేరుతెచ్చుకున్నారు. ఆఫీసులకు టిఫిన్లు మోసేవారైనా వీరి పనితీరు ప్రముఖులను సైతం కట్టిపడేసింది. అయితే ఇప్పటిదాకా వీరి తరఫున కనీసం ఒక్కరు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో మొదటిసారి వీరు బరిలోకి దిగుతుండడంతో రాజకీయంగా ఈ విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే వీరు స్వతంత్ర అభ్యర్థులుగా కాకుండా ఓ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారనే విషయం మాత్రం స్పష్టమైంది. డబ్బావాలాలకు చెందిన ప్రతినిధులు కొందరు శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో త్వరలో సమావేశమవుతారని కూడా చెబుతున్నారు. దీంతోడబ్బావాలాల ప్రతినిధి శివసేన నుంచే పోటీ చేయనున్నట్లు ఖరారైంది. బైకల్లా శాసనసభ నియోజకవర్గం ఆదీ నంలో బైకల్లా, ఘొడప్దేవ్, మాజ్‌గావ్ ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యధిక శాతం మిల్లు కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం మిల్లులు మూత పడడంతో వారి వారసులు, పిల్లలు, బంధువులున్నా రు. వీరంతా జున్నర్, అంబేగావ్, ఖేడ్ తాలూకాల కు చెందినవారు. వీరిలో చాలామంది డబ్బావాలాలుగా కొనసాగుతున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి బరిలోకి దిగితే తప్పకుండా గెలుస్తామనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి ప్రతినిధి ఒకరు తెలిపారు. శివసేన పార్టీ బైకల్లా నియోజకవర్గం టికెట్ ఇవ్వకపోతే శివ్డీ నుంచి పోటీ చేసేందుకైనా తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. -
అభ్యర్థుల ఎంపిక 90 శాతం పూర్తి
సాక్షి, ముంబై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 90 శాతం పూర్తిఅయ్యిందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఔరంగాబాద్‌లో ఆయన బుధవారం సాయంత్రం మరఠ్వాడా పరిధిలోని ఎనిమిది జిల్లాల పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు, పదాధికారులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ఏకంగా 42 స్థానాలు కైవసం చేసుకున్నాయి. దీంతో ఇరుపార్టీలు వచ్చే శాసనసభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. కాగా, ఏ ఏ శాసనసభ నియోజక వర్గాల పరిధిలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అభ్యర్థిత్వం ఇస్తున్నట్లు ఉద్ధవ్ చెప్పారు. ఎక్కడైతే తక్కువ ఓట్లు పోలయ్యాయో ఆ శాసనసభ నియోజక వర్గాలపై మరింత దృష్టి సారిస్తామని అన్నారు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో శివసేన మరఠ్వాడా రీజియన్‌లో 27 స్థానాల్లో పోటీచేసి ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది. అప్పుడు గెలిచిన వారందరికీ తిరిగి టికెట్ ఇవ్వనున్నట్లు ఠాక్రే సూత్రప్రాయంగా తెలిపారు. అదేవిధంగా పర్భణి ఎమ్మెల్యే సంజయ్ జాదవ్ లోక్‌సభకు ఎన్నిక కావడంతో అక్కడ శివసేన కొత్త అభ్యర్థిని బరిలో దింపాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక 90 శాతం పూర ్తయ్యిందని.. మిగతా 10 శాతం అభ్యర్థులను ఎంపికచేసే పనులు ఆగస్టులో పూర్తిచేసి తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత తమతమ నియోజకవర్గాలలో ప్రచార పనుల్లో నిమగ్నం కావాలని అభ్యర్థులకు ఆదేశాలివ్వనున్నట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా, కాషాయ కూటమి ఒప్పందం మేరకు బీజేపీ, శివసేనలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు.దీంతో శాసనసభ ఎన్నికల్లో తమదే పైచేయి చాటుకోవాలనే తపనతో శివసేన ఉంది. మరోపక్క మోడీ ప్రభంజనాన్ని మరోసారి రాష్ట్రంలో చూపించేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. ఆగస్టు 15లోపు తమ అభ్యర్థులు జాబితా ప్రకటిస్తామని బీజేపీ ఇటీవలే ప్రకటించింది. కాని శివసేన మాత్రం బీజేపీ కంటే ముందే 90 శాతం అభ్యర్థుల జాబితా సిద్ధంచేసినట్లు ప్రకటించింది. ఇలా రెండు పార్టీలు పోటాపోటీగా ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా ముందడుగు వేస్తుండటం గమనార్హం. ఛగన్పై గరంగరం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ అంశంపై ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) మంత్రి ఛగన్ భుజబల్‌పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర సదన్ పేరును లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ మార్చేస్తే బాగుంటుందని భుజబల్‌కు చురకలంటించారు. నాసిక్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమానికి ఉద్ధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఢిల్లీలో మహారాష్ట్ర సదన్‌లో జరిగిన గొడవ అక్కడి అక్రమాలకు సంబంధించినది. దానికి మతం రంగు పూసి కొందరు మరింత రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం క్యాంటిన్‌లోనే కాదు మొత్తం మహారాష్ట్ర సదన్‌లోనే జరగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. -
సభా సమరం టోల్ వసూళ్లపై దుమారం
ముంబై: టోల్‌ట్యాక్స్ వసూళ్లకు వ్యతిరేకంగా కొల్హాపూర్‌లో కొనసాగుతున్న ఉద్యమ తాకిడి శాసనసభనూ తాకింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేయడంతో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలను డిప్యూటీ స్పీకర్ వసంత్ పుర్కే సోమవారం సస్పెండ్ చేశారు. దీంతో వీరిని భద్రతా సిబ్బంది బలవంతంగా బయటికి తరలించారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై సభలో సోమవారం చర్చ జరుగుతున్నప్పుడు సేన ఎమ్మెల్యేలు సుజిత్ మించేకర్, రాజేశ్ క్షీర్సాగర్ టోల్‌ట్యాక్స్ అంశాన్ని లేవనెత్తారు. టోల్‌ప్లాజాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చ జరపాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి పుర్కే తిరస్కరించడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యేలు పోడియం ఎక్కి గొడవకు దిగారు. మైకును విరిచి నిరసన తెలపడంతో డిప్యూటీ స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు. కాసేపటికి సమావేశాలను తిరిగి ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేలు సుజిత్ మించేకర్, రాజేశ్ క్షీర్‌సాగర్‌ను ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా పట్టువీడని ఎమ్మెల్యేలు నేలపై కూర్చొని నినాదాలు చేశారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగి ఇద్దరినీ బయటికి తరలించారు. మార్షల్స్‌ను అడ్డుకోబోయిన సహచర ఎమ్మెల్యేలను పుర్కే వారించారు. వారి విధులకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. కొల్హాపూర్‌లో టోల్ వసూళ్లపై సేనతోపాటు రైతులు, శ్రామికుల పార్టీ, వామపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. అధికార పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు కూడా ఆందోళన చేసిన ఎమ్మెల్యేలకు మద్దతు తెలిపారు. టోల్‌ను రద్దు చేయాలని కోరుతూ వివిధ పార్టీల నాయకులు గాంధీ మైదాన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. టోల్ చెల్లించడం నిలిపివేయాలంటూ ఎమ్మెన్నెస్ అధిపతి రాజ్‌ఠాక్రే ఫిబ్రవరిలో పిలుపు ఇవ్వడంతో ముంబై, ఠాణే వంటి ప్రాంతాల్లో హింస చోటుచేసుకుంది. రాష్ట్రంలో పలుచోట్ల టోల్‌బూత్‌లను ధ్వంసం చేశారు. కాంట్రాక్టర్లు టోల్‌ట్యాక్సుల ద్వారా ఎప్పుడో తమ పెట్టుబడులను వసూలు చేసుకున్నా, అక్రమంగా వసూళ్లను కొనసాగిస్తున్నారని ఠాక్రే ఆరోపించారు. అందుకే తాము టోల్‌ట్యాక్స్ చెల్లించవద్దని కోరానని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఓబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయాన్ని రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో త్వరలో ప్రతిపాదనలు ఉంచుతామని సామాజిక న్యాయమంత్రి శివాజీరావ్ మోఘే సోమవారం సభలో ప్రకటించారు. -
సామ్నా మాట.. సేన మాట కాదు!
ముంబై: సామ్నా.. శివసేన పార్టీ పత్రిక కాదని, అందులో గుజరాతీలకు వ్యతిరేకంగా ప్రచురితమైన సంపాదయకీయంతో పార్టీకి సంబంధం లేదని శివసేన విద్యార్థి విభాగం, యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ముంబైలోని గుజరాతీలు మోడీ ర్యాలీకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని, వారంతా మహారాష్ట్ర వ్యతిరేకులంటూ సామ్నా సంపాదకీయంలో ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై గత రెండ్రోజులుగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యువసేన నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. ముంబైలోని గుజరాతీలు, మరాఠీల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, పార్టీ నాయకులందరిలో కూడా ఇదే అభిప్రాయముందని శివసేన పార్టీ అధ్యక్షడు ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా చెప్పారన్నారు. గుజరాతీలు బాల్‌ఠాక్రేతో సన్నిహితంగా మెలిగేవారని, అవసరమైనప్పుడు ఠాక్రేకు వారు, వారికి ఠాక్రే సహాయసహకారాలు అందించుకునేవారన్నారు. భుజ్‌లో భూకంపం వచ్చినప్పుడు కూడా శివసేన ఎంతో చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. గుజరాతీలందరినీ పార్టీ ముంబైకర్లుగానే భావిస్తుందన్నారు. అసోం అల్లర్లకు మోడీ బాధ్యుడు కాదు.. కాంగ్రెస్ వైఖరిపై మరోసారి శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ధ్వజమెత్తారు. సామ్న సోమవారం ప్రచురించిన సంపాదకీయంలో కాంగ్రెస్‌తోపాటు కాంగ్రెస్ నాయకులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కపిల్ సిబల్, ఓమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అసోంలో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కారణంగానే మారణకాండ (అల్లర్లు) జరిగాయని ఆరోపించే కాంగ్రెస్ నాయకులు ముందు వారేమిటో తెలుసుకోవాలని చురకలంటించారు. ‘మీ మారణకాండలో.. రక్తంతో తడిచిన మీ చేతులకు.. కేవలం హిందువులే రక్తమే అంటుకొని ఉంటుంద’ంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మోడీ కారణంగా దేశం ముక్కలవుతోందని ఆరోపించే కాంగ్రెస్ ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని లేదా యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆశ్రమానికి వెళ్లాలంటూ హితవు పలికారు. ఫలితాల తర్వాత పిచ్చాసుపత్రికే.. అసోం అల్లర్లకు మోడీ కారణం కాదని, ఆయనే కారణమంటూ మాట్లాడుతున్నవారి మానసికస్థితి దెబ్బతిన్నదన్నారు. మే 16 ఎన్నికల ఫలితాల తర్వాత వారందరిని పిచ్చాసుపత్రిలో చేర్చాల్సి ఉంటుందన్నారు. అసోంలో బోడోలకు, అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీ ముస్లింలకు మధ్య గొడవ జరుగుతోందని, ఇది ఇప్పటిది కాదన్నారు. అసోంలోని ఏడు జిల్లాలు బంగ్లాదేశీయుల స్వాధీనంలో ఉన్నాయని, దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా జిల్లాల్లోని బంగ్లాదేశీయులను బయటికి పంపిస్తారన్నారు. కాశ్మీరులో హిందూ పండితులకు గౌరవపూర్వకంగా నివసించే హక్కులు కల్పిస్తారనే భయంతో కపిల్ సిబల్, ఒమర్ అబ్దుల్లాలు ఇలా గొంతు చించుకుంటున్నారని విమర్శించారు. -
‘శివసేనను తెలుగువారు ఆదరించాలి’
సాక్షి, ముంబై: ఈ సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థుల విజయానికి తెలుగు ప్రజలు కృషి చేయాలని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్ పిలుపునిచ్చారు. దాదర్‌లోని శివసేనభవన్లో ముంబై తెలుగు సేన ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తెలుగు శివసైనికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ దేశాయ్ మాట్లాడుతూ...తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక్క శివసేన పార్టీయేనన్నారు. తెలుగువారికి ఉగాది, మరాఠీయులకు గుడిపడ్వాతో కొత్త సంవత్సరం మొదలవుతుందని చెప్పారు. మన భాషలు వేరైనా సంప్రదాయం ఒక్కటేనని గుర్తు చేశారు. ఇలా ఒక్కటిగా ఉన్న మనలో విభేదాలు సృష్టించేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైనా ఉందన్నారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటిలాగే ముందుంటామని తెలిపారు. బాల్‌ఠాక్రేకు గతంలో రక్షాబంధన్ రోజు మొదట రాఖీ కట్టింది కూడా తెలుగు మహిళే అని గుర్తు చేశారు. ఇంత అవినాభావ సంబంధం ఉన్నందునే తెలుగువారికి కామాటిపుర ఎమ్మెల్యే టికెట్, వర్లీ, ధారావి నుంచి కార్పొరేట్ సీట్లు కేటాయించామని తెలిపారు. ఇది ఒక్క శివసేన వల్లే సాధ్యమైందన్నారు. ఈ ఎన్నికల్లో అరవింద్ సావంత్, రాహుల్ శెవాలె, గజానన్ కీర్తికర్లను గెలిపించాలని కోరారు. గతంలో అభివృద్ధి పనులు చేసిన ఘనతఎన్డీఏకి మాత్రమే ఉందన్నారు. ఉద్దవ్ ఠాక్రే రోడ్ షో ప్రచారంలో ఉన్నందున రాలేకపోయారని తెలిపారు. అనంతరం దక్షిణ ముంబై శివసేన పార్టీ అభ్యర్థి అరవింద్ సావంత్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ శివసేన వెంట నడవాలని కోరారు. సభ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన తెలుగు ప్రజలందరికి ముంబై తెలుగు సేన అధ్యక్షుడు వాసాల శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. సభలో కార్యాధ్యక్షుడు టి. ప్రకాశ్‌స్వామి, ఉపాధ్యక్షుడు వినోద్‌చారి, మైస బాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ బాల్‌రాజ్, ఉప కార్యదర్శకుడు సురేష్ దాస, జిందం భాస్కర్, గోసికొండ శ్రీహరి, కోశాధికారి అనుమల్ల సుభాష్, సభ్యులు మల్లేశ్ కల్లూరి, అంజయ్య చెరక, శ్రీనివాస్ గుల్పల్లె. మహిళలు..శారద పాపన్, పుష్ప వాసం, నాగరాజ్ శివసైనికులు, నాగేశ్ సింగా, వర్లీ నుండి బొరిగం మల్లేశం, చాప పరమేశ్వర్, క్యాతం ప్రకాశ్, గడాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే పోటీ చేయ్
సాక్షి, ముంబై: ఒక్కసారి...ఒకే ఒక్కసారి ఎన్నికల్లో పోటీచేసి చూడు, నీ స్థానమేంటో రాష్ట్ర ప్రజలు చూపిస్తారని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ సవాల్ విసిరారు. నాసిక్‌లో ఎన్సీపీ లోక్‌సభ అభ్యర్థి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఛగన్ భుజ బల్కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో పవార్ పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడుతున్నానని తనపై ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘బాలుడా (ఉద్ధవ్) నేను 14 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీచేశాను. 14 సార్లు గెలిచాను కూడా. ఉద్ధవ్ ఒంటెపై కూర్చుండి నేను చాలా ఎత్తు ఎదిగానని విర్రవీగుతున్నాడు. ఏ పార్టీని చూసుకుని విర్రవీగుతున్నావో ఆ పార్టీ ఎవరు స్థాపించారో తెలుసా..? శివసేన పార్టీని మీ తండ్రి, దివంగత అధినేత బాల్‌ఠాక్రే స్థాపించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి గుర్తింపు రావడానికి అందుకు ఆయన ఎంతో కృషి చేశార’ని పవార్ గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడేవాడినైతే 14 సార్లు పోటీ ఎలా చేస్తాను..? ఎలా గెలుస్తాను..? అని ఉద్ధవ్‌ను నిలదీశారు. ‘ఎన్నికలంటే తనకు భయమని చెప్పడం కాదు, జీవితంలో ఒక్కసారైన ఎన్నికల్లో పోటీ చేసి చూపించు. దిగితే తప్ప బావి లోతు తెలియదంటారు. ఎన్నికల బరిలోకి దిగి చూపించు....ఎవరికి భయమేస్తుందో తెలుస్తుంద’ ని ఆయన చురక అంటించారు. ఈ సభలో పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, వినాయక్ పాటిల్, ఎంపీ సమీర్ భుజబల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్‌రావ్ కోకాటే, ఎన్సీపీ కార్యధ్యక్షుడు జితేంద్ర అవ్హాడ్, మాజీ మంత్రులు తుకారాం దిఘోలే, లక్ష్మణ్ డోబలే తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడత ప్రచారంపై దృష్టి
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు తెరపడడంతో ఇక మూడో దశ ఎన్నికల ప్రచారంపై ఆయా పార్టీలు దృష్టి సారించాయి. నగరంలో ముఖ్య నేతలతో రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 20న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ, 21న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభ ఉందని ఆయా పార్టీల నేతలు తెలిపారు. కాగా, మొన్నటివరకు నగరంతో పాటు శివారు ప్రాంతంలో అడపాదడపా జరిగిన ప్రచారాలు ఇక నుంచి మరింత జోరుగా సాగనున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనవల్ల బిజీగా ఉన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇప్పుడు మూడో దశ ఎన్నికలపై దృష్టి సారించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్‌కు మద్ధతుగా ప్రచారం నిర్వహించనున్నారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గిరణ్ గావ్ (మిల్లులున్న) ప్రాంతంలో దక్షిణ ముంబై మహా కూటమి అభ్యర్థి అరవింద్ సావంత్‌కు మద్ధతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు నగరంలో బడా నాయకులు ప్రచారాలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. 2009లో నగరం, శివారు ప్రాంతాల్లోని మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్, ఎన్సీపీలకు ఈసారి కొంత ఇబ్బందికర పరిస్థితి కనబడుతోంది. అదే శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమికి మూడు స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చవాన్, మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ వారం రోజుల్లో ఎన్నికల వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకే ఏకదాటిని ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న 19 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
మోడీ పెళ్లి వ్యక్తిగతం
సాక్షి, ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పెళ్లిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ర్పచారంపై శివసేన పార్టీ మండిపడింది. పెళ్లి అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీని ఇబ్బందుల్లోకి నెట్టాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను శివసేన పార్టీ అధికార దిన పత్రిక సామ్నాలో తిప్పికొట్టింది. తమ కుంభకోణాలు, అవినీతి అంశం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఈ ప్రచారానికి తెరలేపిందని ఆరోపించింది. పెళ్లి మోడీ వ్యక్తిగత విషయమని తెలిపింది. ‘కాంగ్రెస్ పార్టీలో గూండాలుగా ఉన్న నాయకులు, మంత్రులు ఇప్పటివరకు అనేక మంది మహిళలను మోసం చేశారు. యువతుల జీవితాలతో చెలగాటమాడారు. పెళ్లి, ఉద్యోగాల పేరుతో ఎంతో మంది యువతులను మోసం చేశారు. అత్యాచారం, హత్య కేసుల్లో చాలా మంది కాంగ్రెస్‌వాదులు దేశంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మురికి కాల్వ లాంటిది. అందులోంచి బయటపడిన కాంగ్రెస్ నాయకులు నేడు మోడీ భార్య యశోదాబెన్‌కు అన్యాయం చేశారని కట్టు కథలు అల్లి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నార’ని సంపాదకీయంలో పేర్కొంది. వడోదర, వారణాసి నుంచి పోటీచేస్తున్న మోడీ నామినేషన్ పత్రాలు దాఖలుచేసిన సమయంలో పెళ్లైందని అఫిడవిట్లో పేర్కొనడాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడాన్ని తప్పుబట్టింది. గత ఎన్నికల్లో పోటీ సమయంలో దాఖలు చేసిన నామినేషన్లో అవివాహితుడినని పేర్కొన్న మోడీని వివిధ సెక్షన్ల కింద కేసుల్లో ఇరికించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంపై మండిపడింది. ‘ఇంతవరకు పెళ్లి చేసుకోని కాంగ్రెస్ యువరాజు తలపై జుట్టు ఊడిపోతుంది. ఆయన మోడీ కట్టుకున్న భార్యకు ఎలా అన్యాయం చేశారు, ఆమెను గౌరవించలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని మండిపడింది. ఆయన కుటుంబం విషయంలో ఎందుకు అంత శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రశ్నిం చింది. భార్య విషయం వెల్లడించనందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోడై కూస్తున్నారు. అయితే పెళ్లి విషయం మోడీ వ్యక్తిగతమని శివసేన పార్టీ తెలిపింది. మోడీ పెళ్లి విషయాన్ని రాద్ధాంతం చేసినంత మాత్రాన దేశంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గుముఖం పడతాయా...? అనేక కుంభకోణాల్లో చిక్కుకున్న మంత్రులు మచ్చలేకుండా బయటపడతారా..? అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి ఆర్థిక సాయం అందుతుందా..? వీటన్నింటిపై కాంగ్రెస్ నేతలు ముందు తేల్చాలని సామ్నా సంపాదకీయంలో శివసేన నిలదీసింది. కాంగ్రెస్ వైఫల్యాలను పక్కనబెట్టేందుకు మోడీ పెళ్లిని హైలైట్ చేస్తున్నారని ఆరోపించింది. -
మేమే పులులం
సాక్షి, ముంబై: బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీనే అసలైందని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే అన్నారు. నవ నిర్మాణ పార్టీగా అభివర్ణించారు. మధ్యలో పుట్టుకొచ్చిన పార్టీ ఒకటి తామే ప్రధానం అన్నట్టుగా వ్యవహరించడాన్ని పరోక్షంగా ఎమ్మెన్నెస్ అధినేత రాజ్‌ఠాక్రేపై విమర్శలు చేశారు. నవీముంబై ఐరోలిలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ...నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అమ్ముడుపోయేదని, తిరుగుబాటుదారుల పార్టీ అని ఆరోపించారు. శివసేనను వీడి ఎన్సీపీలో చేరిన నార్వేకర్‌తోపాటు ఇతర తిరుగుబాటుదారులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇక రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ పార్టీ ఎన్సీపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఎమ్మెన్నెస్ గతంలో శివసేన అధినేత బాల్‌ఠాక్రే పేరుపై ఓట్లు అడిగేదని, ఇప్పుడు నరేంద్ర మోడీ పేరుపై ఓట్లు అడుగుతోందని ఎద్దేవా చేశారు. మేము హిందుత్వంపై మాట్లాడితే చర్యలు తీసుకుంటామంటారు. అయితే ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతున్న ఎంఐఎం నాయకుడు ఓవైసీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆత్మవిశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు. మాదే విజయం.... లోక్‌సభ ఎన్నికల్లో శివసేన-బీజేపీ-ఆర్పీఐ-స్వాభిమాని పార్టీల మహాకూటమి విజయం సాధిస్తుందని ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. నరేంద్ర మోడీకి తమ మద్దతు ఉంటుందన్నారు. తమ కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు. ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమికి ఓటమి తప్పదన్నారు. అవినీతి కుంభకోణాలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు. ఎమ్మెన్నెస్‌ను అడ్డుపెట్టుకొని గతంలోలాగానే దెబ్బకొట్టాలనుకుంటున్నారని, అది ఈసారి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎవరెన్ని చేసినా మహాకూటమి విజయాన్ని మాత్రం ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి చురకలంటించిన ఉద్ధవ్ బీజేపీ సీనియర్ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ అభ్యర్థి విషయమై నెలకొన్న వివాదంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే తలదూర్చి అనేక సవాళ్లు బీజేపీ ముందుంచారు. నరేంద్ర మోడీ యుగం ప్రారంభమైందంటే లాల్‌కృష్ణ అద్వాని యుగం ముగిసినట్లు కాదని (అస్తమించలేదు) ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. సామ్నా దిన పత్రిక శనివారం సంపాదకీయంలో అద్వానీ అభ్యర్థి విషయంపై బీజేపీ వహిస్తున్న వైఖరిపై తనదైన శైలిలో మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా పరిశీలిస్తే శివసేన, బీజేపీలో నెలకొన్న వివాదం తగ్గినట్టు కన్పించడంలేదు. ఇరు పక్షాలు ఏమీలేదని చెబుతున్నప్పటికీ పలుమార్లు ఆయా నాయకుల ప్రకటనల ద్వారా ఇరుపక్షాల మధ్య విభేదాలున్నాయని తెలుస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేతో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి భేటీ అయిన అనంతరం ఇలాంటి సంఘటనలు అధికమయ్యాయి. తాజాగా తమ మిత్రపక్షమైన బీజేపీకి శివసేన ఉద్ధవ్‌ఠాక్రే తనదైన శైలిలో సూచనలిస్తూనే చురకలంటించారు. ‘విషయం చిన్నది, దుర్ఘటన పెద్దది’ (గోష్ట్ చోటి, దుర్ఘటన మోటి’ అనే శీర్షికతో సంపాదకీయాన్ని ప్రచురించారు. సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీని అభ్యర్థిగా ప్రకటించడంలో ఎందుకు ఆలస్యమైనట్టు ఆయన ప్రశ్నించారు. అద్వానీ స్థానం ఇప్పటికీ బీజేపీలో ఇంకా చాలా గౌరవప్రదమైనది, కీలకమైనదన్నారు. ఇక ముందు కూడా ఇదేవిధంగా ఉంటుందని చెప్పారు. ఇది చెప్పడానికి కారణం అద్వానీ విషయం చాలా చిన్నదిగా కన్పిస్తున్నా, పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని సూచించారు. బీజేపీని పరోక్షంగా హెచ్చరించారు. బీజేపీని బలోపేతం చేయడంలో అద్వానీ పాత్ర కీలకమన్నది మరవద్దన్నారు. ఇలా అద్వానీపై ప్రశంసల జల్లులు కురిపిస్తూనే, మరోవైపు బీజేపీకి చురకలంటించారు. -
శివసేనను విడిచిపోను : జోషి
సాక్షి, ముంబై: తాను శివసేన పార్టీని విడిచివెళతానన్నవి పుకార్లేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మనోహర్జోషి ప్రకటించారు. ఆయన మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తనకు ఎలాంటి కోపం లేదని, ఆయన నుంచి ఇంతవరకు పిలుపురాలేదని, వస్తే తప్పకుండా మాతోశ్రీ బంగ్లాకు వెళతానని జోషి చెప్పారు. శివసేన దసరా ర్యాలీలో అవమానానికి గురైన జోషి చాలా రోజుల తర్వాత ఆయన నోరు విప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శివాజీపార్క్ మైదానంలో దసరా రోజున జరిగిన ర్యాలీలో జోషికి అవమానం జరిగిన విషయం తెలిసిందే. ర్యాలీలో పథకం ప్రకారమే తన కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆయన ఆ తర్వాత ప్రకటించారు. ఆ రోజు వేదికపై కూర్చున్న లీలాధర్ డోకే విజ్ఞప్తి చేయడంతో తను వేదిక దిగి వెళ్లిపోయానని, తర్వాత మూడు రోజులపాటు ఖండాలాలో కుటుంబ సభ్యులతో గడిపానని చెప్పారు. పార్టీ తరఫున ఎక్కడి నుంచైనా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపారు. పార్టీ రాజ్యసభకు పంపినా తనకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.