‘శివసేనను తెలుగువారు ఆదరించాలి’
సాక్షి, ముంబై: ఈ సార్వత్రిక ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థుల విజయానికి తెలుగు ప్రజలు కృషి చేయాలని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్ పిలుపునిచ్చారు. దాదర్‌లోని శివసేనభవన్‌లో ముంబై తెలుగు సేన ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తెలుగు శివసైనికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ దేశాయ్ మాట్లాడుతూ...తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక్క శివసేన పార్టీయేనన్నారు. తెలుగువారికి ఉగాది, మరాఠీయులకు గుడిపడ్వాతో కొత్త సంవత్సరం మొదలవుతుందని చెప్పారు. మన భాషలు వేరైనా సంప్రదాయం ఒక్కటేనని గుర్తు చేశారు.
ఇలా ఒక్కటిగా ఉన్న మనలో విభేదాలు సృష్టించేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరిపైనా ఉందన్నారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటిలాగే ముందుంటామని తెలిపారు. బాల్‌ఠాక్రేకు గతంలో రక్షాబంధన్ రోజు మొదట రాఖీ కట్టింది కూడా తెలుగు మహిళే అని గుర్తు చేశారు. ఇంత అవినాభావ సంబంధం ఉన్నందునే తెలుగువారికి కామాటిపుర ఎమ్మెల్యే టికెట్, వర్లీ, ధారావి నుంచి కార్పొరేట్ సీట్లు కేటాయించామని తెలిపారు. ఇది ఒక్క శివసేన వల్లే సాధ్యమైందన్నారు. ఈ ఎన్నికల్లో అరవింద్ సావంత్, రాహుల్ శెవాలె, గజానన్ కీర్తికర్‌లను గెలిపించాలని కోరారు. గతంలో అభివృద్ధి పనులు చేసిన ఘనతఎన్‌డీఏకి మాత్రమే ఉందన్నారు. ఉద్దవ్ ఠాక్రే రోడ్ షో ప్రచారంలో ఉన్నందున రాలేకపోయారని తెలిపారు.
అనంతరం దక్షిణ ముంబై శివసేన పార్టీ అభ్యర్థి అరవింద్ సావంత్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ శివసేన వెంట నడవాలని కోరారు. సభ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరైన తెలుగు ప్రజలందరికి ముంబై తెలుగు సేన అధ్యక్షుడు వాసాల శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. సభలో కార్యాధ్యక్షుడు టి. ప్రకాశ్‌స్వామి, ఉపాధ్యక్షుడు వినోద్‌చారి, మైస బాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ బాల్‌రాజ్, ఉప కార్యదర్శకుడు సురేష్ దాస, జిందం భాస్కర్, గోసికొండ శ్రీహరి, కోశాధికారి అనుమల్ల సుభాష్, సభ్యులు మల్లేశ్ కల్లూరి, అంజయ్య చెరక, శ్రీనివాస్ గుల్‌పల్లె. మహిళలు..శారద పాపన్, పుష్ప వాసం, నాగరాజ్ శివసైనికులు, నాగేశ్ సింగా, వర్లీ నుండి బొరిగం మల్లేశం, చాప పరమేశ్వర్, క్యాతం ప్రకాశ్, గడాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.