సభా సమరం టోల్ వసూళ్లపై దుమారం
ముంబై: టోల్‌ట్యాక్స్ వసూళ్లకు వ్యతిరేకంగా కొల్హాపూర్‌లో కొనసాగుతున్న ఉద్యమ తాకిడి శాసనసభనూ తాకింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేయడంతో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలను డిప్యూటీ స్పీకర్ వసంత్ పుర్కే సోమవారం సస్పెండ్ చేశారు. దీంతో వీరిని భద్రతా సిబ్బంది బలవంతంగా బయటికి తరలించారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై సభలో సోమవారం చర్చ జరుగుతున్నప్పుడు సేన ఎమ్మెల్యేలు సుజిత్ మించేకర్, రాజేశ్ క్షీర్‌సాగర్ టోల్‌ట్యాక్స్ అంశాన్ని లేవనెత్తారు. టోల్‌ప్లాజాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చ జరపాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
దీనికి పుర్కే తిరస్కరించడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యేలు పోడియం ఎక్కి గొడవకు దిగారు. మైకును విరిచి నిరసన తెలపడంతో డిప్యూటీ స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు. కాసేపటికి సమావేశాలను తిరిగి ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేలు సుజిత్ మించేకర్, రాజేశ్ క్షీర్‌సాగర్‌ను ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా పట్టువీడని ఎమ్మెల్యేలు నేలపై కూర్చొని నినాదాలు చేశారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగి ఇద్దరినీ బయటికి తరలించారు.
మార్షల్స్‌ను అడ్డుకోబోయిన సహచర ఎమ్మెల్యేలను పుర్కే వారించారు. వారి విధులకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. కొల్హాపూర్‌లో టోల్ వసూళ్లపై సేనతోపాటు రైతులు, శ్రామికుల పార్టీ, వామపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. అధికార పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు కూడా ఆందోళన చేసిన ఎమ్మెల్యేలకు మద్దతు తెలిపారు. టోల్‌ను రద్దు చేయాలని కోరుతూ వివిధ పార్టీల నాయకులు గాంధీ మైదాన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. టోల్ చెల్లించడం నిలిపివేయాలంటూ ఎమ్మెన్నెస్ అధిపతి రాజ్‌ఠాక్రే ఫిబ్రవరిలో పిలుపు ఇవ్వడంతో ముంబై, ఠాణే వంటి ప్రాంతాల్లో హింస చోటుచేసుకుంది. రాష్ట్రంలో పలుచోట్ల టోల్‌బూత్‌లను ధ్వంసం చేశారు. కాంట్రాక్టర్లు టోల్‌ట్యాక్సుల ద్వారా ఎప్పుడో తమ పెట్టుబడులను వసూలు చేసుకున్నా, అక్రమంగా వసూళ్లను కొనసాగిస్తున్నారని ఠాక్రే ఆరోపించారు. అందుకే తాము టోల్‌ట్యాక్స్ చెల్లించవద్దని కోరానని వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఓబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయాన్ని రూ. 4.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో త్వరలో ప్రతిపాదనలు ఉంచుతామని సామాజిక న్యాయమంత్రి శివాజీరావ్ మోఘే సోమవారం సభలో ప్రకటించారు.