సాక్షి, ముంబై: ఒక్కసారి...ఒకే ఒక్కసారి ఎన్నికల్లో పోటీచేసి చూడు, నీ స్థానమేంటో రాష్ట్ర ప్రజలు చూపిస్తారని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ సవాల్ విసిరారు. నాసిక్‌లో ఎన్సీపీ లోక్‌సభ అభ్యర్థి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఛగన్ భుజ బల్‌కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో పవార్ పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడుతున్నానని తనపై ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘బాలుడా (ఉద్ధవ్) నేను 14 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీచేశాను. 14 సార్లు గెలిచాను కూడా. ఉద్ధవ్ ఒంటెపై కూర్చుండి నేను చాలా ఎత్తు ఎదిగానని విర్రవీగుతున్నాడు.
ఏ పార్టీని చూసుకుని విర్రవీగుతున్నావో ఆ పార్టీ ఎవరు స్థాపించారో తెలుసా..? శివసేన పార్టీని మీ తండ్రి, దివంగత అధినేత బాల్‌ఠాక్రే స్థాపించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి గుర్తింపు రావడానికి అందుకు ఆయన ఎంతో కృషి చేశార’ని పవార్ గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడేవాడినైతే 14 సార్లు పోటీ ఎలా చేస్తాను..? ఎలా గెలుస్తాను..? అని ఉద్ధవ్‌ను నిలదీశారు. ‘ఎన్నికలంటే తనకు భయమని చెప్పడం కాదు, జీవితంలో ఒక్కసారైన ఎన్నికల్లో పోటీ చేసి చూపించు. దిగితే తప్ప బావి లోతు తెలియదంటారు.
ఎన్నికల బరిలోకి దిగి చూపించు....ఎవరికి భయమేస్తుందో తెలుస్తుంద’ ని ఆయన చురక అంటించారు. ఈ సభలో పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, వినాయక్ పాటిల్, ఎంపీ సమీర్ భుజబల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్‌రావ్ కోకాటే, ఎన్సీపీ కార్యధ్యక్షుడు జితేంద్ర అవ్హాడ్, మాజీ మంత్రులు తుకారాం దిఘోలే, లక్ష్మణ్ డోబలే తదితరులు పాల్గొన్నారు.
దమ్ముంటే పోటీ చేయ్
Published Sun, Apr 20 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM
Advertisement