![Picture Will Be Different In Assembly Polls: Sharad Pawar On Seat Sharing](/styles/webp/s3/article_images/2024/06/22/aad.jpg.webp?itok=_TJIPdkF)
ముంబై: ఎన్సీపీ(శరత్‌చంద్ర) అధినేత శరద్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో మిత్రపక్షాల కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎన్సీపీ అంగీకరించిందని, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని శరద్ పవార్ పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం శదర్ పవార్ పుణెలో రెండు పార్టీ సమావేశాలు నిర్వహించారు. జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో, పార్టీ ఎమ్మెల్యేలు, కొత్తగా ఎంపికైన ఎంపీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
పుణె ఎన్సీపీ చీఫ్ ప్రశాంత్ జగ్తాప్ మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌తో పొత్తు చెక్కుచెదరకుండా ఉండేలా లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిందని శరద్ పవార్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఫార్ములా భిన్నంగా ఉంటుందని పార్టీ చీఫ్ తమకు సూచించాడని చెప్పారు.
పూణే, బారామతి, మావల్, షిరూర్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితిని కూడా ఎన్సీపీచీఫ్ సమీక్షించారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను పవార్ పిలుపునిచ్చినట్లు చెప్పారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ సీట్ల పంపకం సందర్భంగా పార్టీ ఎన్ని సీట్లు కోరుతుందో ఇంకా నిర్ణయించలేదని రాష్ట్ర ఎన్సీపీచీఫ్ జయంత్ పాటిల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ప్రత్యర్థి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి విషయంలో శరద్ పవార్ సీనియర్ నిర్ణయం తీసుకుంటారని పాటిల్ చెప్పారు.కాగా ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment