ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్‌చంద్ర) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి వైదొలగడంపై ఆయన స్పందించారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. రాజ్యసభలో తమ పదవీకాలం ఇంకా ఏడాది కాలం మిగిలి ఉందని, అది పూర్తైన తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీచేయనని పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం బారామతిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను అధికారంలో లేనని చెప్పారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఆ తర్వాత భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని వెల్లడించారు. ఎక్కడో ఒకచోట ఆగిపోవాల్సిందేనన్న శరద్ పవార్.. ఇప్పటి వరకు 14 సార్లు తనను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు బారామతి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈనెల 20న జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నుంచి ఎన్సీపీ(అజిత్) అధ్యక్షుడు అజిత్ పవార్ బరిలోకి దిగుతున్నారు. ఆయనపై శరద్‌పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీ చేస్తున్నారు. దీంతో శరద్ పవార్ తన మనవడు యుగేంద్ర తరఫున ప్రచారం చేస్తు్న్నారు. కాగా అజిత్ పవార్ బారామతి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత విజయాల్లో అతనికి తన మామ పార్టీ మద్దతు ఉంది. కానీ పార్టీ నుంచి చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.
దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ.. తనకు అజిత్ పవార్‌పై ఎలాంటి పగ లేదని చెప్పారు. రాష్ట్రంలో అజిత్ పవార్ 30 ఏళ్లకు పైగా పనిచేశారని, ఆయన సేవలపై ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే ఇప్పుడు భవిష్యత్తు కోసం సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కొత్త నాయకుడు అవసరమని ఆయన అన్నారు. రాబోయే 30 ఏళ్లు పనిచేసే నాయకత్వాన్ని మనం తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కాగా శరద్‌పవార్ వయసు ప్రస్తుతం 83 ఏళ్లు. ఆయన దాదాపు 60 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేతగా అవతరించారు. 1999లో ఆయన ఎన్సీపీని స్థాపించి ప్రముఖ రాజకీయ నాయకుడిగా సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment