సాక్షి, ముంబై: శివసేన పార్టీని తమతో చేర్చుకుంటామని, త్వరలో ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గురువారం వెల్లడించారు. అయితే కూటమిగా ఏర్పడే ముందు ఇరుపార్టీలు మరోసారి చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నాయని, అవి శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. శివసేనకు అధికారంలో ఎంత వాటా.. ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఆ పార్టీతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహకార మంత్రి చంద్రకాంత్ పాటిల్ లకు అధికారాలిచ్చినట్లు ఫడ్నవిస్ తెలిపారు.
ఇదిలాఉండగా, వచ్చే వారంలో ఫడ్నవిస్ తన మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. అందుకు ఈ ఆదివారం వరకు శివసేనతో చర్చలు జరిపి పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే ప్రతిపాదనలు పూర్తిచేయనున్నారు. ఫడ్నవిస్, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కలిసి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రభుత్వంలో సరైన వాటా కల్పిస్తే ప్రభుత్వంలో చేరేందుకు తమకు అభ్యంతరం లేదని ఉద్ధవ్ వారిద్దరితో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, శివసేన లేనిదే రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఫడ్నవిస్ బీజేపీ అధిష్టానానికి వివరించారు. అలాగే చంద్రకాంత్ పాటిల్ కూడా షా కు శివసేన పాత్ర గురించి వివరించారు. స్థిర పాలన అందించాలంటే శివసేనను తమతో చేర్చుకోక తప్పదని షా కు స్పష్టం చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య చర్చలకు తిరిగి అవకాశం ఏర్పడింది.
‘పొత్తు’.. వారిష్టం !.. ఎన్సీపీ
ముంబై: ప్రభుత్వంలో చేరే విషయంలో శివసేనతో బీజేపీ చర్చలు జరుపుతుందని సీఎం ఫడ్నవిస్ ప్రకటించడంపై ఎన్సీపీ స్పందించింది. ‘మేం ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందించేందుకే మైనారిటీ బీజేపీ సర్కార్‌కు బయటనుంచి బేషరతు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చాం.. అంతేతప్ప మా సిద్ధాంతాల్లో మార్పు లేదు.. శివసేనను ప్రభుత్వం కలుపుకోవడం ఆ రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం.. దాంతో మాకు ఎటువంటి సంబంధం లేదు..’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే వ్యాఖ్యానించారు.
త్వరలోనే తమ పార్టీ తరఫున సీఎం ఫడ్నవిస్‌ను కలిసి రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించాలని కోరనున్నట్లు తెలిపారు. అలాగే అహ్మద్‌నగర్ జిల్లా జావ్‌ఖేడలో జరిగిన మూడు హత్యలపై కూడా ప్రశ్నించనున్నట్లు చెప్పారు. రైతుల కోసం అవసరమైతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అలాగే విధాన మండలిలో ప్రతిపక్ష హోదా కోరనున్నట్లు తెలిపారు. మండలిలో 78 స్థానాలకు గాను తమ పార్టీకి 28 మంది సభ్యులున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మండలి అధ్యక్షుడి పదవిని కూడా తమ పార్టీ ఆశిస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా, ఈ నెల 29 వ తేదీ నుంచి రెండు రోజులపాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటుచేసేందుకు పార్టీ అధినేత శరద్ పవార్ నిర్ణయించినట్లు చెప్పారు.
సర్కారులోకి శివసేన
Published Thu, Nov 27 2014 10:46 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM
Advertisement