ముంబై: ఆరుపార్టీల కాషాయ మహాకూటమి (మహాయుతి)ని సమైక్యంగా ఉంచేందుకు జరిగిన చివరి ప్రయత్నాలు విఫలం కావడంతో శివసేన ఒంటరిగా మిగిలిపోయింది. గత 25 ఏళ్లుగా బీజేపీతో కలిసి ఎన్డీయే కూటమిలో కొనసాగిన శివసేన ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో ఏకాకిగా మిగిలింది. భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలో శివసేన మొండి వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పొత్తును కొనసాగించేందుకు తాము కొత్త ప్రతిపాదనలు కోరామని, కానీ శివసేన పదే పదే పాత పాటనే పాడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. బీజేపీ, శివసేనల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాను కూడా తీవ్రంగా ప్రయత్నించానని స్వాభిమానీ షేట్కారీ సంఘటన అధ్యక్షుడు రాజుశెట్టి అన్నారు. పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ అత్యుత్సాహం చూపిందని శివసేన నాయకుడు దివాకర్ రావుతే ఆరోపించారు. సీట్ల సర్దుబాటులో ఇక ఒక్క సీటుపై మాత్రమే నిర్ణయం మిగిలిందని, కానీ పొత్తును భగ్నం చేయడంలో బీజేపీ తొందరపడిందని ఆయన విమర్శించారు.
ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీ తిన్న ఎదురుదెబ్బలు శివసేనకు ఊతం ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ‘మోదీ హవా’పై ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య దుమారం రేపాయి. గత ఆదివారం జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలోనే ఉద్ధవ్ బీజేపీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించిందంటూ వ్యాఖ్యానించారు. పొత్తు ఉంటే 151 సీట్లు లేదా 288 సీట్లలో పోటీకి సిద్ధంగా ఉండాలని ఆ సమావేశంలోనే ఆయన పార్టీ కార్యకర్తలను సిద్ధం చేశారు. ‘‘నా సైనికులే నాకు ప్రధానం. మన అదృష్టంలో ఉన్న దానిని ఎవరీ లాక్కెళ్లలేరు. పొత్తు ఉన్నా, విచ్ఛిన్నమైనా పోరాడేందుకు నేను సిద్ధం. మీరు నాతో ఉన్నారా?’’ అని ఉద్ధవ్ కార్యకర్తలను ప్రశ్నించారు.
బాల్ ఠాక్రే మరణానంతరం జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలను ఉద్ధవ్ ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో తన సత్తా ఏమిటో రుజువు చేసుకోవడాన్ని బట్టి పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన ఉద్ధవ్ తాము 151 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేయాలని నిర్ణయించారు. ఆ వ్యూహంలో భాగంగానే బీజేపీకి తొలుత 119 సీట్లు, ఆ తరువాత 130 సీట్లు ఇస్తామని ప్రతిపాదించారు.
చిన్న పార్టీల కోటాను తగ్గించారు తప్ప శివసేన పోటీ చేసే స్థానాలను తగ్గించేందుకు మాత్రం ససేమిరా అన్నారు. ఒంటరి పోరుకు సిద్ధమైన తరువాతనే ఉద్ధవ్ మొండి వైఖరిని అవలంబించటం ప్రారంభించారని ఓ సీనియర్ శివసేన నాయకుడు అన్నారు. ‘‘మా బలాలను, బలహీనతలను గుర్తించాం. శివసేన బలహీనంగా ఉన్న నాగపూర్, బీడ్, ధూలే, వార్ధా వంటి ప్రాంతాల్లో బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులను గుర్తించాలని మా నేతలను పురమాయించాం. 220 సీట్లలో మేము బలమైన పార్టీగా ఉన్నాం’’ అని ఆ నాయకుడు చెప్పారు.
రేపటి నుంచి శివసేన ప్రచారం
శివసేన శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. మహాలక్ష్మి రేస్‌కోర్సు గ్రౌండ్‌లో సాయంత్రం 6.00 గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే, ఇతర సీనియర్ నేతలు ప్రసంగిస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 27వ తేదీలోగా తమ పార్టీ అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేస్తారని తెలిపింది.
ఒంటరైన శివసేన
Published Thu, Sep 25 2014 10:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement