నేడు ముంబైకి రానున్న అమిత్ షా
సాక్షి, ముంబై: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నేడు ముంబైకి రానున్నారు. దీంతో మహాకూటమిలో సీట్ల పంపకాలపై నెలకొన్న గందరగోళానికి నేటితో తెరపడొచ్చని భావిస్తున్నారు. పొత్తుపై నేడు అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని చెబుతున్నారు. షా రాకతో సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. గురువారం ఉదయమే ముంబైకి చేరుకునే షా మహాకూటమిలో కొనసాగాలా? వద్దా? అనే విషయంపై మహారాష్ట్ర బీజేపీ నాయకులతో చర్చించడంతోపాటు శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
అనంతరం మహాకూటమిపై తుది ప్రకటన వెలుపడుతుందంటున్నారు. గత కొన్ని రోజులుగా సీట్ల పంపకాలపై ఏర్పడ్డ విభేదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఎలాగైన కూటమిగానే పోటీ చేయాలని మహాకూటమిలోని శివసేన, బీజేపీలతోపాటు ఇతర పార్టీలు కోరుకుంటున్నప్పటికీ కొన్ని సీట్లపై లెక్కలు తేలకపోవడంతో విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో గత కొన్నిరోజులుగా రోజుకో కొత్త ఫార్ములా మహాకూటమిలో కన్పిస్తోంది.
ఇప్పటి వరకు బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తుండగా తాజా ఫార్ములా (శివసేన 151, బీజేపీ 130, మిత్రపక్షాలు 7 )పై మిత్రపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమకు గౌరవప్రదమైన స్థానాలు కేటాయించనట్టయితే ఒంటరిగా బరిలోకి దిగనున్నట్టు శివసేన, బీజేపీలను హెచ్చరించాయి. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల మద్య కూడా సీట్ల పంపకాలపై సయోధ్య కుదరలేదు. ఎన్సీపీ 144 సీట్లు ఇవ్వాలన్న డిమాండ్‌పై పట్టుబడుతుండగా కాంగ్రెస్ మాత్రం దీనికి ససేమిరా అంటోంది.
పితృపక్షాల కారణంగానే..?
పితృపక్షాల కారణంగానే నిర్ణయాలు తీసుకోవడంలేదని తెలిసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పెద్దగా ఎవరు నామినేషన్లు కూడా దాఖలు చేయకపోవడానికి కారణం కూడా పితృపక్షాలేనని చెబుతున్నారు. గురువారంతో పితృపక్షాలు ముగియడంతోపాటు నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దీంతో పొత్తులపై తుది నిర్ణయాలతోపాటు అభ్యర్థుల జాబితాలను కూడా గురువారమే ప్రకటిస్తారని తెలుస్తోంది.
నామినేషన్ల పర్వం శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా శుక్ర, శనివారాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెన్నెస్ కూడా తమ బ్లూ ప్రింట్స్‌తో గురువారం మాటుంగాలోని షణ్మూకానంద్ హాల్‌లో కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలోనే ఎమ్మెన్నెస్ అధ్యక్షులు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని సమాచారం. మరోవైపు మిగతా పార్టీలలో ఆప్ పోటీ చేయనని ప్రకటించింది.
ఇక మిగిలిన ఎస్పీ, బీఎస్పీ, ఇతర రిపబ్లికన్ గ్రూపులు కూడా తొందర్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈసారి మరాఠ్వాడతోపాటు మైనార్టీ ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేసేందుకు ఎఐఎం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలపై తుది నిర్ణయం ఇప్పట్లో వెలువడే సూచనలు కనిపించ డంలేదు. మహాకూటమిలో సీట్ల పంపకాలపై ఓ స్పష్టత వెలువడ్డాకే ప్రజాస్వామ్య కూటమి సీట్ల పంపకాలపై నిర్ణయం వెలువడవచ్చని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు చెబుతున్నారు.