ముంబై: పక్షం రోజుల కిందట ముఖ్యమంత్రి కావాలన్న అభిలాషను వ్యక్తం చేసిన శివసేన అధినేత ఉద్ధవ ఠాక్రే ఇప్పుడు మాట మార్చారు. తనకు అటువంటి కోరికే లేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు మద్దతు తెలిపేందుకు, తనను ఆశీర్వదించేందుకు వార్కారీ సమాజ్‌కు చెందిన వారు మంగళవారం తన వద్దకు వచ్చారని ఉద్ధవ్ తెలిపారు. తనపట్ల వారు కురిపించిన ప్రేమ తనకు చాలని అన్నారు.
తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని చెప్పారు. విఠల్ భక్తులైన వార్కారీ సమాజ్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కావాలని ఉంటుందని, ఆ కుర్చీ కోసం పోట్లాడుతారని అన్నారు. ‘నేను ఎంత అదృష్టవంతుడినో చూడండి. నా తలపై కిరీటం వద్దని నేననుకుంటున్నాను. ప్రజలేమో నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఈ ప్రేమను గెలుచుకోవాలి’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. మరోవైపు కాషాయ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఉండాలని శివసేన పట్టుబడుతోంది. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల తర్వాతనే నాయకుడిని ప్రకటించాలని భావిస్తోంది.
ఈనెల 13 వ తేదీన ఓ టీవీ చానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్ధవ్ ఠాక్రే, మొదటిసారిగా ఓ బహిరంగ వేదికపై నుంచి, తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు తనకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని, ఆపై వారికి ఫిర్యాదు చేసే అవకాశం తానివ్వబోనని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం కలలు కనడం లేదని, అయితే ఆ బాధ్యత లభిస్తే మాత్రం వెనుకంజ వేయబోనని చెప్పారు.
నేటి దినాల్లో ముఖ్యమంత్రులు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం లేదని, వైమానిక సందర్శనలు చేసి ఆ తర్వాత పండర్‌పూర్ యాత్రకు వెళ్లిపోతారని ఉద్ధవ్ విమర్శించారు. ఎమ్మెన్నెస్‌పై కూడా ఉద్ధవ్ విమర్శలు సంధించారు. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీపై తాము పోరాడుతున్నామని,ఈ బరిలో మూడో పక్షం కూడా ఉందని ఆయన ఎమ్మెన్నెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ మూడో ఖాళీ ఎన్నడూ భర్తీ కాదని, అవసరమైతే దానికి (ఎమ్మెన్నెస్) వ్యతిరేకంగా కూడా తాము పోరాడుతామని ఠాక్రే స్పష్టం చేశారు.
నిర్లక్ష్యాన్ని సహించం: రాందాస్
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో తమను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని మహాకూటమి నాయకులను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే హెచ్చరించారు. మంత్రాలయలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. మహాకూటమిలో సీట్లసర్దుబాటుపై లుకలుకలుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకూటమికి తమతో అవసరం లేదనుకుంటే, ఆ విషయాన్ని తమకు ముఖాముఖి చెప్పేస్తే ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కుంటామన్నారు.
ఇరుపార్టీల నాయకులు తొందరపడవద్దని హితవు పలికారు. ‘పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమిని గద్దె దింపే సమయం ఆసన్నమైంది.. మహాకూటమికి అధికారాన్ని చేజిక్కించుకునే సమయం దగ్గరపడింది..ఇలాంటి సందర్భంలో గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న బంధాన్ని చెడగొట్టుకోవడం భావ్యంకాద’న్నారు. ఇరు పార్టీల నాయకుల్లో ఎవరో ఒకరు కొంత మెతక వైఖరి అవలంభించాలని ఆయన సూచించారు. లేదంటే అధికారం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి చేతిలోకి వెళుతుందని హెచ్చరించారు.
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తనతో సంప్రదించిన విషయం వాస్తవేమనన్నారు. దళితుల ఓట్లు గ్రేస్ మార్కుల లాంటివని, ఒకవేళ మహాకూటమి పొత్తు బెడిసి కొడితే ఎన్సీపీలోకి రావాలని పవార్ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఒకవేళ మహాకూటమి విడిపోతే తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే, అత్యధిక స్థానాలు ఇచ్చే పార్టీకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
అబ్బే.. అదేం లేదు!
Published Tue, Sep 23 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM
Advertisement